2023 Year: ఎన్నికల నామ సంవత్సరంగా 2023.. ఖచ్చితంగా ఎన్నికలు జరగాల్సినవి 9 కాగా.. మరో రెండు జతకట్టే అవకాశం?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. వరుసగా రెండు విడతలు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని సంతరించుకునేందుకు యధాశక్తి ప్రయత్నం చేస్తోంది

2023 Year: ఎన్నికల నామ సంవత్సరంగా 2023.. ఖచ్చితంగా ఎన్నికలు జరగాల్సినవి 9 కాగా.. మరో రెండు జతకట్టే అవకాశం?
Elections
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 15, 2023 | 1:48 PM

ప్రపంచవ్యాప్తంగా క్యాలెండర్ మారిపోయింది. 2022వ సంవత్సరం చరిత్రలో కలిసిపోతూ 2023వ సంవత్సరాన్ని మనందరి ముందుకు తెచ్చింది. ఈ సంవత్సరంలో ఏమేం జరగబోతున్నాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశ రాజకీయాలను పరిశీలిస్తే 2024లో మన దేశం సార్వత్రిక ఎన్నికలకు పోబోతోంది. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. వరుసగా రెండు విడతలు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని సంతరించుకునేందుకు యధాశక్తి ప్రయత్నం చేస్తోంది. అందుకోసం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తన రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఆసేతు హిమాచలం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కన్యాకుమారి వద్ద సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తర భారతంలో కొనసాగుతుంది. వారం రోజులపాటు బ్రేక్ తీసుకున్న రాహుల్ గాంధీ జనవరి మూడవ తేదీ నుంచి పాదయాత్రను మళ్ళీ ప్రారంభించబోతున్నారు. ఇలా ప్రధాన రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో 2023వ సంవత్సరాన్ని అత్యంత కీలకమైనదిగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైతే, కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటే 11 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే దేశంలో దాదాపు 40 శాతం ప్రజలు తమ తమ రాష్ట్రాలకు ప్రభుత్వాలను ఎన్నుకోబోతున్నారు. ఇందులో పలు రాష్ట్రాలు కేంద్రంలో పాలకపక్షమైన భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకం. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. వచ్చే జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు ఆయా రాష్ట్రాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఎంతైనా ఉంది. ఇక ఈ సంవత్సరం ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో రెండింటిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాటిని నిలబెట్టుకోవడంతోపాటు మరిన్ని రాష్ట్రాలను బిజెపి నుంచి తీసుకుని, తన ఖాతాలో వేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది.

2022లో పలు కీలక పరిణామాలు

నిజానికి 2022లో కూడా పలు కీలక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మరిన్ని రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలు కూడా రాజకీయంగా రసవత్తరంగా కొనసాగాయి. వాటి ఫలితాలు ఎలా ఉన్నా మొత్తంగా 2022లో ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాయి. దాంతోపాటు పలు కీలక రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఉదాహరణకు మహారాష్ట్రలో గత సంవత్సరం వరకు కొనసాగిన శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. శివసేన పార్టీని నిట్ట నిలువునా చీల్చిన ఏకనాథ్ షిండే వర్గం భారతీయ జనతా పార్టీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తక్కువ స్థాయిలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఏకాదశి షిండేకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి బిజెపి రాజకీయ చతురతను ప్రదర్శించింది. అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టేలా ఒప్పించారు బిజెపి పెద్దలు. ఆ విధంగా మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు కొన్ని రోజులపాటు ఉత్కంఠ రేపి చివరకు శివసేన రెబల్ వర్గం, బిజెపి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుతో ముగిసాయి. అటు ఉత్తరాన బీహార్ లోను రాజకీయ పరిణామాలు నాలుగైదు రోజులపాటు ఆసక్తి రేపాయి. బిజెపితో కలిసి అధికారంలో కొనసాగిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నట్టుండి బిజెపికి కట్ కొట్టారు. ఆర్జెడితో కలిసి కేవలం 24 గంటల్లోనే మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసారి నితీష్ కుమార్ వెంట ఆర్.జె.డి.తో పాటు కాంగ్రెస్, వామపక్షాలు కూడా జత కలిశాయి. మహారాష్ట్ర, బీహార్ రాజకీయ పరిణామాలు పలువురిని కొన్ని రోజులపాటు ఆసక్తికరంగా ఆ రెండు రాష్ట్రాల వైపు చూసేలా చేశాయి.

ఆసక్తిరేపుతున్న బీఆర్ఎస్ ఎంట్రీ

ఇక 2024 కంటే ముందు ఏడాది కాలంలో దేశంలో తొమ్మిది లేదా 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పట్టు నిలబెట్టుకోవడం ద్వారా 2024 ఎన్నికలను ఒక ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేందుకు రెండు ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నాయి. అందులో భాగంగానే వరుస కార్యక్రమాలను నిర్వహిస్తూ రెండు పార్టీల నేతలు బిజీబిజీగా కనిపిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల గురించి ఒకసారి తరచి చూస్తే ముందుగా ఈశాన్య రాష్ట్రాల గురించి చెప్పుకోవాలి. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయా, త్రిపుర రాష్ట్రాలలో 2023 ప్రథమార్థంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో నాగాలాండ్ అసెంబ్లీ కాలపరిమితి అన్నిటికంటే ముందు ముగుస్తుంది. మార్చి 12వ తేదీన నాగాలాండ్ అసెంబ్లీ గడువు ముగుస్తుండగా మేఘాలయ అసెంబ్లీ మార్చి 15న, త్రిపుర అసెంబ్లీ మార్చి 22న కాలపరిమితి పూర్తి చేసుకోబోతున్నాయి. సో.. పది రోజుల వ్యవధిలో ఈ మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి ముగియనున్నది. ఈనేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలను ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిజెపిలకు అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీకి 2023 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ కాల పరిమితి మే నెల 24వ తేదీన ముగియనున్నది. గత నాలుగున్నర సంవత్సరాలుగా కర్ణాటకలో రాజకీయ పరిణామాలు పలు సందర్భాలలో ఆసక్తి రేపాయి. కాంగ్రెస్, బిజెపి, జనతాదళ్ (సెక్యులర్) పార్టీల మధ్య రాజకీయ చతురత దోబూచులాడింది చివరికి సంఖ్యాబలం ఆధారంగా అక్కడ బిజెపి అధికారంలో కొనసాగుతుంది. అయితే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా అధికారాన్ని పొందిన బిజెపి.. ఈ సంవత్సరం జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతోందన్నది ఆసక్తి రేపుతుంది. దానికి తోడు తెలంగాణ నుంచి బయలుదేరిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ (సెక్యులర్) పార్టీతో కలిసి పోటీ చేయబోతోంది. కుమార స్వామి సారథ్యంలోని జనతాదళ్ (ఎస్) పార్టీతో భారత రాష్ట్ర సమితి కలిస్తే మరి కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిలో చేరుతుందా లేక ఒంటరిగానే పోటీకి దిగి ఆ రాష్ట్రంలో ముక్కోణపు పోటీకి దారితీస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం.

ఆ రెండు రాష్ట్రాలు కీలకం

ఇక ఈ ఏడాది ద్వితీయార్థంలో చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. వీటిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. 2023 అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలలో రాజస్థాన్‌ది ఒక ప్రత్యేక పరిస్థితి. రాజస్థాన్ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సారధిగా వ్యవహరించిన సచిన్ పైలెట్ ఇప్పుడు సీఎం రేసులో కాస్త ముందుకు వచ్చారు. ఆనాటి ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షునిగా పార్టీని గెలిపించినప్పటికీ కాంగ్రెస్ దిగ్గజ నేత అశోక్ గెహ్లాట్ రాజకీయ మంత్రాంగం ముందు సచిన్ పైలట్ మిన్నకుండిపోవాల్సి వచ్చింది. అయితే, సచిన్ పైలెట్‌కు గాలమేయడం ద్వారా రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలకు సచిన్ పైలెట్ లొంగిపోలేదు. ఇదే ఇపుడు ఆయనకు అదృష్టంగా మారే అవకాశముంది. రాహుల్ గాంధీ మద్దతు ఉన్నప్పటికీ సచిన్ పైలట్ ఆనాడు ముఖ్యమంత్రి కాలేకపోయారు. ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతున్నప్పటికీ ఎన్నికల అనంతరం సచిన్ పైలెట్‌నే సీఎం చేయాలన్న అభిమతంతో రాహుల్ గాంధీ ఉన్నారని పలువురు భావిస్తున్నారు. కానీ ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో రెబల్ నేతగా వ్యవహరించినప్పటికీ తనమీద వేటుపడకుండా చూసుకోగలిగిన అశోక్ గెహ్లాట్ రాజకీయ చతురత ముందు సచిన్ పైలెట్ ఏ మేరకు నిలబడతారన్నది ఆసక్తి రేపే అంశం. ఇక మధ్యప్రదేశ్ గురించి చెప్పుకోవాలంటే గత ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు చెప్పారు. అక్కడ కూడా యువ నేత జ్యోతిరాదిత్య సిందియా, సీనియర్ నేత కమల్‌నాథ్ మధ్య సీఎం పదవి ఊగిసలాడింది. కానీ సోనియాగాంధీ సీనియారిటీవైపు, అనుభవం వైపు మొగ్గు చూపారు. దాంతో కమల్‌నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. దీన్ని ఆసరాగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ.. జ్యోతిరాదిత్య సిందియాను మచ్చిక చేసుకుని 27 మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కొని మధ్యప్రదేశ్ పరిపాలన తారుమారయ్యేలా చేశారు. సీఎం సీటులో శివరాజ్ సింగ్ చౌవాన్ కూర్చొని.. జ్యోతిరాదిత్య సిందియాను కేంద్ర మంత్రిని చేశారు. ఇదే తరహా వ్యూహాన్ని రాజస్థాన్లో అమలు చేసినప్పటికీ అక్కడ భారతీయ జనతా పార్టీ సక్సెస్ కాలేదు. సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పట్ల విధేయత ప్రదర్శించారు. ఇలాంటి తరుణంలో ఈ రెండు రాష్ట్రాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు మరో చిన్న రాష్ట్రం చత్తీస్‌గఢ్ కూడా ఆ పార్టీకి అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన అగత్యాన్ని కలిపిస్తోంది. ఇక ఈశాన్య రాష్ట్రాల విషయానికొస్తే త్రిపురలో ఐపిఎఫ్డితో కలిసి బిజెపి అధికారంలో ఉంది. మేఘాలయా, నాగాలాండ్ రాష్ట్రాలలో కూడా స్థానిక చిన్నాచితకా పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారంలో కొనసాగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలపై సానుకూల ప్రభావం పడాలంటే ఈ మూడు రాష్ట్రాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి ఎంతైనా ఉంది. తెలంగాణ విషయానికి వస్తే షెడ్యూల్ ప్రకారం జరిగితే 2023 అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఇక్కడి అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. కానీ రాజకీయ చాణక్యుడు కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది తెలియని అంశం. 2018లో అసెంబ్లీ కాల పరిమితికి ఇంకా 9 నెలల సమయం ఉండగానే దాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికల వైపు మొగ్గు చేపారు కేసీఆర్. తన వ్యూహాత్మక నిర్ణయంతో ఘన విజయాన్ని సాధించారు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీలేవీ ఎన్నికలకు సంసిద్ధంగా లేని అంశం కేసిఆర్‌కు లభించింది. కానీ ఇప్పుడు గత ఏడాదికాలంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయన్న సంకేతాల నేపథ్యంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎప్పటి నుంచో సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారా లేక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా అన్నది ఆసక్తి రేపుతోంది.

తొమ్మిదా? లేక పదకొండా ?

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముందస్తు ఎన్నికల వైపు వ్యూహరచన చేస్తున్నట్లుగా కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలతో కలిసి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మా ఇక్కడి ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న అంచనాలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏపీలో మూడు విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. ఈక్రమంలో 2024లో సార్వత్రిక ఎన్నికలతో కలిసి వెళితే ప్రతికూల ఫలితాలొస్తాయని జగన్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. 2023లో ఎన్నికలు కచ్చితంగా జరగాల్సిన రాష్ట్రాలు తొమ్మిది. అయితే గత మూడున్నర సంవత్సరాలుగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న కాశ్మీర్ అసెంబ్లీ కూడా ఎన్నికల నిర్వహించాలన్న ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే ఖచ్చితంగా ఎన్నికలు జరగాల్సిన తొమ్మిది రాష్ట్రాలతో పాటు మరో రెండు జత కలిసి మొత్తం 11 రాష్ట్రాల అసెంబ్లీలకు 2023లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. దేశ జనాభాలో దాదాపు 40 శాతం ఓటర్లు తమ తీర్పునిచ్చే ఈ 11 రాష్ట్రాల ఎన్నికలు కచ్చితంగా 2024 జనరల్ ఎన్నికలకు ముందు సెమీఫైనల్ లాంటి ఎన్నికలుగానే పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!