అంతరించిపోతున్న అమెజాన్‌ అడవులు, ప్రపంచ పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు…

హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమిని నానా హింసపెట్టి, చాపగా చుట్టేసి సముద్రంలో విసిరిపారేశాడని విన్నాం. ఆ ఒక్క రాక్షసుడితోనే భూమాత అన్నేసి బాధలు పడింది.

అంతరించిపోతున్న అమెజాన్‌ అడవులు, ప్రపంచ పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు...
Amazon Rainforest
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 15, 2022 | 12:20 PM

హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమిని నానా హింసపెట్టి, చాపగా చుట్టేసి సముద్రంలో విసిరిపారేశాడని విన్నాం. ఆ ఒక్క రాక్షసుడితోనే భూమాత అన్నేసి బాధలు పడింది. మరి ఇప్పుడో లక్షల కొద్ది హిరణ్యాక్షులు.. భూమిని సర్వనాశనం చేస్తున్నారు. మనం ఇలాగే రాక్షసంగా ప్రవర్తిస్తే సముద్రాలు పొంగుతాయి. వరదలు ముంచెత్తుతాయి. ఆక్సిజన్‌ అందక సమస్త జీవరాశులు అల్లాడిపోతాయి. కరువు కాటకాలు మానవాళిని పట్టిపీడిస్తాయి. ఇదేమీ భవిష్యవాణి కాదు.. కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. ప్రళయ సంకేతం..

ఆమెజాన్‌ రెయిన్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతున్నది . మన తప్పిదాల కారణంగా అమెజాన్‌ అడవులు పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. ఇలాగే జరిగితే అడవుల స్థాయి బాగా తగ్గిపోయి గడ్డిమైదానాలుగా మారే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. అయినా మనం వినం.. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటాం. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రకృతి దేవతతో పరిహాసమాడతాం. అమెజాన్‌ అడవుల విస్తీర్ణం తగ్గిపోతే ఇంకేమైనా ఉందా? అదే జరిగితే కేవలం అమెజాన్‌ విస్తరించిన ప్రాంతమే కాదు.. ఈ ప్రభావం ప్రపంచంపై పడుతుంది. తొమ్మిది దేశాలలో దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అమెజాన్‌ వర్షారణ్యానికి ఇప్పుడు గడ్డు రోజులు వచ్చాయి. అమెజాన్‌ పరీవాహక ప్రాంతంలో 75 శాతాన్ని ఈ అడవులు ఆక్రమించాయి. మనిషి తెలివి మీరిన తర్వాత అడవులపై పడ్డాడు.. వాటిని నాశనం చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే కలప, బయో ఇంధనం, పోడు వ్యవసాయం అంటూ చాలా అడవులను ధ్వంసం చేశాడు. అమెజాన్‌ను కూడా 20 శాతాన్ని మింగేశాడు. నిరుడు బ్రెజిల్‌-బొలీవియా సరిహద్దుల్లోని అమెజాన్‌ అటవీ ప్రాంతంలో ఓ రహస్య రన్‌వేను అధికారులు కనిపెట్టారు. అంటే అమెజాన్‌ అడవులు ఏ స్థాయిలో నాశనానికి గురవుతున్నాయో అర్థమవుతోంది. చెట్లను ఇష్టానుసారంగా నరికివేస్తున్నారు ప్రజలు. అధికార లెక్కల ప్రకారం ఏడాదికేడాది ఈ సంఖ్య పెరుగుతూ వెళుతోంది.

వానలు సరిగ్గా కురవకపోవడం, కార్చిచ్చులు వంటి ప్రకృతి విపత్తులు కారణంగా భారీ విస్తీర్ణంలో అమెజాన్‌ అడవి నాశనమయ్యింది. వన్యప్రాణులు చనిపోయాయి. నిజానికి ఈ అడవుల్లో నివసిస్తున్న ఆదిమ జాతుల ప్రజలు అమెజాన్‌ను కన్నతల్లికంటే ఎక్కువగా చూసుకుంటారు. అడవిని రక్షించుకోవడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెడతారు. సుమారు మూడున్నర వేల మంది ఆదిమ జాతులు అమెజాన్‌లో నివసిస్తున్నాయి. వారంతా అడవి అమ్మగా భావిస్తారు. అడవే తమ బాగోగులు చూసుకుంటుందని, తమకు కావాల్సినవన్నీ ఇస్తుందని గొప్పగా చెబుతుంటారు. నిజమే, అమెజాన్‌ అడవులపై ఆధారపడి సుమారు మూడు కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. ఒకవేళ ఆ అడవికి ఏమైనా అయితే, వీరి పరిస్థితి ఏమిటి? ప్రపంచంలోని జీవ జాతుల్లో పదింట ఒకవంతు ఇక్కడే కనిపిస్తుంది. అసలు ప్రపంచంలోనే అత్యధిక వృక్ష, జీవ ప్రజాతులకు అమెజానే ఆవాసం. 16 వేల రకాల వృక్ష జాతులు ఇక్కడ ఉన్నాయి. సుమారు 39 వేల కోట్ల వృక్షాలున్న ఈ అడవిలో పాతిక లక్షల రకాల కీటకాలు, 2, 200 రకాల చేపలు, 13 వందల రకాల పక్షాలు, 427 రకాల క్షీరదాలు, 378 రకాల సరీసృపాలు నివసిస్తున్నాయి. వీటిల్లో చాలా మట్టుకు మనం చూసి ఉండం. అమెజాన్‌లోని 15 లక్షల మొక్కలు ఆయుర్వేదం, ఫార్మా కంపెనీలకు ఉపయోగపడుతున్నాయట.

అమెజాన్‌ అడవి విస్తీర్ణంలో 60 శాతం బ్రెజిల్‌లోనే ఉంది. మనం పీల్చుకునే మొత్తం ఆక్సిజన్‌లో 21 శాతం ఇక్కడ్నుంచే వస్తున్నదే. అలాగే మనం విడుదల చేసే కార్బన్‌ డైఆక్సైడ్‌లో పాతిక శాతం ఈ అడవి తీసుకుంటుంది. ఇక్కడ కురిసిన వర్షం నీరు చెట్లపై పడి భూమికి చేరాలంటే కనీసం అయిదు నిమిషాలు పడుతుందట! అంటే అడవి అంత దట్టంగా ఉంటుందన్నమాట! అమెజాన్‌ బేసిన్‌లోని రెయిన్‌ ఫారెస్ట్‌ ప్రపంచ రెయిన్‌ఫారెస్ట్‌లలో సగానికిపైగా ఉంటుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కార్బన్‌డై ఆక్సైడ్‌ స్థాయి నియంత్రణలో అమెజాన్‌దే కీలకపాత్ర. ఈ అడవి విస్తీర్ణం తగ్గిపోతే పర్యావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయి పెరుగుతుంది. చాలా వేగంగా అంతర్ధానం అవుతున్న అమెజాన్‌ భవిష్యత్తుపై భయాన్ని కలిగిస్తోంది. మనం చేసే తప్పిదాలకు తోడు పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు అమెరికా అడవులను బాగా దెబ్బతీస్తున్నాయి. ఇప్పట్నుంచే కార్బన్‌ కాలుష్యాన్ని తగ్గించకపోతే 2050 నాటికి ఈ అడవులు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

అంటార్కిటికాలో కొన్ని సంవత్సరాలుగా మంచుదిమ్మెలు కరిగి నీరవుతున్నాయి. 2002వ సంవత్సరంలో అంటార్కిటికాలో భారీ మంచు దిమ్మె ఒకటి కొద్దిగా పక్కకు జరిగింది. దీని విస్తీర్ణం ఎంతంటే మూడువేల రెండువందల యాభై చదరపు కిలోమీటర్లు. అంటే మన హైదరాబాద్‌ నగర వైశాల్యానికి దాదాపు 13 రెట్లన్నమాట. ఈ మంచుదిమ్మ మందం 220 మీటర్లు. ఈ దిమ్మె కొన్నేళ్లుగా పలచబడుతూ పట్టుకోల్పోయి పక్కకు తొలగింది. ఒక్కసారి ప్రధాన మంచు నుంచి విడిపోయాకా తొందరగా కరిగిపోతుంది. అంటార్కిటికాలో చాలా సంవత్సరాలుగా కనీసం పన్నెండువేల ఐదువందల చదరపు కిలోమీటర్ల మంచు దిమ్మెలు కరిగి నీరయ్యాయని ఓ అంచనా. ఇలా మంచుదిమ్మెలు కరిగిన నీటిశాతం పెరిగితే చిన్నచిన్న దీవులన్నీ మునిగిపోతాయి. సముద్రతీర ప్రాంతాలలో ఉన్న వారికి ఇది ప్రమాదమే. ఇదే కాకుండా వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు పెరుగుతున్నాయి. దక్షిణాసియాలో రుతుపవనాలు గతులు తప్పాయి.

మొత్తంగా ఇప్పుడు ప్రపంచం ప్రమాదం అంచుల్లో ఉంది.. ఇప్పుడు అమెజాన్‌ అడువులు కూడా క్షిణిస్తే ప్రమాదకర పర్యావరణ మార్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెజాన్‌ అడవుల క్షీణతలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సనారో పాపం కూడాఉంది. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమెజాన్‌ తగలబడింది.. ఆ కార్చిచ్చుకు కారణం స్మగ్లర్లే. వారి దురాగతాలను అడ్డుకోవల్సిన బోల్సనారో ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అడవుల నరికివేత పెరిగింది. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో అమెజాన్‌ అడవులు వదిలే కార్బన్‌డైఆక్సైడ్‌ పరిమాణం 20 శాతం మేర పెరిగిందని సైటింస్టులు చెబుతున్నారు. విషపూరితమైన కార్బన్‌ మోనాక్సైడ్‌ కూడా విడుదలవుతున్నదట. పుడమితల్లికి ఊపిరితిత్తులుగా పరిగణిస్తున్న అమెజాన్‌ అడవులు నాశనమైతే ప్రపంచం తల్లడిల్లిపోతుంది. అది మన మనుగడకే ముప్పు తెస్తుంది.

Amazonrainforest 1

 

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..