- Telugu News Photo Gallery Chaudhary charan singh jayanti why his birthday becomes national farmers day and interesting facts
Chaudhary Charan Singh: భారత రత్న అందుకోనున్న చరణ్ సింగ్.. జయంతిని రైతు దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
అన్నదాతకు ఆత్మబంధువుగా పిలువబడే దేశ ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుని ప్రకటించింది. చౌదరి చరణ్ సింగ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు నేటి యువతకు ప్రేరణగా నిలుస్తాయి. మరికొందరు అతని ఆత్మగౌరవాన్ని మొండితనంగా భావిస్తారు. దేశ స్వాతంత్య్ర పోరాటమైనా, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమైనా.. రెండింటిలోనూ ముఖ్యపాత్ర పోషించిన చౌదరి చరణ్ సింగ్.. స్వాతంత్య సమరయోధుడు, రాజకీయ నేతగా కంటే రైతు బంధువుగానే గుర్తుకొస్తారు.
Updated on: Feb 09, 2024 | 6:42 PM

1902 డిసెంబరు 23న హాపూర్‌లో జన్మించిన చౌదరి చరణ్ సింగ్ ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసి 1928లో ఘజియాబాద్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అదే సమయంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం ప్రారంభించారు. ఇలా రాజకీయాల్లో అడుగు పెట్టడానికి తోలి అడుగులు పడ్డాయి. 1937లో తొలిసారిగా చౌదరి చరణ్ సింగ్ యూపీలోని ఛప్రౌలీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వెనుదిరిగి చూసుకోలేదు.

ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ప్రధాని: 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ముఖ్యమైన భాగమైన చౌదరి చరణ్ సింగ్ దీనిని వ్యతిరేకించారు. దీంతో చౌదరి చరణ్ సింగ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఎమర్జెన్సీ తర్వాత దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మొదటిసారిగా కాంగ్రెసేతర పార్టీలు దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా మొరార్జీ దేశాయ్, ఆయన ప్రభుత్వంలో రైతు నాయకుడు చౌదరి చరణ్ సింగ్‌కు ఉప ప్రధాని, హోం మంత్రి పదవిని ఇచ్చారు. ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేదు. జనతా పార్టీలో విభేదాల కారణంగా ఆయన ప్రభుత్వం పడిపోయింది.

ఇందిరా గాంధీ నుండి మద్దతు తీసుకోలేదు: మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత చౌదరి చరణ్ సింగ్ 1979లో కాంగ్రెస్ యు మద్దతుతో ప్రధానమంత్రి అయ్యారు. అయితే ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన బలం ఆయనకు లేదు. కావాలంటే ఇందిరాగాంధీ మద్దతు తీసుకుని తన ప్రభుత్వాన్ని కాపాడుకోవచ్చు కానీ అలా చేయలేదు. చౌదరి చరణ్ సింగ్ ఇలా పట్టుబట్టడం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందని అంటున్నారు. ఎమర్జెన్సీ విషయంలో తనపై, కాంగ్రెస్ నేతలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ఇందిరా గాంధీ కోరారు. చౌదరి చరణ్ సింగ్‌కు ఇది ఆమోదయోగ్యం కాని షరతు. దీంతో చరణ్ సింగ్ తన రాజీనామాను 1979 ఆగస్టు 21న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డికి సమర్పించారు. కేవలం 23 రోజులు మాత్రమే దేశ ప్రధానిగా కొనసాగిన ఆయన ఈ కాలంలో పార్లమెంటు సమావేశాలు జరగనందున పార్లమెంటును ఎదుర్కొనే అవకాశం కూడా రాలేదు.

స్వాతంత్య్ర సమరయోధుల వారసులు: చౌదరి చరణ్ సింగ్ పూర్వీకులు 1857లో మొదటి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తన పూర్వీకుల ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళుతూ, చౌదరి చరణ్ సింగ్ కూడా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తూ 1929లో జైలుకు వెళ్లారు. అయినప్పటికీ ఆయన వెనకడుగు వేయలేదు. 1940లో బ్రిటీష్ ప్రభుత్వం ఆయనను రెండోసారి జైలుకు పంపింది. అప్పుడు కూడా ఆయన తన మార్గాన్ని మార్చుకోలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా.. కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. వివిధ ముఖ్యమైన పదవులలో పనిచేశారు.

రెవెన్యూ మంత్రి అయిన వెంటనే జమీందారీ రద్దు చట్టం అమలులోకి: చౌదరి చరణ్‌సింగ్‌ను రైతుల ఆత్మ బంధువు అని పిలుస్తారంటే అతిశయోక్తి లేదు. 1937లో యూపీలోని ఛప్రౌలీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, ఆ తర్వాత కూడా విజయం సాధించారు. 1946, 1952, 1962, 1967లలో కూడా అదే ప్రాంత ప్రజలు ఆయనను ఆదరించి తమ నాయకునిగా ఎన్నుకున్నారు. గోవింద్ వల్లభ్ పంత్ ప్రభుత్వంలో.. అతను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. రెవెన్యూ, న్యాయ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించారు.

డాక్టర్ సంపూర్ణానంద్ అయినా, చంద్రభాను గుప్తా అయినా, రెండు ప్రభుత్వాల్లోనూ ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను పొందారు. 1952, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ మంత్రిగా చౌదరి చరణ్ సింగ్ రైతులకు నిజమైన నేస్తంగా అవతరించిన సంవత్సరం. మంత్రి పదవితో పాటు ఈ ఏడాది అసెంబ్లీలో జమీందారీ నిర్మూలన చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టం వచ్చిన తర్వాత భూస్వాముల నుంచి ఎక్కువ భూమిని తీసుకుని వాటిలో పనిచేస్తున్న నిజమైన రైతులకు ఇచ్చారు. ఇప్పటి వరకు భూస్వాముల వద్ద కూలిపనులు చేసిన రైతులే అనంతరం ఆ భూమికి యజమానులుగా మారారు.

పట్వారీల సామూహిక రాజీనామాను ఆమోదించారు: అది 1952వ సంవత్సరం. జమీందారీ నిర్మూలన చట్టం ఆమోదించిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని 27 వేల మంది పట్వారీలు ఆందోళన ప్రారంభించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏకంగా రాజీనామాలు చేశారు. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందని భావించారు కానీ నిజానికి అందుకు విరుద్ధంగా జరిగింది. అందరి రాజీనామాలను చౌదరి చరణ్ సింగ్ ఆమోదించారు. ఉత్తరప్రదేశ్‌లో కొత్త పట్వారీలను నియమించారు. ఇందులో చౌదరి చరణ్ సింగ్ కృషి కారణంగా 18 శాతం హరిజనులు కూడా ఈ పదవులకు ఎంపికయ్యారు.

పండిట్ నెహ్రూతో విభేదాల కారణంగా కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు: జవహర్ లాల్ నెహ్రూతో విభేదాల కారణంగా చౌదరి చరణ్ సింగ్ కాంగ్రెస్‌ను వీడారు. ఆ తర్వాత భారతీయ క్రాంతి దళ్‌ని స్థాపించారు. రాజ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా సహాయంతో 3 ఏప్రిల్ 1967న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మరుసటి సంవత్సరం ఏప్రిల్ 17న రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఎన్నికలలో 1970 ఫిబ్రవరి 17న మళ్లీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి ప్రధాని పదవిని చేపట్టారు. అనంతరం ఆయన జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో రైతుల గురించి మాట్లాడినప్పుడల్లా చౌదరి చరణ్ సింగ్ చర్చకు వస్తారు.




