BJP Decision: తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయాలు.. రెండు కార్యక్రమాలతో జనంలోకి దూసుకువెళ్ళాలని భావన

డ్యామేజీ కంట్రోల్ చర్యలను వేగవంతం చేస్తోంది బీజేపీ అధినాయకత్వం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనతో పార్టీ క్యాడర్‌లో వచ్చిన జోష్‌ని మెయింటేన్ చేయాలని...

BJP Decision: తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయాలు.. రెండు కార్యక్రమాలతో జనంలోకి దూసుకువెళ్ళాలని భావన
Bjp
Follow us
Rajesh Sharma

|

Updated on: Jul 11, 2023 | 8:21 PM

BJP Decision: తెలంగాణలో డ్యామేజీ కంట్రోల్ చర్యలను వేగవంతం చేస్తోంది బీజేపీ అధినాయకత్వం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనతో పార్టీ క్యాడర్‌లో వచ్చిన జోష్‌ని మెయింటేన్ చేయాలని భావిస్తోంది. జులై 8న ప్రధాని వరంగల్ పర్యటనకు వచ్చి వెళ్ళగా… మర్నాడే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల నాయకులతో పార్టీ అధినేత జేపీ నడ్డా హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ సిటీని వేదికగా నిర్ణయించడం వెనుక కూడా బీజేపీ వ్యూహం తెలంగాణ శ్రేణులకు ఓ స్పష్టమైన మెసేజ్ పంపాలనుకోవడమే. దక్షిణాదిన పార్టీ పరిస్థితి మెరుగుపరుచుకోవాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో ఈ సమావేశం జరిగింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలలో మాగ్జిమమ్ ఎంపీ సీట్లను గెలుచుకుంది. అక్కడ సీట్ల తగ్గడమే కానీ మరింత పెరిగే అవకాశాలు తక్కువ. ఒకవేళ అక్కడ ఎంపీ సీట్ల సంఖ్య తగ్గితే దానిని దక్షిణాది రాష్ట్రాల నుంచి కాంపన్సేట్ చేసుకోవాలనుకుంటోంది కమల దళం. అందుకే హైదరాబాద్ వేదికగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్ఛేరి, కర్నాటక, కేరళ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీలతో సమావేశం నిర్వహించారు. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, తమిళనాడులో 39, పుదుచ్చేరిలో 1, కేరళలో 20, కర్నాటకలో 28 ఎంపీ సీట్లున్నాయి. అయితే, కర్నాటక, తెలంగాణలలో మాత్రమే బీజేపీకి చెప్పుకోదగిన స్థాయిలో లోక్‌సభ సభ్యులున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణాలోని ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, సికింద్రాబాద్ ఎంపీ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. తమిళనాడు, కేరళ, ఏపీల్లో బీజేపీకి బలం అంతగా లేదు. అయితే, తమిళనాడులో ఈ మధ్య బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీలో జనసేన పార్టీతో ఆల్ రెడీ స్నేహం వుంది. తెలుగు దేశం పార్టీతో జత కడుతుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే బీజేపీ అధినాయకత్వం మరోవైపు ఏపీలో అధికార పార్టీ అయిన వైఎస్సర్సీపీని ఎన్డీయేలో చేర్చుకునేందుకు ప్రాధాన్యతనిస్తోందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల తర్వాత బయట్నించి మద్దతిచ్చేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడీగా వున్నా.. ఆయన పార్టీని ఎన్నికలకు ముందే ఎన్డీయేలో చేర్చుకోవాలన్నది బీజేపీ అధినాయకత్వం ఆలోచన అని తెలుస్తోంది. ఎన్నికల తర్వాత కుదిరే స్నేహం కంటే.. ఎన్నికలకు ముందే అవగాహన వుండాలన్నది కమల దళ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ జగన్ ఎన్డీయేలో చేరేందుకు ససేమిరా అంటే అప్పుడు జనసేన, టీడీపీలతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్ళవచ్చని సమాచారం. కర్నాటకలో 2019 ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన సీట్లను దక్కించుకుంది. ఆ సంఖ్యను కాపాడుకోవడం ఇపుడు బీజేపీ ముందున్న పెద్ద సవాలు. ఎందుకంటే ఇటీవల అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. అయితే, జాతీయ అంశాల విషయానికి వచ్చేసరికి కన్నడ నాట బీజేపీకి బ్రహ్మరథం పట్టడం తరచూ చూస్తున్నాం.

రెండు కీలక నిర్ణయాలు

ఇక తెలంగాణ విషయానికి వస్తే బీజేపీలో ఆరు నెలల క్రితం కనిపించిన దూకుడు ఇపుడు కనిపించడం లేదు. కర్నాటక ఫలితాల తర్వాత బీజేపీ నేతలు, శ్రేణుల్లో స్తబ్ధత ఏర్పడింది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో దూకుడు పెరిగింది. దానికి తోడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారు బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీలో చేరడమే ఉత్తమమని భావించడం కూడా తెలంగాణ కమల దళంలో నిరాశ నింపింది. చేరికల కమిటీ కన్వీనర్‌గా పెద్దగా అద్భుతాలు సాధించలేకపోయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తనదైన రాజకీయంతో బండి సంజయ్ కుమార్‌ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. అధ్యక్ష బాధ్యతలు వద్దు మొర్రో అంటున్నా వినకుండా కిషన్ రెడ్డికి ఆ బాధ్యత నెత్తికెత్తారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం ద్వారా బండి సంజయ్ పార్టీ శ్రేణుల్లో సానుభూతి గణనీయంగా పెరగడం విశేషం. చేరికల కమిటీ బాధ్యతలే సరిగ్గా నిర్వహించలేని ఈటల మాటలకు బీజేపీ అధినాయకత్వం ప్రియారిటీ ఇవ్వడం మొదట్నించి బీజేపీలో వున్న తెలంగాణ నేతలకు జీర్ణమవడం లేదని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ సంగతి కాస్త పక్కన పెడితే.. జులై 9న జరిగిన దక్షిణాది రాష్ట్రాల నాయకుల సమావేశానికి కొనసాగింపుగా జులై 10, 11వ తేదీలలో తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశలు జరిగాయి. మోదీ పర్యటన తర్వాత పెరిగిన ఉత్సాహాన్ని కొనసాగించేలా వరుస కార్యక్రమాలు నిర్వహించాలని టీ.బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఇంకా అధ్యక్ష బాధ్యతలు అధికారికంగా స్వీకరించకపోయినా కిషన్ రెడ్డి నాయకత్వంలోనే రెండ్రోజుల పదాధికారుల సమావేశాలు జరగడం విశేషం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ఇంఛార్జీగా నియమించబడిన ప్రకాశ్ జవ్‌దేకర్ పాత్ర ఇపుడు కీలకం కాబోతోంది.

జోష్ కొనసాగించేందుకు ప్లాన్

గతంలో కూడా ప్రకాశ్ జవ్‌దేకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంఛార్జిగా వ్యవహరించారు. తాజాగా జరిగిన పదాధికారుల భేటీలో రెండు కార్యక్రమాలపై కమలనాథులు నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా వంద రోజుల కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. జులై 12వ తేదీ నుంచి ఈ వంద రోజుల కార్యాచరణను అమలు చేయాలని తలపెట్టారు. పదాధికారుల భేటీలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. వంద రోజుల కార్యాచరణలో భాగంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు 31 నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని భావిస్తున్నారు. ఇందులో బాగంగా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో బహిరంగ సభలను నిర్వహిస్తారు. ఇక రెండో నిర్ణయం టిఫిన్ బైఠక్‌లకు సంబంధించింది. ఈ టిఫిన్ బైఠక్‌లో హంగూ ఆర్భాటాలు లేకుండా సామాన్య జనంతో మమేకమయ్యేలా నిర్వహించాలని, ఉదయం పూట టిఫిన్ సెంటర్ల సమీపంలో ఈ బైఠక్‌లు నిర్వహించి, కేంద్రం రాష్ట్రానికిస్తున్న నిధులు, మంజూరు చేస్తున్న ప్రాజెక్టులపై సామాన్యుల్లో అవగాహన కల్పించాలన్నది ఈ టిఫిన్ బైఠక్‌ల ఉద్దేశం. జులై 16న రాష్ట్ర వ్యాప్తంగా టిఫిన్ బైఠక్‌లు జరపాలని నిర్ణయించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలల కాలంలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో నెలకో అంశాన్ని ఆధారం చేసుకుని ప్రజా ఉద్యమాలను నిర్వహించాలని కమలనాథలు వ్యూహరచన చేశారు. ప్రతీ లోక్ సభ నియోజకవర్గంలో రాజకీయాలకు సంబంధం లేని కనీసం వేయి మంది ప్రముఖులతో బీజేపీ నేతలు భేటీ కావాలని కూడా అధినాయకత్వం స్థానిక నేతలకు ఆదేశాలిచ్చింది. ఎవరెవరిని కలిశారన్నది రాష్ట్ర కార్యాలయానికి నివేదిక రూపంలో పంపాలని కూడా నిర్దేశించింది బీజేపీ నాయకత్వం. మొత్తమ్మీద ప్రధాని పర్యటన తర్వాత రాష్ట్ర బీజేపీలో కొంత జోష్ కనిపిస్తోంది. దానిని కొనసాగించాలన్న తాపత్రయం కూడా గోచరిస్తోంది.

29న ఖమ్మంకు అమిత్ షా

ఇదిలా వుండగా బీజేపీ రాష్ట్ర పదాధికారుల రెండో రోజు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న తీరు.. తెలంగాణలో ఎలాగైనా పట్టు సాధించాలన్న కసి చాటుతోంది. జూన్ నెలలో రద్దైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనను జులైలో ప్లాన్ చేశారు. తాజా నిర్ణయం ప్రకారం జులై 29న అమిత్ షా ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తారని టీ.బీజేపీ నేతలు వెల్లడించారు.  దాంతో పాటు ఆగస్టు 16 నుంచి వివిధ రాష్ట్రాలలో వున్న బీజేపీ ఎమ్మెల్యేలను తెలంగాణకు రప్పించాలని భావిస్తున్నారు. ఆగస్టు 16వ తేదీ నుంచి తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలను పంపబోతున్నారు. వారంతా వారం రోజుల పాటు తమకు కేటాయించిన నియోజకవర్గాలలోనే మకాం వేస్తారని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంతోపాటు, ఆ నియోజకవర్గంలోని బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేలా కార్యాచరణ అమలు చేస్తారని తెలుస్తోంది. ఇక స్థానిక సమస్యలను కూడా ప్రధానంగా తమ యాత్రల్లో ప్రస్తావించాలని తలపెట్టారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళ కేటాయింపులో జాప్యం, అవినీతి అంశాలతోపాటు రేషన్ కార్డుల పంపిణీలో అవకతవకలు, రైతు రుణ మాఫీలో తీవ్రమైన జాప్యం, ధరణి పోర్టల్ ద్వారా ఉత్పన్నమైన సమస్యలు వంటి స్థానిక సంస్థల మీద ప్రత్యేక కార్యాచరణతో ప్రజల ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేశారు కమల నాథులు. ఇందుకోసం ప్రతీ నియోజక వర్గంలో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.