Nagarjuna: కింగ్ 100వ సినిమా రేసులో ఆ దర్శకుడు
ఏ హీరోకైనా 100వ సినిమా అంటే చాలా ప్రత్యేకం.. దాన్ని వీలైనంత స్పెషల్‌గా మార్చుకోడానికే చూస్తుంటారు. నాగార్జున కూడా ఇదే చేస్తున్నారు. ఈయన 100వ సినిమా కోసం బ్యాగ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అంతేకాదు స్క్రిప్ట్ కూడా స్పెషల్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ సినిమాలో మరో సూపర్ సర్‌ప్రైజ్ ఉండబోతుంది. మరి అదేంటి.. ఇంతకీ ఆ పనులు ఎంతవరకు వచ్చాయి..?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Mar 19, 2025 | 7:26 PM

నాగార్జున కెరీర్ మొదలై 38 ఏళ్లైంది. తాజాగా 100వ సినిమాకు చేరువవుతున్నారు గ్రీకువీరుడు. అతిథి పాత్రలు, చిన్న కారెక్టర్స్ అన్నీ కలిపితే నాగార్జున 100 సినిమాలు ఎప్పుడో అయిపోయాయి.. కానీ హీరోగా మాత్రం సెంచరీ కొట్టలేదు మన్మథుడు.

గతేడాది సంక్రాంతికి వచ్చిన నా సామిరంగా ఈయనకు 99వ సినిమా అంటున్నారు. ఈ లెక్కన 100వ సినిమా కోసం గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. తన మైల్ స్టోన్ సినిమాలో అక్కినేని ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఉండబోతుంది.

తన 100వ సినిమాలో నాగ చైతన్య, అఖిల్ ఉండేలా చూసుకుంటున్నారు నాగ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే తన 100వ సినిమా.. మనంలా మరో క్లాసిక్ అవ్వాలనేది నాగార్జున ప్లాన్. అలాంటి కథ కోసమే చాన్నాళ్లుగా వేచి చూస్తున్నారు.

నా సామిరంగా తర్వాత సోలో సినిమా సైన్ చేయకపోవడానికి కూడా ఇదే కారణమని తెలుస్తుంది. నాగ్ ఎదురు చూస్తున్న కథ తమిళ దర్శకుడు కార్తిక్ తీసుకొచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం రజినీకాంత్ కూలీ, ధనుష్ కుబేరా సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు నాగ్.

ఇవి పూర్తైన తర్వాత 100వ సినిమా సెట్స్‌పైకి రానుంది. త్వరలోనే తన మైల్ స్టోన్ మూవీపై అధికారిక ప్రకటన చేయనున్నారు నాగార్జున. ఈలోపు కుబేరా, కూలీ సినిమాలతో ఫ్యాన్స్‌ను పలకరించనున్నారు కింగ్.





























