OTT: ఆ సినిమాలకు ఓటీటీ కష్టాలు.. ఇచ్చిన రేట్ కి ఫిక్స్ అవ్వాల్సిందేనా..
హిట్ అయితే ఒక రేటు... ఫట్ అయితే ఒక రేటు... ఇందులో కొత్తేం ఉంది అంటారా? మాటలో కొత్త లేకపోవచ్చు కానీ, ఇప్పుడు ఈ మాటను ఫాలో అవుతున్న వారిలో మాత్రం ఓ కొత్త వర్గం వచ్చి చేరారు. అందులోనూ సినిమా బిజినెస్‌లో ఇప్పుడు ఓ రకంగా కీ రోల్ ప్లే చేస్తున్నవారు ఈ స్టేట్‌మెంట్‌ని సిన్సియర్‌గా ఫాలో అవుతున్నారు. ఇంతకీ వారెవరో మీరు ఊహించేశారుగా... అయితే ఇంకేం డీటైల్డ్ గా మాట్లాడుకుందాం వచ్చేయండి....
Updated on: Aug 05, 2024 | 9:44 AM

ఏజెంట్ సినిమాను ఓటీటీలో చూద్దామని ఎదురుచూస్తున్నవారిలో మీరూ ఉన్నారా? థియేటర్లలో రిలీజ్ అయి తిరిగి చూసేలోపు ఓటీటీలో మూవీస్ వాలిపోతున్న ఈ టైమ్‌లో ఇంకా, ఏజెంట్‌కి విముక్తి ఎందుకు కలగలేదా? అని అనుకుంటున్నారా? ఇక్కడే లెక్కలు గట్టిగా వినిపిస్తాయి మరి...

సినిమా రిలీజ్‌కి ముందే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంటే ప్రొడ్యూసర్ ఓ రకంగా సేఫ్ అయినట్టు. అలా కాకుండా సినిమా మీద హోప్స్ తో ఆఫ్టర్ రిలీజ్ డీల్ ఫైనల్ చేసుకోవాలనుకుంటే మాత్రం రిస్క్ లో ఉన్నట్టే.

మూవీ విడుదలయ్యాక హిట్ అయితే ఓకే. ఒకవేళ కాకపోతే పరిస్థితి ఏంటి? ముందనుకున్న మాటల ప్రకారమే డీల్ క్లోజ్ చేసుకోవడానికి డిజిటల్ సంస్థలు సుముఖత చూపడం లేదు... ఓటీటీలు ఎంత ఇస్తామంటే అంత తీసుకుని మేకర్స్ రిలీజ్ చేసుకోవాల్సిందే... కాదూ... కూడదు అంటే మాత్రం మూవీస్ ఓటీటీ అడ్రస్ గల్లంతేనన్నమాట.

ఏజెంట్ ఓటీటీ డీల్ క్లోజ్ అయిందనే మాటలే వినిపిస్తున్నా, ఇప్పటిదాకా ఓటీటీలో అడ్రస్ లేదు. మరి ఈ రూట్లోనే భారతీయుడు2 సినిమా కూడా చేరనుందా? కల్కి సినిమాకు వచ్చిన క్రేజ్... నిజానికి భారతీయుడు 2 ఓటీటీ డీల్‌కి ప్లస్ అయ్యేది. కానీ అప్పుడు శంకర్ అండ్ కో... ఆగుదాం... రిలీజ్ తర్వాత సాగుదాం అనుకున్నారు.

భారతీయుడు2కి మార్నింగ్ షోకే ఫ్లాప్ టాక్ వచ్చేయడంతో ఇప్పుడు ఓటీటీలు రిలీజ్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఎలాగూ థియేట్రికల్ కలెక్షన్లు పూర్ కాబట్టి, ఓటీటీలో వచ్చే డబ్బుతో అయినా కాసింత సేఫ్ అవుదామనుకున్నారు మేకర్స్. అయితే, ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే, ఆ సినిమాకు మేకర్స్ డిమాండ్ చేస్తున్న నెంబర్స్ తో క్లోజ్ చేయడానికి ఓటీటీలు ముందుకు రావడం లేదనే మాట వినిపిస్తోంది.




