కర్ణాటకలో హైవేని ప్రధాని మోదీ ప్రారంభించి కనీసం వారం రోజులు కూడా కాలేదు. అంతలోనే కంటికి కనిపించనంతగా జలమయమై పోయింది. అవును, ఆరు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన బెంగళూరు-మైసూరు హైవే శుక్రవారం రాత్రి రామనగర ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు నీటమునిగింది. దాదాపు రూ. 8,480 కోట్లతో నిర్మించిన ఈ హైవే రోడ్డు.. బెంగళూరు సమీపంలోని రామనగర జిల్లాలో నీటితో నిండిపోయింది. హైవేపై ఉన్న అండర్‌బ్రిడ్జిలో కూడా నీరు నిలిచిపోవడంతో బంపర్-టు-బంపర్ ప్రమాదాల కారణంగా వాహనాలు నెమ్మదిగా వెళ్లడంతో పాటు హైవేపై చాలా సేపు ట్రాఫిక్ జామ్‌లు చోటుచేసుకున్నాయి. అయితే ఇదే అండర్‌బ్రిడ్జి పరిసరాల్లో గత ఏడాది కురిసిన అనూహ్యమైన వర్షాలకు కూడా వరదలు వచ్చాయి. హైవే ప్రారంభించి వారం రోజులు కూడా కాకుండానే నీట మునిగిన రోడ్డును చూసిన స్థానికులు.. ఘటనకు సంబంధించిన దృశ్యాలను నెట్టింట పోస్ట్ చేస్తూ దేశ ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైపై మండి పడుతున్నారు. ఇంకా హైవే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందా..? మోదీగారు చూశారా..? అంటూ ప్రశ్నలతో నిందిస్తున్నారు.
అయితే ఈ క్రమంలోనే వికాస్ అనే వ్యక్తి స్థానిక మీడియాతో మాట్లాడుతూ ‘నా మారుతీ స్విఫ్ట్ కారు నీళ్లతో నిండిన అండర్‌బ్రిడ్జిలో సగం మునిగిపోయింది. అది స్విచ్ ఆఫ్ అయింది. ఆపై వెనుక నుంచి వచ్చిన లారీ నా కారును ఢీకొట్టింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు..? నా కారు మరమ్మతులు చేయించాలని ముఖ్యమంత్రి బొమ్మైని అభ్యర్థిస్తున్నాను. ప్రధాని మోదీ హైవేను ప్రారంభించారు. అసలు ప్రారంభోత్సవానికి రహదారి సిద్ధంగా ఉందో లేదో అని ముందుగానే సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చించారా..? వారి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సామాన్య ప్రజలమైన మనం బాధపడాలా..? వారు భారీ టోల్ ఫీజ్ డిమాండ్ చేస్తారు. కానీ దానితో ఏ ప్రయోజనం..?’ అంటూ మండిపడ్డారు. బంపర్ టు బంపర్ ప్రమాదాల్లో తమ వాహనమే ప్రథమ స్థానంలో నిలిచిందని ఆందోళనకు దిగిన మరో ప్రయాణికుడు నాగరాజు.. ఈ ప్రమాదాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.
First summer showers of the season has exposed quality & planning of Bengaluru – Mysuru expressway. Water logging reported at multiple places. Last year the highway had seen massive flooding when it was being constructed, NHAI had promised to fix it. #BengaluruMysuruExpresswaypic.twitter.com/2uuscSCtCh
‘హైవేని ప్రారంభించిన వెంటనే అండర్‌బ్రిడ్జిలో నీరు నిండిపోవడం వల్ల అనేక ప్రమాదాలు నమోదయ్యాయి. మొదటిది నాదే. ఆపై ఏడెనిమిది వాహనాలతో బంపర్-టు-బంపర్ ప్రమాదాలు వరుసగా జరిగాయి. నీరు తగ్గడానికి తావే లేదు. దీనికి బాధ్యులెవరు..?’ అంటూ నాగరాజు ప్రశ్నించారు. కాగా, ఈ నెల 12న ప్రధాని మోదీ 118 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. దీని ద్వారా బెంగళూరు-మైసూరు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని 3 గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గించారు.