Nirmala Sitharaman : అందుకే సాగు చట్టాలను ఉపసంహరించుకున్నాం.. యూపీలో మళ్లీ బీజేపీదే విజయం.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్..
వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నంత మాత్రాన తాము వెనకడుగు వేసినట్లు కాదని, తాము అమలుచేస్తోన్న ఇతర సంస్కరణలపై ఇది ఏ మాత్రం ప్రభావం చూపదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు
వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నంత మాత్రాన తాము వెనకడుగు వేసినట్లు కాదని, తాము అమలుచేస్తోన్న ఇతర సంస్కరణలపై ఇది ఏ మాత్రం ప్రభావం చూపదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడి మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకోవడం, తాజాగా ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన నిర్మల.. సాగు చట్టాలపై తాము తీసుకున్న నిర్ణయం ఇతర సంస్కరణలపై ప్రభావం చూపదన్నారు. తాము ఇప్పటికీ రైతు చట్టాలను సమర్థిస్తున్నామని, ఇవి అన్నదాతలకు మేలు చేకూరుస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోల్లో ఇవే చట్టాలను చేర్చాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
‘మధ్య తరగతి, సన్నకారు రైతులను ఆదుకునేందుకే మేం ఈ చట్టాలను ప్రవేశపెట్టాం. ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. వ్యవసాయ రంగానికి చెందిన పలువురు నిపుణులు, ప్రముఖులతో చర్చించి, ఎంతో హోం వర్క్ చేసి ఈ చట్టాలను రూపొందించాం. ప్రస్తుతమున్న రాజకీయ పార్టీలు గత 10-15 ఏళ్లుగా ఈ చట్టాలకు అనుకూలంగా మాట్లాడాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పార్టీలు యూటర్న్ తీసుకున్నాయి. అదే సమయంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను మేం ఒప్పించలేకపోయాం. అందుకే మేం వాటిని ఉపసంహరించుకున్నాం. అన్నదాతల ఆవేదనను అర్థం చేసుకునే ప్రధాని మోడీ సాగు చట్టాలను ఉపసంహరించుకున్నారు. రైతులకు క్షమాపణ చెప్పడమనేది ప్రధాని ఉదారతను తెలియజేస్తోంది ‘ అని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. ఇక ఉత్తర ప్రదేశ్‌తో సహా ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సాగు చట్టాలను రద్దు చేశారన్న విమర్శలపై కూడా ఆమె స్పందించారు. ‘ యూపీ అసెంబ్లీ ఎన్నికలకు, సాగు చట్టాల ఉపసంహరణకు సంబంధం లేదు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. శాంతిభద్రతలను బాగా మెరుగుపరుస్తున్నారు. అక్కడి ప్రతిపక్షాలు వాటిలో వేలుపెట్టడం తప్ప చేసిందేమీ లేదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే విజయం సాధిస్తుంది.
Also Read: