రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి.. పొలిటికల్ వేదికపై తారాతోరణం

సినీనటులు రాజకీయ పార్టీలు పెట్టడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాట ఈ ట్రెండ్ మొదటి నుంచీ వస్తోంది. నాటి అన్నాదురై నుంచి నేటి రజనీకాంత్ వరకు చాలా మంది కళాకారులు వెండితెర నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారే. దక్షిణ భారత్‌లో తమిళనాడు తర్వాత ఆ స్థాయిలో సినీకళాకారులు రాజకీయ పార్టీలు పెట్టింది తెలుగునాటే.

రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి.. పొలిటికల్ వేదికపై తారాతోరణం
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 11, 2020 | 2:40 PM

Film stars in Politics: సినీనటులు రాజకీయ పార్టీలు పెట్టడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాట ఈ ట్రెండ్ మొదటి నుంచీ వస్తోంది. నాటి అన్నాదురై నుంచి నేటి రజనీకాంత్ వరకు చాలా మంది కళాకారులు వెండితెర నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారే. దక్షిణ భారత్‌లో తమిళనాడు తర్వాత ఆ స్థాయిలో సినీకళాకారులు రాజకీయ పార్టీలు పెట్టింది తెలుగునాటే. ఎందరో అగ్రశ్రేణి సినీ నటులు రాజకీయ రణ రంగంలోకి వచ్చారు. వెండితెర మీది పాత్రలే కాకుండా తెరనుంచి బయటకు వచ్చి ప్రత్యక్ష రాజకీయ పాత్రల్లో రాణించారు. ప్రధానంగా దక్షిణ భారతంలో సినిమాలు, రాజకీయాలు అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. పండు వెన్నెలలాంటి సినిమా జీవితాన్ని వదిలి రాజకీయరంగంలోకి ఎందరో వచ్చారు. సినిమా ‘రాజకీయం’ ద్వారా విజయం పొందినవారున్నారు. అనుకున్నంత ఆదరణ పొందలేక రాజకీయాల నుంచి తప్పుకున్న వారూ ఉన్నారు.

దక్షిణ భారతంలో కొంతమేరకు రాజకీయాల్లో సినీతారలు ఎక్కువ విజయాలు సాధించారు. ఉత్తర భారత నటులు కూడా విజయాలు పొందారు. కానీ కొందరు అంతగా రాణించలేక అపజయాలు చవిచూశారు. వీరిలో అమితాబచ్చన్‌, చిరంజీవి, విజయకాంత్‌, ఆర్‌.శరత్‌కుమార్‌, శివాజీ గణేషన్‌ మొదలైనవారున్నారు. ఎంజీరామచంద్రన్…దక్షిణ భారతదేశంలో మొట్టమొదట పార్టీ స్థాపించిన నటుడు ఎంజీ రామచంద్రన్. డీఎంకే పార్టీ నుండి విడిపోయి సొంతంగా అన్నాడీఎంకే పార్టీని 1972లో స్థాపించి 1977లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.

ఆతర్వాత తెలుగు సినీ జగత్తులో ఓ వెలుగు వెలిగిన ఎన్టీ రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో పార్టీ స్థాపించారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి సీఎం పదవి చేపట్టారు. అనంతరం జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపారు. నేషనల్ ఫ్రంట్‌ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు నాట కాంగ్రెసేతర తొలి ముఖ్యమంత్రిగా ఎన్డీఆర్ నిలిచారు.

రాజకీయాల్లోకి వెళ్లిన మొట్టమొదటి తెలుగు సినిమా నటుడు జగ్గయ్య. విద్యార్థి దశలో జగ్గయ్య కాంగ్రెస్ సోషలిస్టు గ్రూపుతో కలిసి పనిచేశారు. నెహ్రూ పిలుపుమేరకు కాంగ్రెస్ లో చేరి.. పార్టీకి సేవలందించారు. 1967లోనే ఆయన కాంగ్రెస్ పార్టీ తరుపున ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ ఒక సినిమా నటుడికి టికెట్ ఇవ్వడం అదే తొలిసారి.

ఇక, 2009లో తెలుగు నాట మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ప్రజారాజ్యం పేరిట పార్టీ స్థాపించారు. ‘మార్పు’ అనే నినాదంతో తెలుగు ప్రజల ముందుకు వచ్చారు. కానీ, ఎన్నికల తరువాత తన విధానాలు మార్చుకున్నారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కేంద్ర సహాయమంత్రి పదవి పొందారు.

చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయని జనసేనాని.. 2019 ఎన్నికల్లో తమ పార్టీ తరుపున అభ్యర్థులను బరిలోకి దింపారు. కాగా, రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ తోసహా అందరూ ఓడిపోగా, రాజోలులో ఒక్క సీటు మాత్రమే కైవసం చేసుకున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ రాజీవ్ గాంధీ స్పూర్తితో 1984లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలోనూ అడపా దడపా పాల్గొన్నారు. ఆ తర్వాత 1989లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏలూరు నుండి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత మారిని రాజకీయాల పరిణామక్రమంలో ఆయన పొలిటికల్ కెరీర్‌ను ముగించారు.

ఇక, మరోనటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు సినిమా నుంచి 1990లో భారతీయ జనతాపార్టీలో చేరిపోయారు. 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా గెలుపొందారు. కేంద్రంలో విదేశాంగ, రక్షణశాఖ సహాయమంత్రిగా పని చేశారు. 2004 నుండి బీజేపీకి దూరంగా ఉన్నారు. అనంతరం ప్రజారాజ్యం పోటీ తరుపున పోటీ చేసి ఓడిపోయాడు.ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో తిరిగి బీజేపీ గూటికి చేరారు కృష్ణంరాజు.

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో మరో నటి శారదా క్రియాశీలకంగా వ్యవహరించారు. తెనాలి నుండి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత చంద్రబాబు హయాంలో కూడా టీడీపీ తరుపున ప్రచారం చేశారు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా చెన్నైలో స్థిరపడ్డ శారద.

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరిన మరో నటి జయప్రద. చంద్రబాబు నాయుడు పార్టీ భాద్యతలు చేపట్టాక.. జయప్రద రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ తరువాత కొంతకాలం టీడీపీకి దూరంగా ఉన్న జయప్రద.. సమాజ్ వాదీ పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంటుకు వెళ్లారు.

ఎన్టీఆర్ కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన మరో నటుడు మోహన్ బాబు. టీడీపీలో చేరి.. రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ తరువాత టీడీపీకి దూరంగా ఉంటూ వైఎస్‌తో బంధుత్వం ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరమైనా వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు.రాజకీయాలలోకి ప్రవేశించి మరో హీరో మురళీ మోహన్.. తెలుగు దేశం పార్టీలో చేరాడు. 2009లో జరిగిన 15వ లోకసభ ఎన్నికలలో రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి తెలుగు దేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. తిరిగి 2014లో 16వ లోకసభ ఎన్నికలలో గెలిచి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మరో విలక్షణ నటుడు కోటశ్రీనివాసరావు.. 1999లో భారతీయ జనతా పార్టీలో చేరారు.. ఆ పార్టీ టికెట్టుపై విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరో కమెడియన్ బాబూ మోహన్ తెలుగుదేశం పార్టీలో చేరి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా సేవలందించారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత టీఆర్ఎస్‌లో చేరి ఆంథోల్ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు.

తెలుగు సినిమాలో మహిళ సూపర్‌స్టార్‌గా ఎదిగిన విజయశాంతి తొలుత 1998లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అనంతరం తన పార్టీని కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. 2009లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరుపున విజయశాంతి మెదక్ నుండి ఎంపిగా విజయం సాధించారు. 2011 నుంచి టీఆర్ఎస్‌కు దూరం ఉన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె.. అదే మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇటీవలే ఆమె తిరిగి బీజేపీలో చేరారు.

సహజ నటి జయసుధ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గానికి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత టీడీపీలో చేరిన జయసుధ.. ప్రస్తుతం రాజకీయాలకు దూరం ఉంటున్నారు.

సినిమారంగంలో ఓ వెలుగు వెలిగిన మరో నటుడు దాసరి నారాయణరావు. కాంగ్రెస్ పార్టీలో చేరిన దాసరి.. రాజ్యసభ సభ్యుడు ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్రంలో బొగ్గు గనుల శాఖకు సహాయ మంత్రిగా సేవలందించారు. నిర్మాత రామానాయుడు రాజకీయ ప్రస్థానం తెలుగు దేశం పార్టీతో మొదలైంది. గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీగా ఎన్నికైన రామానాయుడు ప్రజా జీవితంలో సేవలందించారు. మరో నటుడు శివప్రసాద్… చిత్తూరు ఎంపీగా విజయం సాధించారు. టీడీపీ తరుపున పార్లమెంటులో వినూత్న నిరసనలు చేసి రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తు తెచ్చుకున్నారు. టీడీపీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మరో నటి రోజా. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల ముందు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. చిత్తూరు జిల్లా నగరి స్థానం నుండి రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు.

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ కూడా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు రాజకీయాలకు వచ్చారు. 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపూరం ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీచేసి విజయం సాధించారు.

తెలుగేతర సినీ రాజకీయ నేతలుః

అన్నాదురై.. తమిళనాట అన్నగా పిలిచే సి.ఎన్. అన్నాదురై (కంజీవరం నటరాజన్) నాటక రచయిత. ద్రవిడ కళగం(డీకే) కీలక వ్యక్తులలో ఒకరు. పెరియార్‌ (ఈవీ రామస్వామి)తో విభేదాల కారణంగా ద్రవిడ కళగం నుంచి బయటకు వచ్చారు. డిఎంకే (ద్రవిడ మున్నేట్ర కళగం) పేరుతో 1949లో పార్టీ స్థాపించారు. తర్వాత కాలంలో కరుణానిధి, ఎంజీఆర్ ఈ పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు.

ఎంజీఆర్…. తమిళ అభిమానుల అండతో రాజకీయాల్లో రాణించిన ఎంజీఆర్.. డిఎంకేలో వారసత్వ పోరుతో పార్టీలో కీలక నేతగా ఎదిగారు ఎంజీ రామచంద్రన్‌. పార్టీ నుంచి బయటకొచ్చి 1972 అక్టోబర్ 17న ఆలిండియా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐడీఎంకే) పార్టీని స్థాపించారు. 1977లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాడంతో ముఖ్యమంత్రిగా ఎంజీ రామచంద్రన్‌ బాధ్యతలు చేపట్టారు. ఇదే ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ.

ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీలో విభేదాలు రావడంతో నటి జయలలిత అన్నాడీఎంకే పార్టీని చేతుల్లోకి తీసుకుంది.1989 నుంచి 2016లో చనిపోయేవరకు పార్టీని నడిపించారు జయలలిత. తమిళనాట ఏఐడీఎంకే అత్యధికంగా ఏడుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆమెకే దక్కుతుంది. చాలా కాలం పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత చరిత్ర ఆమె సొంతం.

తమిళనాట రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నటుల్లో శివాజీ గణేషన్ ఒకరు. డీఎంకే పార్టీ తరుపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించారు. రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత తమిళగ మున్నెట్ర మున్ననై పేరుతో సొంతగా పార్టీ నెలకొల్పారు. 1989 ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. శివాజీ గణేశన్ కూడా తిరువాయిర్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత పార్టీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. కార్యకర్తలను జనతాదళ్‌లో చేరాలని సూచించారు.

రాజకీయాల్లోకి వచ్చిన మరో తమిళ సినీనటుడు విజయ్ కాంత్ .. 2005లో దేశియ ముర్పోర్కు ద్రవిడ కళగం పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. 2006 ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 స్థానాల్లోనూ ఆ పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేయగా, ఒక్కరు మాత్రమే గెలుపొందారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేశారు. 29 సీట్లలో గెలుపొంది జయలలిత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అయితే, 2014 ఎన్నికల్లో 104 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది విజయకాంత్ పార్టీ.

మరో తమిళ నటుడు కార్తీక్ 2006లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 2009లో ఆలిండియా నాదులమ్ మక్కల్ కట్చీ పేరుతో పార్టీని సైతం స్థాపించారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విరుదునగర్ నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. టి.రాజేంద్రన్ ఆలిండియా లట్చియ ద్రవిడ మున్నెట్ర కళగం పేరుతో పార్టీని స్థాపించగా, శరత్ కుమార్.. ఆలిండియా సమత్తువ మక్కల్ కట్చీ( ఏఐఎస్ఎంకే) పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు.ఉపేంద్ర…కర్నాటక ప్రజన్వత జనతా పకాశ (కేపీజేపీ) పేరుతో పార్టీ స్థాపించారు. అనుకున్నస్థాయిలో పార్టీ విజయం సాధించకపోవడంతో అదే పార్టీలో చేరిన అంబరీశ్, పూజా గాంధీ, రమ్య ఆ తర్వాత వివిధ పార్టీలలో చేరిపోయారు.

బాలీవుడ్ లో రాజకీయాల్లోకి వచ్చిన అమితాబచ్చన్‌ 1984లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాలంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఇమడలేక బయటకు వచ్చేశారు. ఆతర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పరోక్షంగా సమాజ్‌వాది పార్టీకి మద్దతిచ్చారు. అందుకు బహుమానంగా ఎస్పీ జయాబచ్చన్‌ను రాజ్యసభకు పంపింది. మరికొందరు బాలీవుడ్ తారలు సునీల్ దత్, వినోద్ ఖన్నా, మిథున్ చక్రవర్తి, వైజయంతీ మాలా, బాలీ, షబానా అజ్మీ. రాజేష్ ఖన్న,శ్యాం బెనగల్, రేఖ, లతా మంగేష్కర్, గోవిందా, శత్రఘ్న సిన్హాలు, నగ్మా ఇలా ఎందరో తారలు రాజకీయాల్లోనూ తమ జాతకాలను పరీక్షించుకుని విఫలయ్యారు.

హిందీ నటుడు దేవానంద్ 1979 లో నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్పీఐ)ని స్థాపించారు. నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్ ఆయనకు మద్దతుగా నిలిచింది. 1980లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 500 కు పైగా స్థానాల్లో పోటీ చేసి.. ఓటమిపాలైంది ఆపార్టీ. తనంతరం మారిన రాజకీయాల నేపథ్యంలో దేవానంద్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించింది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. అయితే, అందుకు దేవానంద్ నిరాకరించారు.

తమిళనాట మరో నటుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. ప్రఖ్యాత హీరో, లోకనాయకుడుగా పేరుగాంచిన కమల్ హాసన్ ఫిబ్రవరి 21న మదురైలో పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించారు. ‘మక్కళ్ నీది మయ్యం (ప్రజా న్యాయ వేదిక)’ పేరుతో ప్రజాక్షేత్రంలోకి దిగారు. మరో విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టారు. బెంగళూరులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మరో తమిళ హీరో విజయ్… ‘ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయ్యక్కమ్’ అనే పార్టీని విజయ్ పేరిట ఆయన తండ్రి ఏర్పాటు చేశారు. అయితే , ఈ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ చెబుతూ వచ్చారు.

తాజాగా తమిళ తలైవా రాజకీయ రంగప్రవేశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. చాన్నాళ్ల పాటు వాయిదా వేస్తూ వచ్చిన రజనీకాంత్ కీలక ప్రకటన చేశారు. డిసెంబరు 31న పార్టీకి సంబంధించిన తొలి ప్రకటన వస్తుందని, మరిన్ని వివరాలు జనవరిలో వెల్లడిస్తానని వెల్లడించారు. దీంతో రజనీ రాజకీయ ప్రయాణంపై అనేక అంచనాలు నెలకొన్నాయి. పార్టీ నిర్మాణం, జెండా, ఎజెండా , ఎన్నికల గుర్తు తదితర అంశాలన్నీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి.