Moonbow: రెయినోబో చూశాం.. మూన్‌బో అంటే ఏమిటి? ఈ వింత చూడాలంటే ప్రపంచంలోనే అతిపె..ద్ద..
రెయిన్‌బో (Rainbow) అంటే ఇంద్రధనుస్సు. మరి మూన్‌బో (Moonbow) అంటే? సందేహమెందుకు చంద్రధనుస్సునే మూన్‌బో అంటారు. చంద్రవిల్లును వీక్షించేందుకు పౌర్ణమినాడు ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతమైన..
Lunar Rainbow in Victoria Falls: రెయిన్‌బో (Rainbow) అంటే ఇంద్రధనుస్సు. మరి మూన్‌బో (Moonbow) అంటే? సందేహమెందుకు చంద్రధనుస్సునే మూన్‌బో అంటారు. ప్రకృతి కాంతకు రంగులన్నీ అద్దుతూ ఏర్పడే సప్త వర్ణ శోభిత ఆకాశ హరివిల్లునే ఇంధ్రధనుస్సు అంటారు. వాన చినుకులగుండా ప్రసరించే సూర్యకిరణాలవల్ల మబ్బులమీద కనపడే ఏడు రంగుల హరివిల్లు. ఇది సహజ సిద్ధంగా ఏర్పడే ఓ ప్రక్రియ. ఇంద్రధనుస్సుకు హరివిల్లు, ఇంద్రచాపము, రోహితము, వాతరూపము, వాయుఫలము, వేలుపువిల్లు, వేల్పుదొరవిల్లు, శక్రకార్ముకము, శక్రధనుస్సు అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఐతే అచ్చం హరివిల్లు మాదిరిగానే చంద్రవిల్లు కూడా ఏర్పడుతుందని మీకు తెలుసా? అసలెప్పుడైనా ఆకాశం వైపు కన్నులెత్తి ఈ అద్భుతాన్ని తిలకించారా? చూడలేదా.. చంద్రధనుస్సు ఏ విధంగా ఏర్పడుతుందో.. ఎప్పుడు ఏర్పడుతుందో ఈ విశేషాలు మీకోసం..
చంద్రధనుస్సును ఇంగ్లిష్‌లో Moonbow లేదా Moon rainbow లేదా Lunar rainbow అని కూడా అంటారు. ఇది కూడా సహజంగా సంభవించే వాతావరణ దృగ్విషయం. ఇంద్రధనుస్సు సూర్యకాంతి వల్ల ఏర్పడితే.. చంద్రధనుస్సు చంద్రుడి కిరణాల ద్వారా ఏర్పడే చంద్రవిల్లు. అంటే చందమామ నుంచి వెలువడే కాంతి నీటి బిందువులతో కాంతి వక్రీభవనం చెందడం వల్ల ఏర్పడుతుంది. ఐతే చంద్రుని ఉపరితలం నుంచి తక్కువ మొత్తంలో కాంతి ప్రతిబింబించడం మూలంగా చంద్రధనుస్సు ఏర్పడినప్పుడు చివర ఉండే రంగులు మసకబారినట్లు కనిపిస్తాయి.
అంతేకాకుండా రంగుల మధ్య తేడాను గుర్తించడానికి చూపరులకు కష్టమవుతుంది. చాలా మటుకు ఇంద్రధనుస్సు పగటి సమయాల్లో కనిపిస్తే.. చంద్రధనుస్సు మాత్రం రాత్రి సమయంలో తెలుపు రంగులోనే కనిపిస్తుంది. పౌర్ణమి నాడు స్పష్టంగా దీనిని చూడొచ్చు. సాధారణంగా చంద్రధనుస్సు జలపాతాల వద్ద ఏర్పడతాయి. జలపాతాలు పలుచగా ఉండే పొగమంచును సృష్టిస్తాయి. ఈ పొగమంచులో చంద్ర ఇంద్రధనుస్సును స్పష్టంగా చూసేందుకు సాధ్యమవుతుంది.
చంద్రవిల్లును వీక్షించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతమైన విక్టోరియా జలపాతం దగ్గరికి వెళ్లాల్సిందే. పౌర్ణమి నాడు జింబాబ్వే రెయిన్ ఫారెస్ట్ ద్వారా ప్రయాణించి వేల మంది చంద్ర ఇంద్రధనుస్సును వీక్షించేందుకు అక్కడికి వస్తుంటారు. దీంతో Moonbowకు విక్టోరియా జలపాతం ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది.