PM Modi France Visit: చైనా ఆధిపత్యానికి భారత్ చెక్.. ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన అందుకేనా?
ఫ్రాన్స్‌లో జరిగే 'బస్టిల్ డే' వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తర్వాత ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్న రెండవ భారత ప్రధాని మోదీ. ఈ పర్యటనలో భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య భౌగోళిక వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో అనేక ఒప్పందాలు..
PM Modi France Tour: వివిధ రూపాల్లో సామ్రాజ్య విస్తరణ కాంక్షను ప్రదర్శించే చైనా దూకుడు కళ్లెం వేసేందుకు భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకించే ఫ్రాన్స్ కూడా భారత్‌కు అండగా నిలుస్తోంది. ఇప్పటికే భారత వాయుసేనను పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న రాఫెల్ ఫైటర్ జెట్ విమానాలను భారత్‌కు విక్రయించి కీలక రక్షణ భాగస్వామిగా ఉన్న ఫ్రాన్స్ ఇప్పుడు రూ.90,000 కోట్ల ఒప్పందంతో నావికాదళాన్ని బలోపేతం చేసే మరిన్ని రక్షణ పరికరాలను అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 13 నుంచి 15 వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఈ అంశమే కీలకం కానుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాను ఢీకొట్టేందుకు భారత్‌కు ఈ పర్యటన తోడ్పడనుంది.
ఫ్రాన్స్‌లో జరిగే ‘బస్టిల్ డే’ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తర్వాత ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్న రెండవ భారత ప్రధాని మోదీ. ఈ పర్యటనలో భారత్ – ఫ్రాన్స్ దేశాల మధ్య భౌగోళిక వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో అనేక ఒప్పందాలు, ప్రకటనలు ఉంటాయని సమాచారం. అందులో 26 రాఫెల్ M ఫైటర్ జెట్లతో పాటు మూడు స్కార్పెన్-క్లాస్ డీజిల్-ఎలక్ట్రిక్ అటాక్ సబ్‌మెరైన్‌ల కొనుగోలు డీల్ అత్యంత కీలకమైనది.
నౌకాదళం మరింత బలోపేతం
సరిహద్దుల్లో అనునిత్యం కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా, మరోవైపు సముద్రంలోనూ ఇదే తరహా దూకుడు ప్రదర్శిస్తోంది. చైనా కవ్వింపు చర్యలకు చెక్ పెట్టడం కోసం తమ వాయుసేనను పటిష్టం చేసుకునేందుకు ఫ్రాన్స్ నుంచి అధునాతన యుద్ధ విమానాలైన రాఫెల్ ఫైటర్ జెట్లను సమకూర్చుకున్న భారత్, ఇప్పుడు సముద్రంలో చైనా ఆధిపత్యానికి కళ్లెం వేసేందుకు నావికాదళం అమ్ముల పొదిలో అధునాతన ఫైటర్ జెట్లను సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఎయిర్‌ఫోర్స్ దగ్గరున్న రాఫెల్ ఫైటర్ జెట్లకు మెరైన్ వెర్షన్ గా పేర్కొనే రాఫెల్-M ఫైటర్ జెట్ల కొనుగోలుకు భారత్ సిద్ధమైంది. యుద్ధ నౌక మీద నుంచి దూసుకెళ్లి నిప్పుల వర్షం కురిపించగల ఆధునిక ఫైటర్ జెట్లలో ఇవి అత్యుత్తమమైనవి. ప్రస్తుతం ‘INS విక్రాంత్’ వంటి భారత యుద్ధ నౌకలు మిగ్-29KS రకం యుద్ధ విమానాలను కలిగి ఉన్నాయి. రక్షణ రంగ నిపుణులు ఎవరైనా సరే వీటికి కాలం చెల్లిందనే చెబుతారు. వాటి స్థానంలో రాఫెల్-M రకం అత్యాధునిక యుద్ధ విమానాలు యుద్ధ నౌకలపైకి చేరితే భారత నావికాదళం ప్రపంచంలో బలమైన నావికదళాన్ని కలిగిన దేశాల సరసన చేరుతుంది. ఇప్పటికే వాయుసేనలో కూడా రాఫెల్ ఫైటర్ జెట్లనే ఉపయోగిస్తున్న భారత సైనిక బలగాలకు వాటి మెరైన్ వెర్షన్లను ఉపయోగించడం సులభతరం అవుతుంది. పైలట్లకు శిక్షణలో సమయం ఆదా అవడంతో పాటు యుద్ధ విమానాల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి.
నావికాదళాన్ని పటిష్టం చేసే మరో కీలకాశం అధునాతన జలాంతర్గాములు. ఫ్రాన్స్‌కు చెందిన నావల్ గ్రూప్, స్పెయిన్‌కు చెందిన నవాంటియా సంయుక్తంగా నిర్మించి అభివృద్ధి చేసిన మూడు ‘స్కార్పెన్-క్లాస్ డీజిల్-ఎలక్ట్రిక్ అటాక్ సబ్‌మెరైన్’లను భారత్ కొనుగోలు చేయడం ద్వారా నావికాదళ ఆపరేషన్లు మరింత బలోపేతం కానున్నాయి. ఈ అధునాతన స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరీన్లకు పాత వెర్షన్‌గా చెప్పుకునే కల్వేరీ క్లాస్ సబ్‌మెరీన్లను భారత్ ఇప్పటికే ఉపయోగిస్తోంది. దాంతో కొత్త సబ్‌మెరీన్ల వినియోగం, నిర్వహణ కూడా భారత నావికాదళానికి పెద్ద ఇబ్బంది కాదు. తేడా ఏంటంటే ఈ ప్రత్యేక జలాంతర్గాములు ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో ఉంటాయి. నీటి అడుగున ఎక్కువ కాలం ఉండేందుకు వీలు కల్పించే డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్‌లు భారతదేశానికి ఎంతో ఉపయోగకరం. తద్వారా వాటి బ్యాటరీలను రీఛార్జ్ చేయడానికి నీటి ఉపరితలంపైకి రావాల్సిన అవసరం ఉండదు. ఈ టెక్నాలజీ కారణంగా జలాంతర్గామి మరింత సమర్థవంతంగా, శతృసేనకు దొరకకుండా రహస్యంగా, సురక్షితంగా ఉండగల్గుతుంది. ఎందుకంటే జలాంతర్గాములు నీటి ఉపరితలంపైకి రావడం అంటేనే ప్రమాదాలను ఆహ్వానించినట్టని ఆ రంగానికి చెందిన నిపుణులు చెబుతుంటారు.
ప్రాజెక్ట్ 75 కింద ఇప్పటికే భారతదేశం కొనుగోలు చేసిన 6 జలాంతర్గాములకు అదనంగా ఇవి చేరనున్నాయి. కొత్త ప్రాజెక్ట్ 75 (ఐ) కింద ఈ తరహా సబ్‌మెరైన్ల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు అందజేసి, భారత్‌లోనే తయారు చేయడం మొదలయ్యే వరకు ఇవి నావికాదళంలో సేవలు అందించనున్నాయి.
మరిన్ని ఒప్పందాలు
మెరైన్ ఫైటర్ జెట్లు, జలాంతర్గాముల కొనుగోలుతో పాటు ప్రధాని ఫ్రాన్స్ పర్యటనలో భారత్ స్వయంగా తయారుచేసుకుంటున్న నెక్స్ట్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ విమానాలైన అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA)కు అవసరమైన హై-థర్స్ట్ జెట్ ఇంజిన్‌కు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఫ్రాన్స్ అందజేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రష్యా తయారు చేసిన పరికరాలపై ఆధారపడకుండా భారత్‌కు సహాయం చేయాలనే ఉద్దేశాన్ని అమెరికా మాదిరిగానే ఫ్రాన్స్ కూడా వ్యక్తం చేసింది. భారత్‌లో రక్షణ విభాగాన్ని ఆధునీకరించే క్రమంలో వివిధ రకాల డీల్స్‌తో ముందుకొస్తున్న అమెరికన్ సంస్థలతో ఫ్రాన్స్ పోటీ పడుతోంది.