‘డియర్ ఆర్కే, మీ అవసరం ఉంది, నెక్స్ట్ టైం, ఇంకో మార్గంలో కలుద్దాం’.. ఒపినియన్ ఆర్టికల్

మావోయిస్టు అగ్ర నేత ఆర్కే చనిపోయిన న్యూస్ వచ్చిన గంటకి ఆయన గురించి న్యూస్‌లు ఎక్కువ అయ్యాయి. ట్విట్టర్ లో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. చాలా మంది పెద్దవాళ్ళు ఆయన గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. ఆర్కే చేసిన ప్రయత్నాలను మెచ్చుకుంటున్నారు.

'డియర్ ఆర్కే, మీ అవసరం ఉంది, నెక్స్ట్ టైం, ఇంకో మార్గంలో కలుద్దాం'.. ఒపినియన్ ఆర్టికల్
Rk Death

మావోయిస్టు ఆర్కే మరణించారు అని న్యూస్ వచ్చింది. పెద్దగా ఏమీ అనిపించలేదు – ఎందుకంటే అయన ఎవరో తెలియదు. మా తరం పుట్టినప్పటినుండి మావోయిస్టులు చేసిన పోరాటలకంటే ఎక్కువ వారు చేసిన బాంబు దాడులు, వారు గురైన ఎన్కౌంటర్ల గురించి ఎక్కువ వింటూ పెరిగాం. అడవిలో గన్ను పట్టుకుని కొంతమంది అన్యాయాల గురించి ప్రశ్నించే వారని ఒక వైపు నుండి వింటూ ఉంటాం. తమను నమ్మిన ప్రజలను మోసం చేసి ఏ ప్రజలను కాపాడాలో వారినే చంపే “తీవ్రవాదులు” అని ప్రభుత్వాల నిర్వచనం కూడా విన్నాం. ఈ రెండిటిలో ఏది నిజమో తెలియని జనరేషన్ మాది. సరిగ్గా చెప్పాలంటే ఏది నిజమో తెలుసుకునే తీరిక లేని జనరేషన్ మాది. ఎపుడు ఎవరు ఏది గట్టిగా చెప్తే అదే నిజం అని నమ్ముతూ ఉంటాం.

ఆ న్యూస్ వచ్చిన గంటకి ఆర్కే గురించి న్యూస్ ఎక్కువ అయ్యాయి. ట్విట్టర్ లో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. చాలా మంది పెద్దవాళ్ళు అయన గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. ఆయన చేసిన ప్రయత్నాలను మెచ్చుకుంటున్నారు. ఆయన ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది. ఎన్నో గంటలు కూర్చుని చాలా వీడియోలు చూసేసాను. ఇంజనీరింగ్ చదివి విప్లవ ఉద్యమానికి ఆకర్షితుడు అయ్యాడు.. కలం వదిలి గన్ పట్టాడు . గిరిజన బిడ్డల హక్కుల కోసం యుద్ధం చేశాడు. వ్యూహాలు వేశాడు . ఆయుధాలు తయారుచేశాడు. పెట్టుబడిదారీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు.

ఆర్కే గురించి ఒక మోస్తరుగా తెలిశాక గమ్యం సినిమాలోని ఒక సన్నివేశం గుర్తుకొస్తుంది. మావోయిస్టుల పద్ధతులను ప్రశ్నించే సన్నివేశం అది. “జనంలోకి వచ్చి నిలబడండి, మిమ్మల్నీ అడుగుతారు; తుపాకులు పట్టుకుని అడవిలో నుంచుంటే జనాలకు మంచి జరగదన్నా” “ప్రశ్నించేవాళ్ళం మనం, తలెత్తుకుని నిలబడే వాళ్ళం మనం, ఇక్కడెందుకు జనంలోకి వెళదాం” అంటారు రావు రమేష్ అన్న వేషంలో ఉన్న డైరెక్టర్ క్రిష్ తో!. “ప్రతి కష్టంలో మీ కోసం చూశాను మీరెపుడు వచ్చారు” అని నిలదీస్తాడు అల్లరి నరేష్.

కర్మయోగి – ప్రజల కష్టాల్లో మీరున్నారా?

ఆర్కే చాలా తెలివైన వాడు అని అందరు అంటున్నారు – నమ్మిన సిద్ధాంతం కోసం దీక్షతో పని చేసాడు అంటున్నారు. పార్టీలో చిన్న స్థాయి నుండి ఎంతో ఎత్తుకు ఎదిగాడు అని పొగుడుతున్నారు. పెద్ద పెద్ద వారిమీద దాడికి ఈయనే మాస్టర్ మైండ్ అని చెప్తున్నారు. ఆయన మార్గాన్ని ప్రశ్నించటం మరొక చర్చ. కానీ ఆ మార్గం ఎంత సాధించింది అని ప్రశ్నించటానికి మాత్రం ఇది ఒక అవకాశం.

గిరిజన ప్రజలు, హక్కుల సంఘాల వారు ఆర్కే లాంటి వారు చేసే చర్యల వల్ల ఎంత లాభం పొందారో తెలియదు కానీ తమ సిద్ధాంతం ఏంటి అనేది ఈ జనరేషన్ కి చెప్పటంలో విఫలం అయ్యారు అనే చెప్పాలి. ఒకవైపు పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. కొరోనాతో లక్షల మంది ప్రజలు చనిపోయారు. కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీని ఎవరూ ఆపలేదు. ఉద్యోగాలు పోయి ప్రజలు అలమటిస్తున్నారు. చదువుకుని ఉద్యోగాలు రాక ఇంకెంతోమంది నిరాశ చెందుతున్నారు. నగరాల్లో బ్రతుకు దుర్భరంగా ఉంది. ఆడవాళ్ళమీద మునుపెన్నడూ లేని విధంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పల్లెల్లో బ్రతుకు భారం అయింది. వర్షాలు సరిగా పడట్లేదు. వ్యవసాయం ఒక వృత్తిగా ఫెయిల్ అయింది.
ఇన్ని సమస్యల్లో మాకు వినిపిస్తున్న గొంతుకలు మాత్రం రాజకీయ నాయకులవే. అయితే డబ్బు ఇస్తారు. లేకపోతే మందు. కానీ సమస్యలు మాత్రం అంతే ఉన్నాయి. మా హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం అంటున్నారు..ఎక్కడ? అడవి నుండా? సిరివెన్నెల మాటల్లో .. “అన్యాయాన్ని సహించని శౌర్యం.. దౌర్జన్యాన్ని దహించే ధైర్యం.. కారడవులలో క్రూర మృగంలా.. దాక్కుని ఉండాలా.. వెలుగుని తప్పుకు తిరగాలా ” అని నిలదీయాలి అనిపిస్తుంది.

యుద్ధమా-శాంతమా

యుద్ధం చేసే దమ్ము లేనోడికి శాంతి కోరే హక్కు లేదన్నాడు ఒక రచయిత. యుద్ధం చేసే సత్తా ఉండి, శాంతి కోసం మాట్లాడే దమ్మున్న ఆర్కే శాంతి కన్నా యుద్ధం మిన్న అని నమ్మారా? శాంతి మార్గంలో ఏమీ సాధించలేం అనుకున్నారా? బలం లేనిదే బలవంతుడిని దెబ్బతీయలేం అని బలంగా నమ్మారా?

నా అవగాహనలో ప్రపంచంలో యుద్ధంతో తీరిన ఒక్క సమస్య లేదు. తాత్కాలికంగా వెలిగినా తనతో ఎంతోమంది జీవితాలను తీసుకుపోయిన యుద్ధాలే చరిత్ర నిండా! బలవంతుడిని చూపించి యుద్ధం చేసిన బలహీనులు నలిపివేయబడ్డ సన్నివేశాలే! ఈ రెండింటిలో ఏది మెరుగైన మార్గం – ఏది ఎంచుకోవాలి అనే విశ్లేషణలో ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అదంతా ఒక వ్యాసంలో చెప్పటం కూడా అసాధ్యం. మొత్తాన్ని టూకీగా చెప్పాలంటే మాత్రం లక్ష్యం కోసం ప్రయత్నించే రెండు మార్గాల్లో శాంతి మార్గంలో కనీసం అమాయకులు బలి అవ్వరు. రెండింటిలో నడిపించేవాడు కొద్దిమందే! నడిచేవారు వైపునుండి చుస్తే మాత్రం హింస వల్ల జరిగే నష్టం అపారం. ఇన్నేళ్ల మావోయిస్టు ఉద్యమంలో ఎవరి తప్పు ఎంత అని ఎంచటం వదిలేసి ప్రాణ నష్టం చుస్తే ఇరువర్గాల మధ్య నలిగిపోయిన కుటుంబాలు, పసిపిల్లలు ఎంతో మంది!

యుద్ధం దేనికోసం? కమ్యూనిజం సాధించవలసినవి ఏమున్నాయి?

విప్లవం ద్వారా స్థాపించబడ్డ ప్రజా ప్రభుత్వమే ప్రజల హక్కులు కాపాడుతుంది అని నమ్మిన మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అమలు చేయటానికి మొదలైన ఈ విప్లవం ఈ రోజు సమాజానికి అవసరమా? ఆర్ధిక అసమానతలు పెరిగాయి, నిజమే! ప్రజా హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, నిజమే! ఈ పరిస్థితులు కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఉన్నాయిగా. ప్రపంచ దేశాలన్నీ పార్టీలకు అతీతంగా క్యాపిటలిజం వెనుక పరిగెడుతుంటే దాని తప్పుల్ని ఎండగట్టే వారు కరువయ్యారు. ముఖ్యంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా రాజకీయంగా వెనకబడింది. వారి చరిత్ర గురించి గొప్పగా వినటం తప్పించి మా జనరేషన్ లో వారి ఎఫెక్ట్ ఏమి చూడలేదు. కొన్ని కాలేజీ క్యాంపస్లలో తప్పిస్తే ఈ దృక్పథం బ్రతకటానికి పనికొస్తుందని నమ్మేవారు కూడా తగ్గిపోయారు.

ఈ సమయంలో ఆర్కే ఆశయాలు ఇలాగైతే చేరేవా?

పోలీసులు ట్రాక్ చేయలేని మొబైల్ ఫోన్ బదులు ఇంస్టాగ్రామ్ అకౌంట్లో లైవ్ వీడియోలు; కొత్త కొత్త గన్నులు, బాంబుల బదులు కొత్తగా పుట్టుకొస్తున్న సమస్యల మీద ఉద్యమాలు; సెంట్రల్ మావో కమిటీ బదులు సెంట్రల్ లెవెల్ యూత్ ఉద్యమ నాయకులుగా ఉండుంటే ఎంతోమంది యువతను తయారుచేసేవారేమో! అసలు వారి హక్కులు అంటే ఏంటో కూడా తెలియని సమాజానికి నేర్పాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయ్ అని గుర్తించి ఉంటె బాగుండేది!

డియర్ ఆర్కే, మీ అవసరం ఉంది, నెక్స్ట్ టైం, ఇంకో మార్గంలో కలుద్దాం!—— స్వాతి, టీవీ9 తెలుగు

Click on your DTH Provider to Add TV9 Telugu