- Telugu News Photo Gallery Business photos Maruti suzuki plans rs 18000 crore investment for new haryana plant report
Maruti Suzuki: కార్ల కంపెనీ మారుతి సుజుకీ కీలక నిర్ణయం.. రూ.18 వేల కోట్లతో కొత్త ప్లాంట్
Maruti Suzuki: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా రూ.18 వేల కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాంట్‌ను నిర్మించాలని భావిస్తోంది.ఈ కొత్త ప్లాంట్ ..
TV9 Telugu Digital Desk | Edited By: Subhash Goud
Updated on: Jul 15, 2021 | 8:18 PM

Maruti Suzuki: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా రూ.18 వేల కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాంట్‌ను నిర్మించాలని భావిస్తోంది.ఈ కొత్త ప్లాంట్ గురుగ్రామ్‌లోని ప్లాంట్ స్థానంలో ఏర్పాటవుతుంది. దీని వార్షిక కార్ల ఉత్పత్తి సామర్థ్యం 7.5 నుంచి 10 లక్షల మధ్యన ఉంటుంది.

గురుగ్రామ్ ప్లాంట్‌ను సమీపంలోని మరో ప్రాంతానికి తరలించాలని తాము ఎంతో కాలంగా భావిస్తున్నామని ఎంఎస్‌ఐ చైర్మన్ ఆర్‌సి భార్గవ వెల్లడించారు. అయితే కొత్త ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నది వివరాలు ఆయన వెల్లడించలేదు.

ఆ ప్లాంట్‌ను హర్యానాలో ఏదో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్నది తమ ఆలోచన అని ఆయన పేర్కొన్నారు. ఏ కంపెనీ అయినా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న విధానంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని, దానిపై ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆయన చెప్పారు.

కాగా,1983లో మారుతి నెలకొల్పిన తొలి ఫ్యాక్టరీ గురుగ్రామ్ ప్లాంట్. అక్కడ నుంచే తొలి కారు విడుదలైంది. కానీ ఇప్పుడది నివాస ప్రాంతాల మధ్యన ఉండడం, ట్రాఫిక్ సమస్యల కారణంగా దానిని తరలించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్లాంట్‌తో పాటు హర్యానాలోని మనేసార్‌లో రెండో ప్లాంట్ కూడా ఉంది. ఈ రెండు ప్లాంట్ల ఉమ్మడి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 15.5 లక్షలు. గుజరాత్‌లో ఏడాదికి 7.5 లక్షల ఉత్పత్తి సామర్థ్యంతో మూడో ప్లాంట్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఉత్పత్తి ప్రారంభించింది.





























