- Telugu News Photo Gallery Business photos Harvest Strawberries In Your One Acre Farm Land, Will Get Rs 15 To 20 Lakhs Per 3 Months
ఎకరం పొలం ఉందా.? కేవలం 90 రోజుల్లోనే రూ. 20 లక్షల వరకు ఆదాయం మీ సొంతం.. వివరాలు ఇవిగో!
అల్లూరి ఏజెన్సీలో ఇప్పటికే యాపిల్, డ్రాగన్ ఫ్రూట్ పంటలు సక్సెస్‌ఫుల్‌గా సాగవుతున్నాయి. ఇప్పుడు వాటి సరసన చేరింది నోరూరించే స్ట్రాబెర్రీ. ఈ పంట ఇప్పుడు గిరిజన రైతులకు సిరుల పంట పండిస్తోంది.
Maqdood Husain Khaja | Edited By: Ravi Kiran
Updated on: Feb 15, 2024 | 1:30 PM

అల్లూరి ఏజెన్సీలో ఇప్పటికే యాపిల్, డ్రాగన్ ఫ్రూట్ పంటలు సక్సెస్‌ఫుల్‌గా సాగవుతున్నాయి. ఇప్పుడు వాటి సరసన చేరింది నోరూరించే స్ట్రాబెర్రీ. ఈ పంట ఇప్పుడు గిరిజన రైతులకు సిరుల పంట పండిస్తోంది. విదేశాల్లో పుట్టి ఆంధ్ర ఊటీలో విరగ్గాస్తున్న వింటర్ డాన్ స్ట్రాబెరీ పంట విశేషాలు ఒకసారి తెలుసుకుందామా..

అమెరికాలో పురుడు పోసుకున్న లవ్ ఫ్రూట్.. స్ట్రాబెరీ పంట ఇప్పుడు మన చెంతే విరగ్గాస్తోంది. అరకులోయలో గిరి రైతులు విజయవంతంగా ఈ పంటను సాగుచేస్తున్నారు. ఈ సీజన్‌లో స్ట్రాబెర్రీ పంటను సాగు చేస్తున్నారు. శీతల వాతావరణంలో విశిష్టత కలిగిన స్ట్రాబెర్రీ సాగుకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ జిల్లా వాతావరణం అనుకూలంగా మారింది. లంబసింగి ప్రాంతంలో స్ట్రాబెరీని రైతులు ఇప్పటికే సాగుచేస్తున్నారు. ఒకప్పుడు ధనవంతుల ఆహారంగా పేరుగాంచిన స్టాబెర్రీని.. ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తున్నారు గిరిజన రైతులు.

అరకు లోయలోని గిరి గ్రామదర్శిని ఎదురుగా నాలుగు ఎకరాల స్థలంలో స్ట్రాబెర్రీ పండిస్తున్నారు. మన్యం వాతావరణానికి వింటర్ డాన్ రకం అధిక దిగుబడినిస్తోంది. ఏడాదిలో ఎకరాకు 5 లక్షల నుంచి ఏడు లక్షల పెట్టుబడితో మూడు నెలల్లోనే పంట చేతికొచ్చి 15 - 20 లక్షల వరకు లాభం సమకూరుతుందని అంటున్నారు గిరి రైతు లచ్చన్న దొర.

డిమాండ్‌ను బట్టి కిలో 3 నుంచి 4 వందల వరకు అమ్ముతున్నారు రైతులు. పర్యాటకులకు, స్థానికులకు మాత్రం ధరలో కాస్త మినహాయింపు. కొన్ని రోజుల్లో 50-100 రూపాయలకే 250 గ్రాముల బాక్సును ఇస్తున్నారు. ఆర్గానిక్ పద్దతిలో సాగు చేస్తుండంతో రుచి కూడా నోరు ఊరుస్తోంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తోంది అరకు స్ట్రాబెరీ. అరుకులోని వాతావరణానికి తోడు.. సేంద్రీయ పద్ధతిలో సాగు జరుగుతోంది కాబట్టి పంట కూడా పుష్కలంగా పండుతుంది. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో వస్తోంది.

క్వాలిటీ కూడా నెంబర్ వన్‌గా మారింది. ఒక్కో పండు ఇతర ప్రాంతాల కంటే పరిమాణంలో 200 గ్రాముల వరకు ఎక్కువగా పెరుగుతూ చేతికొస్తుంది. దీంతో వాటిని కొనుగోలు చేసేందుకు జనం బారులు తీరుతున్నారు. స్థానికంగా అమ్మకాలతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతులు చేస్తున్నామని అంటున్నాడు స్ట్రాబెర్రి గిరీ రైతు కామేష్. కాగా, మహాబలేశ్వరం నుంచి తెచ్చి సాగు చేస్తున్న ఈ స్ట్రాబెర్రీని.. మరిన్ని పద్ధతులు, జాగ్రత్తలు పాటిస్తూ.. పంట వేస్తే.. పుష్కలంగా దిగుబడులు వస్తాయంటున్నారు ఉద్యానవన శాస్త్రవేత్తలు.





























