- Telugu News Photo Gallery Business photos These are the Panch Pandavas among electric cars, They are comparable to these in range, speed, capacity, Best electric cars details in telugu
Best electric cars: ఎలక్ట్రిక్ కార్లలో పంచ పాండవులు ఇవే.. రేంజ్, స్పీడ్, కెపాసిటీలో వీటికివే సాటి
దేశంలోని రహదారులపై ఎలక్ట్రిక్ కార్ల పరుగులు ఊపందుకున్నాయి. వాటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థలన్నీ ఈ విభాగంలో తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. పెట్రోలు, డీజిల్ తో నడిచే వాహనాలతో పోల్చితే వీటికి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అలాగే పర్యావరణానికి నష్టం వాటిల్లదు. దీంతో చాలామంది ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వాటి ధర, రేంజ్ విషయంలో అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఐదు మంచి ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం. వాటి ధర, ప్రత్యేకతలు, ఇంజిన్ సామర్థ్యం, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
Updated on: Oct 30, 2024 | 3:25 PM

దేశంలో అత్యంత చిన్నదైన, తక్కువ ధరలో లభిస్తున్న ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్. ఈ కారు కేవలం 2.9 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు, 1.6 మీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. పట్టణ ట్రాఫిక్ లో సులభంగా నడపడంతో పాటు చిన్న ప్రదేశాల్లో కూడా ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. దీనిలోని 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ని ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే దాదాపు 230 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. దీనికి డీసీ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం లేదు. టైప్ 2 ఏసీ చార్జర్ తో సుమారు ఐదు గంటల్లో 80 శాతం చార్జింగ్ అవుతుంది. దీని మోటారు నుంచి 41 బీహెచ్ పీ, 110 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. ఎంపీ కామెట్ కారు ధర రూ.6.9 లక్షలు.

టాటా టియాగో అత్యంత అందుబాటు ధరలో ఉంటే కారుగా పేరు పొందింది. దీని ధర రూ.7.9 లక్షల నుంచి మొదలవుతుంది. మీడియం రేంజ్ (ఎంఆర్), లాంగ్ రేంజ్ (ఎల్ఆర్) అనే రకాల మోడళ్లలో తీసుకువచ్చారు. ఎంఆర్ లో 19.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. ఈ మోడల్ 257 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఎల్ఆర్ మోడల్ లో 24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఒక్కసారి చార్జింగ్ చేసుకుంటే 315 కిలోమీటర్లు పరుగులు పెడుతుంది. 15ఏ చార్జర్ తో సుమారు 9 గంటల్లో 80 శాతం వరకూ చార్జింగ్ చేసుకోవచ్చు. అదే డీసీ చార్జర్ తో గంటలోనే పూర్తవుతుంది.

సెట్రోయిన్ ఈ-సీ3 కారులో 29.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 320 కిలోమీటర్లు నడుస్తుంది. నాలుగు స్పీకర్లు, 10.2 అంగుళాల టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కోసం వైర్ లైస్ సపోర్టు తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. మోటారు నుంచి 76 బీహెచ్ పీ, 143 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది. 15 ఏ చార్జర్ తో దాదాపు 10 గంటలలో పూర్తి చార్జింగ్ చేసుకోవచ్చు. డీసీ ఫాస్ట్ చార్జర్ ను ఉపయోగిస్తే గంటలోనే పూర్తవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు రూ.11.70 లక్షలకు అందుబాటులో ఉంది.

టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లలో అందుబాటులోకి వచ్చింది. 25 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ 315 కిలోమీటర్లు, 36 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ 421 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. సిటీ, ఎకో, స్పోర్ట్ అనే మూడు రకాల మోడ్ లలో ఆకట్టుకుంటోంది. దీనిలో మొదటి సారిగా యాక్టి.ఈవీ అనే ఆర్కిటెక్చర్ ను ఉపయోగించారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 190 ఎంఎం ఉండడంతో పట్టణ రహదారులతో పాటు ఎత్తయిన పర్వతాల రోడ్లపై కూడా సునాయాసంగా ప్రయాణం చేయవచ్చు. ఈ కారు ధర రూ.10.9 లక్షలు.

ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి టాటా టిగోర్ మంచి ఎంపిక. ఈ కారును ఒక్కసారి చార్జింగ్ చేస్తే 315 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. 26 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, ఫోర్ స్టార్ గ్లోబల్ ఎన్ సీఏపీ భద్రతా రేటింగ్ దీని ప్రత్యేకతలు. సాధారణ 15 ఏ చార్జర్ ను ఉపయోగించి సుమారు 9 గంటలలో పది శాతం నుంచి 80 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు. అదే డీసీ చార్జర్ తో కేవలం ఒక గంటలో పూర్తవుతుంది. అలాగే మోటారు నుంచి 73 బీహెచ్ పీ, 170 ఎన్ ఎం గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. ఈ కారు రూ.12.50 లక్షలకు అందుబాటులో ఉంది.




