THIRD WORLD WAR: మూడో ప్రపంచ యుద్ధానికి ఈయూ నిర్ణయం దోహదం? మరింత ఆగ్రహంలో పుతిన్.. ఇక యుద్ధ విరమణకు దారేది?

ఉక్రెయిన్ ఈయూ సభ్యత్వం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. అసలు రష్యా సైనిక చర్య ప్రారంభమైందే ఉక్రెయిన్ ఈయూకి దగ్గర అవ్వొద్దని, నాటో కూటమిలో చేరొద్దని.. మరి ఇపుడు ఈయూ ప్రతినిధిబృందం ఉక్రెయిన్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక ఎంటరవడమే మిగిలింది.

THIRD WORLD WAR: మూడో ప్రపంచ యుద్ధానికి ఈయూ నిర్ణయం దోహదం? మరింత ఆగ్రహంలో పుతిన్.. ఇక యుద్ధ విరమణకు దారేది?
Russia Ukraine War
Follow us
Rajesh Sharma

| Edited By: Ravi Kiran

Updated on: Apr 19, 2022 | 9:00 PM

THIRD WORLD WAR INNEVETABLE NOW EUROPEAN UNION DECISION ON UKRAINE ENTRY:  మూడో ప్రపంచ యుద్ధం ఖాయమేనా ఇక ? రష్యా ఏదైతే వద్దని డిమాండ్ చేస్తోందో.. సరిగ్గా అదే ఉక్రెయిన్ చేస్తోంది. మరి పరువు కోసం పాకులాడే రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్.. యుద్దాన్ని మరో లెవెల్‌కి తీసుకువెళ్ళడం కన్ఫర్మే కదా ? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నారు అంతర్జాతీయ అంశాల పరిశీలకులు. 55 రోజుల నుంచి అంటే ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఉక్రెయిన్ దేశంలో రష్యా ప్రత్యేక సైనిక చర్య కొనసాగుతోంది. నాలుగైదు రోజుల్లో ఉక్రెయిన్‌ను దారిలోకి తెచ్చుకోగలమని భావించిన రష్యా అంచనాలు తప్పాయి. ఉక్రెయిన్‌కు అమెరికా తదితర నాటో దేశాలు ఆయుధాలను, ట్యాంకర్ ట్రాకర్లను, ఇతర మిలిటరీ టెక్నాలజీని సరఫరా చేయడం వల్ల ఉక్రెయిన్ మిలిటరీ రష్యన్ దళాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చిన స్టింగర్, జావెలిన్ యాంటి ట్యాంకర్ మిస్సైళ్ళతో ఉక్రెయిన్ మిలిటరీ రష్యన్ దళాలు వెనక్కి మళ్ళేలా చేసింది. కీవ్ నగరం నుంచి రష్యన్ దళాలు వెనక్కి మళ్ళడానికి కారణం ఈ యాంటి ట్యాంకర్ మిస్సైళ్ళేనని యుద్దనిఫుణులు చెబుతున్నారు. ఇంతకీ ఉక్రెయిన్, రష్యా యుద్దం నెక్స్ట్ లెవెల్‌కు చేరుకునే పరిణామం ఏం జరిగింది ? నిజానికి మార్చి చివరి వారంలోనే యూరోపియన్ యూనియన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో ఉక్రెయిన్ కోరుతున్న ఈయూ సభ్యత్వాన్ని ఇచ్చేందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని నెల రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఉక్రెయిన్ తమ దరఖాస్తులో పేర్కొన్న ఈయూలో చేరేందుకు తమ దేశానికి ఉన్న అర్హతలపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఏప్రిల్ మొదటి వారంలో కోరారు. ఈయూ అడిగిన క్లారిఫికేషన్లను ఉక్రెయిన్ అందజేసిన క్రమంలో యూరోపియన్ యూనియన్ ప్రతినిధి బృందం ఏప్రిల్ 18వ తేదీన కీవ్ నగరంలో ప్రత్యక్షమైంది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో ఈయూ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఉక్రెయిన్ వివరణతో ఈయూ ప్రతినిధిబృందం పూర్తిగా సంతృప్తి చెందినట్లు సమాచారం. దాంతో మరో వారం, పదిరోజుల్లోనే ఈయూ ప్రత్యేకంగా భేటీ అయి.. ఉక్రెయిన్ సభ్యత్వాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఇలా ఆగమేఘాల మీద ఉక్రెయిన్ సభ్యత్వాన్ని ప్రకటించే అవకాశం లేకపోతే జూన్ మొదటి వారంలో జరగబోయే ఈయూ కౌన్సిల్ భేటీలో ఉక్రెయిన్ మెంబర్‌షిప్ ఖరారైందని ప్రకటించే అవకాశాలున్నాయని మరికొందరు అంచనా వేస్తున్నారు. ముందుగా ప్రకటించి.. జూన్ కౌన్సిల్ భేటీకి ఉక్రెయిన్‌ని పిలుస్తారా ? లేక కౌన్సిల్ భేటీలోనే ప్రకటిస్తారా అన్నది తేలాల్సి వుంది.

ఏదైతేనేం.. ఉక్రెయిన్ ఈయూ సభ్యత్వం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. అసలు రష్యా సైనిక చర్య ప్రారంభమైందే ఉక్రెయిన్ ఈయూకి దగ్గర అవ్వొద్దని, నాటో కూటమిలో చేరొద్దని.. మరి ఇపుడు ఈయూ ప్రతినిధిబృందం ఉక్రెయిన్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక ఎంటరవడమే మిగిలింది. మరి రష్యా ఏం చేయబోతోందిపుడు ? ఈ ప్రశ్న పలు శాంతికాముక దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈయూ ప్రతినిధిబృందం ఉక్రెయిన్‌లోకి ఎంటరవడమే తరువాయి రష్యా యుద్దాన్ని ముమ్మరం చేసింది. కీవ్ నగరం నుంచి దూరంగా జరగుతున్నామని పదిహేను రోజుల క్రితం వెల్లడించిన రష్యా.. ఆ తర్వాత కొన్నాళ్ళపాటు ఈస్ట్ ఉక్రెయిన్‌ ప్రాంతాలైన డాన్ బాస్, డోనెట్స్క్, లూహాన్స్క్, మరియుపోల్‌లపై దాడులు కొనసాగించింది. మరియుపోల్ నగరాన్ని అయితే శవాల దిబ్బగా చేసేసింది. ఈస్ట్ ఉక్రెయిన్ ఏరియాను క్రిమియాలాగా రష్యా ఆధీనంలోని స్వతంత్ర దేశాలు/ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత రష్యా తన మిలిటరీ యాక్షన్‌ను నిలిపేస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. తాజాగా పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఏప్రిల్ 18వ తేదీన ఈయూ ప్రతినిధిబృందం కీవ్ సిటీకి చేరుకున్న సమయానికి కాస్త అటూఇటూగా రష్యా అయిదు మిస్సైళ్ళను వెస్ట్ ఉక్రెయిన్ ప్రాంతంలో పోలండ్ సరిహద్దుకు చేరువలో వున్న ఎల్వీవ్ సిటీపై ప్రయోగించి, విధ్వంసాన్ని సృష్టించింది. ఇటు రాజధాని కీవ్‌పైనా మళ్ళీ మిస్సైల్ దాడులు మొదలుపెట్టింది. ఇదివరకే ధ్వంసం చేసేసిన ఖార్కీవ్ సిటీపైనా బాంబు దాడులు మొదలుపెట్టింది. 55 రోజులుగా పెద్ద స్థాయిలో విధ్వంసం ఈయూలో ఉక్రెయిన్ చేరడాన్ని రష్యా ఎలాగో జీర్ణించుకోలేదు. ఫలితంగా ఉక్రెయిన్‌పై దాడులను మరింత ముమ్మరం చేయడం, మరిన్ని ప్రాంణాంతక ఆయుధాలను రష్యా వినియోగించే ప్రమాదం కనిపిస్తోంది. అసలే ఇగో లెవెల్స్ కాస్త ఎక్కువే వుండే పుతిన్.. అణ్వాయుధ ప్రయోగానికి వెనుకాడకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బయో వెపన్స్, కెమికల్ వెపన్స్ కూడా వినియోగించే అవకాశాలను అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు.

ఈయూ ప్రాథమిక సూత్రం ‘‘ వన్ ఫర్ ఆల్.. ఆల్ ఫర్ వన్’’ అనే విధానం. ఉక్రెయిన్ ఈయూలో చేరితే ‘‘ వన్ ఫర్ ఆల్.. ఆల్ ఫర్ వన్’’ విధానం ప్రకారం ఆ దేశ రక్షణ కోసం యావత్ యూరోపియన్ యూనియన్ దేశాలు రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఫలితంగా ఉక్రెయిన్, రష్యా యుద్దంలో మరిన్ని దేశాలు ఎంటరవుతాయి. దాంతో రష్యా ఇప్పటి వరకు పరిమితంగా వినియోగిస్తున్న ఆయుధాలను పెంచడం ఖాయం. బలమైన సైనిక సంపత్తి కలిగిన యూరోపియన్ దేశాలు గనక యుద్ధరంగంలోకి నేరుగా దిగితే.. వాటిని ఎదుర్కొనేందుకు రష్యా తన వద్ద వున్న అత్యంత ఆధునిక యుద్ద సామాగ్రిని బయటికి తీయడం ఖాయం. ఇదే జరిగితే మూడో ప్రపంచయుద్దం మొదలవడం ఖాయం. అపుడు దేశాలన్నీ అయితే ఉక్రెయిన్ వైపు, లేదా రష్యా వైపు మొగ్గాల్సి వస్తుంది. అదే జరిగితే ప్రపంచ యుద్దం తీవ్రమై, అది ప్రపంచ నాశనానికి దారితీస్తుందంటే అతిశయోక్తి కాదు. మిలిటరీ యాక్షన్‌ని తీవ్రతరం చేసిన రష్యన్ బలగాలకు కొన్ని ప్రాంతాల్లో ఉక్రెయిన్ దళాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే వుంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని నగరాలను స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్న రష్యాకు ఉక్రెయిన్ మిలిటరీ నుంచి ఊహకందని స్థాయిలో ప్రతిఘటన కనిపిస్తోంది. దాంతో రష్యన్ సైన్యం తీవ్రంగా శ్రమిస్తోందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మరియుపోల్ సిటీని స్వాధీనం చేసుకునేందుకు రెడీ అయిన రష్యన్ దళాలు.. తమ పనిని పూర్తి చేయలేకపోయాయి. దాంతో వెంటనే వెపన్స్ వదిలేసి, సరెండర్ కావాలంటూ ఉక్రెయిన్ మిలిటరీకి రష్యన్ రక్షణ శాఖ అల్టిమేటం జారీ చేసింది. రష్యాతో యుద్దం సెకెండ్ లెవెల్‌కి చేరిందంటూ జెలెన్ స్కీ ప్రకటించిన కాసేపటికే రష్యా రక్షణ విభాగం ఈ అల్టిమేటం జారీ చేయడం విశేషం. ఉక్రెయిన్ దళాలు విచక్షణ, వివేకంతో స్వయంగా ఓ నిర్ణయం తీసుకుని ఆయుధాలు వదిలేయాలంటూ రష్యా తమ అల్టిమేటంలో పేర్కొంది. అవివేకంగా ఇంకా రష్యాను ప్రతిఘటించే చర్యలను కొనసాగిస్తే పరిస్థితి మరింత విషమిస్తుందని రష్యా హెచ్చరించింది. దాంతో ఉక్రెయిన్ ఈయూ ఎంట్రీ విషయంలో చోటుచేసుకుంటున్న పురోగతిని పుతిన్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు భావించాలి. ఇలాంటి కీలక తరుణంలో యుద్దం మరింత ముదరకుండా ఐక్యరాజ్యసమితితోపాటు శాంతికాముక దేశాలు రంగంలోకి దిగాల్సిన అవసరం కనిపిస్తోంది.