ఎస్ బ్యాంక్ ‘పునరుజ్జీవం’.. రంగంలోకి రిజర్వ్ బ్యాంకు

సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్ బ్యాంకును 'పునరుజ్జీవింప జేసేందుకు' రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బీ ఐ) రంగంలోకి దిగింది. ఈ బ్యాంకును నష్టాల బారి నుంచి కాపాడడానికి ఓ 'పునరుద్దీపన పథకాన్ని ' చేబట్టింది. ఇందులో భాగంగా ఎస్ బీ ఐ..

ఎస్ బ్యాంక్ 'పునరుజ్జీవం'.. రంగంలోకి రిజర్వ్ బ్యాంకు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 07, 2020 | 2:14 PM

సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్ బ్యాంకును ‘పునరుజ్జీవింప జేసేందుకు’ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బీ ఐ) రంగంలోకి దిగింది. ఈ బ్యాంకును నష్టాల బారి నుంచి కాపాడడానికి ఓ ‘పునరుద్దీపన పథకాన్ని ‘ చేబట్టింది. ఇందులో భాగంగా ఎస్ బీ ఐ.. ఇందులో 49 శాతం వాటాను పెట్టుబడిగా పెడుతుంది. ఎస్ బ్యాంకులో ఎలాంటి అవకతవకలు జరిగాయో సమగ్రంగా విచారించాలని, ఎవరెవరు బాధ్యులో తేల్చాలని తాము రిజర్వ్ బ్యాంకును కోరినట్టు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.’డ్రాఫ్ట్ ఎస్ బ్యాంక్ రీ కంస్ట్రక్షన్ స్కీమ్-2020 ‘ పేరిట ఈ పథకాన్ని ప్రకటించిన ఆర్ బీ ఐ, మూలధనం కోసం అల్లాడుతున్న ఈ బ్యాంకును ఆదుకోనున్నట్టు తెలిపింది. ఈ పథకం కింద ఈ బ్యాంక్ అధీకృత మూలధనాన్ని 5 వేల కోట్లుగా మార్చారు. అలాగే ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటి 2 రూపాయల చొప్పున 2,400 కి మార్చనున్నారు. ఇది మొత్తం రూ. 4,800 కోట్లుగా మారుతుందని అంచనా. ఇక ఒక్కో షేరుకు 10 రూపాయల చొప్పున 49 శాతం వాటా పెట్టుబడిగా పెడతారు. ఆరుగురు సభ్యులతో పునర్వ్యవస్థీకరించిన బోర్డులో ఎస్ బీ ఐ కి చెందిన ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

ఎస్ బ్యాంక్ షేర్లు శుక్రవారం బీ ఎస్ ఈ సెన్సెక్స్ లో 56 శాతానికి దిగజారాయి. కాగా- ఇవాళ ఉదయం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన ఎస్ బీ ఐ చైర్మన్ రజనీష్ కుమార్.. ఈ సంక్షోభం కేవలం ఎస్ బ్యాంకుకు మాత్రమే పరిమితమని స్పష్టం చేశారు. కొత్త పథకం కింద ఈ బ్యాంక్ ఉద్యోగుల వేతనాల్లో  ఇదివరకు మాదిరే ఎలాంటి మార్పు ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ బ్యాంకు డిపాజిటర్ల సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుందని నిర్మలా సీతారామన్ తో బాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా హామీ ఇచ్చారు. అలాగే ఏప్రిల్ 3 వరకు విధించిన మారటోరియం కాలపరిమితి (విత్ డ్రాల్ లిమిట్..రూ.50 వేలు) సైతం ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఖాతాదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎస్ బ్యాంక్ కొత్త అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ కూడా అభయమిచ్చారు.

ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుని ఇంట్లో ఈడీ సోదాలు:

ఎస్ బ్యాంక్ ఫౌండర్ రానా కపూర్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. శుక్రవారం రాత్రే ముంబైలోని ఆయన ఇంటికి చేరుకున్న వీరు.. నిర్విరామంగా సోదాల్లో బిజీ అయ్యారు. మనీలాండరింగ్ కేసులో ‘క్విడ్ ప్రోకో’ కింద కపూర్, ఆయన భార్య భారీగా అవకతవకలకు పాల్పడినట్టు భావిస్తున్నారు. దేవన్ హోసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీ హెచ్ ఎఫ్ ఎల్) కు ఈ బ్యాంక్ ఇఛ్చిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారడంలో ఈ భార్యాభర్తల ప్రమేయం ఉండవచ్చునని ఈడీ అంచనా వేస్తోంది. రానా కపూర్ తో బాటు ఆయన భార్య బిందును కూడా అధికారులు విచారిస్తున్నారు. దేవన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రమోటర్లయిన కపిల్ వాధ్వాన్, ఆయన సోదరుడు ధీరజ్ వాధ్వాన్ లతో జరిపిన లావాదేవీల్లో రానా కపూర్ పలు అక్రమాలకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఆయన, ఆయన భార్య దేశం విడిచి వెళ్లకుండా లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.