AP Politics: అధికార పార్టీలో అంతర్మధనం.. విపక్షాల్లో జోష్.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో...

AP Politics: అధికార పార్టీలో అంతర్మధనం.. విపక్షాల్లో జోష్.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం?
Ap Politics
Follow us

|

Updated on: Mar 20, 2023 | 7:20 PM

మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 9 లోకల్ బాడీస్ సభ్యులతో కూడిన ఎమ్మెల్సీ నియోజకవర్గాలు కాగా రెండు టీచర్ల నియోజకవర్గాలు, మూడు పట్టభద్రులు ఓటర్లుగా వున్న ఎమ్మెల్సీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో లోకల్ బాడీస్ సభ్యులు ఓటర్లుగా వున్న 9లో అయిదింటిని ఏకగ్రీవంగాను, మరో నాలుగింటిని ఎన్నికల్లోను అధికార వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 2 ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ సీట్లు కూడా అధికార పార్టీకే దక్కాయి. వీటితో పోలిస్తే ఓటర్ల సంఖ్య అధికంగా వుండే గ్రాడ్యుయేట్ నియోజక వర్గాల్లో మాత్రం అధికార పార్టీకి షాకిచ్చే ఫలితాలొచ్చాయి. విపక్ష టీడీపీ ఈ మూడు ఎమ్మెల్సీ సీట్లను దక్కించుకోవడంతో అధికార పార్టీ నేతలు ఖంగుతిన్నారనే చెప్పాలి. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ నియోజకవర్గాలను మంచి మెజారిటీ దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ పశ్చిమ రాయలసీమ నియోజకవర్గాన్ని మాత్రం బొటాబొటీ మెజారిటీ గెలుచుకుంది. ఏది ఏమైనా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకున్న టీడీపీలో కొత్త ఉత్సాహం వెల్లువెత్తుతోంది. ఈ ఉత్సాహం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవాలంటే తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్, అందులో ఉపయోగించిన భాష చూస్తే చాలు. ఓటమిని లోలోపల జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ నేతలు.. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. సరే.. శాసన మండలిలో మరో ముగ్గురు పెరిగినంత మాత్రానా టీడీపీ వచ్చేది లేదు.. అధికార వైసీపీకి పోయేది లేదు. కానీ, మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో గ్రాడ్యుయేట్లలో ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవడం ఖచ్చితంగా వైసీపీకి షాకే. అది కూడా రాజధానిని మీ ప్రాంతానికిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీని గిఫ్టుగా ఇవ్వాలంటూ నలుగురైదుగురు మంత్రులు, 30కి పైగా ఎమ్మెల్యేలు ప్రచారం చేసినా అక్కడి పట్టభద్రులు అధికార పార్టీకి అండగా నిలువ లేదు. సరికదా విశాఖకు రాజధాని తరలింపును అడ్డుకుంటున్న, వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించారు. ఉత్తరాంధ్ర ప్రజానీకం మరీ ముఖ్యంగా అక్కడి గ్రాడ్యుయేట్స్ విశాఖ రాష్ట్ర రాజధానిగా కావద్దని కోరుకుంటున్నారా ? అన్నసందేహం ఈ తాజా తీర్పుతో కలుగక మానదు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే అంశాన్ని గట్టిగా ప్రచారం చేసుకునే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.

టీచర్లు అలా.. గ్రాడ్యుయేట్లు ఇలా..

ఏపీలో మునిసిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్తులు, గ్రామపంచాయితీలలో అధికార వైసీపీ నేతలు పాలక వర్గాలుగా వున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే 90 నుంచి 100 శాతం లోకల్ బాడీస్‌ని అధికార పార్టీ గెలుచుకుంది. దాంతో ఇటీవల జరిగిన లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సీట్లను వైసీపీనే గెలుచుకుంది. ఇందులో 5 ఏకగ్రీవం కాగా.. ఎన్నికలు జరిగిన నాలుగు ఎమ్మెల్సీ సీట్లు వైసీపీ ఖాతాలోకే వెళ్ళాయి. ఇక రెండు టీచర్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే అవి కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్ళాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో రాష్ట్ర సర్కార్‌పై వ్యతిరేకత వుందన్న ఇంటెలిజెన్స్ నివేదికను దృష్టిలో వుంచుకుని, టీచర్ నియోజకవర్గాల్లో ప్రైవేటు టీచర్లను పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదు చేయించారన్న ప్రచారం వుంది. దానికి తోడు తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి టికెట్ ఇవ్వడం ద్వారా వైసీపీ ఆ సీటును వ్యూహాత్మకంగా దక్కించుకుందన్న ప్రచారం వుంది. ఇక పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరికి వైసీపీ విజయం సాధించింది. స్థానిక సంస్థలు, టీచర్ నియోజక వర్గాలను పక్కన పెడితే.. గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు ప్రత్యేకమైనవి. నెంబర్ పరంగా చాలా ఎక్కువ స్థాయిలో ఓటర్లున్నారు. నియోజకవర్గాల పరంగా చూసినా 30 నుంచి 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సెగ్మెంటు విస్తరించి వుంటుంది. దాంతో గ్రాడ్యుయేట్ల అభిప్రాయాన్ని తాజా ఓటర్ మూడ్‌గా పరిగణలోకి తీసుకునే అవకాశాలు కూడా వున్నాయి.

వారంతా ఓటర్ మూడ్ క్రియేటర్స్

నిజానికి సమాజంలో టీచర్లు, చదువుకున్న (పట్టభద్రులు) వారిని ఓటర్ మూడ్ ప్రభావితం చేసే వర్గాలుగా పరిగణిస్తున్నారు. అంటే వారు వారి అభిప్రాయాన్ని పలువురికి వ్యాప్తి చేయించి, వారి ఆలోచనలను ప్రభావితం చేయగలరన్నమాట. ఇలాంటి వర్గాలు గతంలో పోలింగ్‌కు రెండు, మూడు రోజుల వీధి సమావేశాలు నిర్వహించి, ఓటర్లను ప్రభావితం చేసే వారు. గత రెండు దశాబ్ధాలుగా ఎన్నికల పర్వంతో ధన ప్రవాహం పెరిగిన తర్వాత ఇలా ఓటర్ మూడ్ ప్రభావితం చేసే అవకాశాలు సన్నగిల్లాలు. పోలింగ్ ఒకట్రెండు రోజుల ముందు జోరుగా సాగుతున్న డబ్బు పంపిణీ కారణంగా మేధావుల జోక్యం, వారి ప్రభోధాలకు ఆస్కారం లేకుండా పోయింది. అందుకే తాజాగా టీచర్, గ్రాడ్యుయేట్లిచ్చిన భిన్నమైన తీర్పులు వచ్చే ఏడాది ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం పడుతుందన్నది ఇదమిత్తంగా చెప్పలేని పరిస్థితి. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే అక్కడి యువతలో పెరుగుతున్న పవన్ కల్యాణ్ ప్రభాల్యం అక్కడి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వైపు మొగ్గుచూపేలా చేసిందని భావించవచ్చు. గత కొంత కాలంగా టీడీపీ, జనసేన పార్టీలు భవిష్యత్తులో కలిసి పని చేయబోతున్నయన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈక్రమంలో అక్కడి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జనసేన క్యాండిడేట్ లేకపోవడంతో అక్కడి గ్రాడ్యుయేట్లు టీడీపీని ప్రత్యామ్నాయంగా చూసుకున్నట్లు కనిపిస్తోంది. తూర్పు, పశ్చిమ రాయలసీమల్లో స్థానిక పరిస్థితులే గ్రాడ్యుయేట్లను ప్రభావితం చేసి వుండొచ్చన్న అభిప్రాయమూ వుంది. ఈక్రమంలో తాజా తీర్పు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఫిఫ్టీఫిఫ్టీగా వున్నట్లు విశ్లేషించుకోవచ్చు.