- Telugu News Photo Gallery Business photos These are the best money saving tips, check details in telugu
Money Saving Tips: మీ డబ్బును ఆదా చేసే పంచ సూత్రాలు.. పాటిస్తే భవిష్యత్తు భద్రం..
జీవితంలో ఎంత సంపాదిస్తున్నామన్నది ముఖ్యం కాదు గానీ.. ఎంత పొదుపు చేస్తున్నమన్నది ముఖ్యం. వచ్చిన డబ్బును వచ్చినట్లు ఖర్చు చేసేస్తుంటే చివరికి ఏమీ మిగలదు. అందుకే ఆర్థిక నిర్వహణ అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. సరైన ఆర్థిక ప్రణాళికతో పాటు ఆర్థిక నిర్వహణపై అవగాహన లేకపోవడంతోనే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ధేశించుకొని సరైన విధంగా ప్రణాళికతో వెళ్తే మీకు కావాల్సిన సంపదను సృష్టించుకోవచ్చు. చిన్న చిన్న లక్ష్యాలను ముందు నిర్ధేశించుకోవాలి.. అంటే రోజువారీ ఖర్చుల నుంచి నెలవారీ పొదుపులకు ప్రణాళిక చేసుకోవచ్చు. అందుకు ఉపయోగపడే టిప్స్ మీకు అందిస్తున్నాం..
Updated on: Sep 06, 2024 | 3:37 PM

పొదుపు ప్రణాళిక.. జీవితంలో పొదుపు చేయడాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలి. మీ సంపాదన ప్రారంభమైన కొత్తలోనే ఆదాయం తక్కువగా ఉన్నా ఎంతో కొంత పొదుపు చేయడం నేర్చుకోవాలి. అప్పుడే అది అలవాటుగా మారుతుంది. ఆదాయం పెరిగినప్పుడు అనవసర ఖర్చులు లేకుండా పొదుపు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.

ఖర్చులు తగ్గించుకోవాలి.. సాధారణంగా మనం చేసే తప్పు ఏంటంటే.. ఖర్చులు పోనూ మిగిలిన మొత్తాన్ని పొదుపు చేయాలని భావిస్తాం. ఇదే పెద్ద తప్పు. ముందు ప్రణాళిక చేసుకొని.. బడ్జెట్ రూపొందించుకొని పొదుపు కేటాయించిన మొత్తం తీసేసిన తర్వాత మిగిలిన దాని నుంచి ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలి. అప్పుడే అవకాశం ఉన్నంత వరకూ ఖర్చులు తగ్గించుకుంటాం. పొదుపులను వేరే పథకాలలో పెట్టుబడులు పెట్టడం కూడా అలవాటు చేసుకోవాలి. మంచి పథకాలను ఎంపిక చేసుకొని పెట్టుబడులు పెట్టాలి.

అత్యవసర పరిస్థితులు.. జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఏ సమయంలో ఏ అవసరం వస్తుందో చెప్పలేం. అత్యవసర పరిస్థితులకు తగిన మొత్తాన్ని కేటాయించాలి. ఆర్థికంగా మీపై ఆధారపడిన సభ్యులు ఉంటే.. టర్మ్ ప్లాన్ ద్వారా తగినంత కవరేజ్ తో బీమా తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్య బీమా తీసుకోవడం ఉత్తమం.

ఈఎంఐల భారం.. మీ సంపాదనకు అనుగుణంగా ఈఎంఐలు ఉండాలి. లోన్లు మంజూరవుతున్నాయి కదా అని మీ సంపాదనకు మించి తీసుకోకూడదు. వీలైనంత వరకూ ఈఎంఐ భారం లేకుండా చూసుకోవడం ఉత్తమం. గృహ రుణాలు, పర్సనల్ లోన్లు తీసుకుంటే వాటి కాల వ్యవధి తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. లేకపోతే మనం కట్టే వడ్డీ చాలా ఎక్కువ అవుతుంది. అది అదనపు భారాన్ని మీపై మోపుతుంది.

క్రెడిట్ కార్డు వినియోగం.. చాలా మంది క్రెడిట్ కార్డులు వినియోగిస్తూ ఉంటారు. వాటి బిల్లులు చెల్లించే వేళ చాలా సార్లు మినిమమ్ డ్యూ కట్టేసి ఊరుకుంటారు. దీని వల్ల అదనపు వడ్డీలు పడే ప్రమాదం ఉంటుంది. కొన్ని కార్డులపై 40శాతం అంతకంటే ఎక్కువ వడ్డీరేటు విధిస్తారు. ఇది మీ పొదుపు, పెట్టుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి అధిక ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.




