మట్టి వాసన.. దీపాల వెలుగు.. ఆరెపల్లిలో దీపావళి సందడి చూస్తే మతిపోతుంది!
దీపావళి వచ్చిందంటే చాలు.. ఇళ్లన్నీ దీపాలతో వెలుగుతాయి. ఆ దీపాలు వెలగాలంటే ప్రమిదలు కావాలి. అలాంటి ప్రమిదలకు కేరాఫ్ అడ్రస్ ఏంటో తెలుసా? కరీంనగర్ శివారులోని ఆరెపల్లి.. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. దీపావళి పర్వదినం కోసం ఇక్కడే లక్షలాది ప్రమిదలు తయారవుతాయి. తయారు చేయడమే కాదు, ఇక్కడి నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు, హైదరాబాద్‌కు కూడా ఎగుమతి అవుతాయి.
Updated on: Nov 06, 2026 | 5:24 PM

వారసత్వంగా వస్తున్న వృత్తి ఆరెపల్లిలో చాలా ఏళ్లుగా ఈ వృత్తిని కొన్ని కుటుంబాలు నమ్ముకొని జీవిస్తున్నాయి. తాతల నుంచి తండ్రులకు, తండ్రుల నుంచి కొడుకులకు వారసత్వంగా వచ్చిన పని ఇది. పూర్తిగా నాణ్యమైన మట్టితో, ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్రమిదలను తయారు చేస్తారు. చిన్న ప్రమిద నుంచి పెద్ద ప్రమిద వరకు, సాదా ప్రమిద నుంచి డిజైన్ ప్రమిదల వరకు అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి.

పర్యావరణాన్ని కాపాడే విధంగా ఈ ప్రమిదలను తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.లక్షలాది ప్రమిదలు.. హైదరాబాద్‌కి ఇక్కడి నుంచే ఎగుమతి దీపావళి నెల రోజుల ముందు నుంచే ఆరెపల్లిలో సందడి మొదలవుతుంది. కుమ్మరి కుటుంబాలన్నీ రాత్రింబవళ్ళు శ్రమించి లక్షలాది ప్రమిదలను తయారు చేస్తారు. వ్యాపారస్తులు నేరుగా ఇక్కడికే వచ్చి, లారీల కొద్దీ ప్రమిదలను కొనుగోలు చేసి తీసుకెళ్తారు. వాటిని హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ వంటి వివిధ ప్రాంతాల్లో అమ్ముతారు.

వినియోగదారులు కూడా చౌకగా, నాణ్యమైన ప్రమిదలు దొరుకుతాయని నేరుగా ఆరెపల్లికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. లక్షలాది ప్రమిదలు ఒకే చోట చూడాలంటే ఆరెపల్లికి రావాల్సిందే అన్నట్టుగా పరిస్థితి ఉంది. అయితే ఇటీవల చైనా నుంచి, మహారాష్ట్ర నుంచి రెడీమేడ్, రంగురంగుల ప్రమిదలు మార్కెట్లోకి రావడంతో స్థానిక కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ప్లాస్టిక్, కెమికల్‌తో చేసిన ఆ ప్రమిదలు చూడటానికి అందంగా ఉన్నా, వాటి వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. అయినప్పటికీ ఈ పోటీని తట్టుకొని, ఆరెపల్లి కార్మికులు తమ వృత్తిలోనే కొనసాగుతున్నారు. మేము పూర్తిగా మట్టితోనే ప్రమిదలను తయారు చేస్తున్నాం, స్థానికంగా మాకు ఇంకా మంచి గిరాకీ ఉందని కార్మికులు చెబుతున్నారు.

ఇలాంటి చేతి వృత్తులు రోజురోజుకీ కనుమరుగవుతున్నాయి. వీటిని కాపాడే బాధ్యత ప్రభుత్వంతో పాటు మనపై కూడా ఉంది.ఈ దీపావళికి చైనా ప్రమిదలను కాకుండా, స్థానికంగా తయారు చేసిన మట్టి ప్రమిదలను కొనుగోలు చేయడం. అలా చేస్తే ఆరెపల్లి కుమ్మరులకు ఉపాధి కల్పించిన వాళ్ళమవుతాం. మిదలే కాదు, ఇతర మట్టి పాత్రల వినియోగం పెరిగితే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.మొత్తానికి దీపావళి వస్తే చాలు, ఆరెపల్లి మట్టి వాసనతో, ప్రమిదల వెలుగుతో కళకళలాడుతుంది.
