I.N.D.I.A Vs NDA: ‘ఇండియా’పై గెలుపు అంత ఈజీ కాదు.. ఎన్డీఏ ముందున్న సవాళ్లేంటి?
Show of strength: వేదిక పంచుకున్న 26 పార్టీల్లో కొన్ని పార్టీలు రాష్ట్రాల స్థాయిలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. అహాలు వీడి విబేధాలను పక్కనపెట్టి మరీ ఐక్యతను ప్రదర్శించడం కాషాయదళానికి పెద్ద సవాలే. ఈ ఏడాది చివర్లో జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఐఎన్డీఐఏ - ఎన్డీయే కూటముల మధ్య తొలి పోరు జరగనుంది.

ప్రతిపక్షాల కొత్త కూటమి ‘ఐఎన్డీఐఏ (ఇండియా)’ను అవినీతి, కుటుంబ వారసత్వ పార్టీల సమ్మేళనంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎద్దేవా చేస్తున్నప్పటికీ కూటమి ఐక్యతపై లోలోన కొంత ఆందోళన చెందుతోంది. వేదిక పంచుకున్న 26 పార్టీల్లో కొన్ని పార్టీలు రాష్ట్రాల స్థాయిలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. అహాలు వీడి విబేధాలను పక్కనపెట్టి మరీ ఐక్యతను ప్రదర్శించడం కాషాయదళానికి పెద్ద సవాలే. ఈ ఏడాది చివర్లో జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఐఎన్డీఐఏ – ఎన్డీయే కూటముల మధ్య తొలి పోరు జరగనుంది. ఇప్పటి వరకు బీజేపీని కాంగ్రెస్ సహా మిగతా పార్టీలు దాదాపు విడివిడిగానే ఎదుర్కొంటూ వచ్చాయి.
ఇప్పుడు కూటమిగా ఏర్పడడం ఏర్పడటం ఈ నాలుగు రాష్ట్రాల్లో శక్తినిచ్చే టానిక్‌లా మారుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటే, 2024 సార్వత్రిక ఎన్నికలకు సైతం మరింత ఊపునిస్తాయి.
జూన్ 23న బిహార్ రాజధాని పాట్నాలో 15 పార్టీలతో మొదలైన ప్రతిపక్ష పార్టీల ఐక్య ప్రస్థానం.. బెంగళూరు సమావేశం నాటికి మరో 11 పార్టీలు చేరి సంఖ్యాబలం 26కు పెరిగింది. అదే రోజు ఎన్డీఏ కూటమి కూడా చిన్న పార్టీలను కలుపుకుని 38 పార్టీలతో బలప్రదర్శన చేసింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు చెరో కూటమిలో చేరిన వాతావరణం కనిపిస్తున్నప్పటికీ, ఈ రెండు కూటముల్లో లేని బలమైన పార్టీలు ఇంకా చాలానే మిగిలి ఉన్నాయి. వాటిలో రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న భారత రాష్ట్ర సమితి, ఏపీలో బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు, ఒడిశాలో బిజూ జనతా దళ్, పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ వంటివి ఉన్నాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ పార్టీల్లో కొన్ని ఎటో ఒక వైపు చేరవచ్చు లేదంటే.. అలాగే తటస్థంగా కొనసాగవచ్చు. అయితే తమ విజయావకాశాలు మరింత పెంచుకోవడం కోసం INDIA కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దేశభక్తి భావోద్వేగంతో ఎన్నికల రాజకీయాలు చేసే బీజేపీకి ‘ఇండియన్(I) నేషనల్(N) డెవలప్‌మెంటల్ (D) ఇన్‌క్లూజివ్(I) అలయన్స్(A)’ – సంక్షిప్తంగా I.N.D.I.A (ఇండియా) పేరుతో ప్రతిపక్ష కూటమి కౌంటర్ చేస్తోంది. పేరు పెట్టిన మరుక్షణం నుంచే ఇక నుంచి పోటీ ఎన్డీఏ – ఇండియా మధ్య అంటూ విస్తృతంగా ప్రచారం కూడా మొదలుపెట్టింది.




ఇదిలా ఉంటే.. భిన్న సిద్ధాంతాలు, నేపథ్యాలు కల్గిన పార్టీలతో ఏర్పడ్డ కూటమిలో సమన్వయం కోసం 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని కూడా వెంటనే ఏర్పాటు చేసింది. కూటమి ప్రధాన కార్యాలయాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది కేవలం ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం కోసం మాత్రమే కాదు, సంయుక్త కార్యాచరణ, సీట్ల సర్దుబాటుతో పాటు ఎన్నికల రణ రంగంలో ప్రచార సంబంధ వ్యవహారాలను కూడా నిర్వహించనుంది.
అహాలు వీడి.. ఐక్యతారాగం
ఐఎన్డీఐఏ (ఇండియా) కూటమిలో చేతులు కలిపిన రాజకీయ పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో బద్ధ విరోధులుగా ఉన్నాయి. ఈ కూటమి తొలి సమావేశం సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి మాట్లాడుతూ.. ప్రతిపక్ష కూటమిలో “పార్టీల నేతల చేతులు కలుస్తాయి తప్ప మనసులు కలవవు” అన్నారు. అనేక రాష్ట్రాల్లో నిజానికి ఇదే పరిస్థితి ఉంది. కూటమిలో ప్రధాన పార్టీ కాంగ్రెస్‌కు కేరళలో కమ్యూనిస్టులతోనే వైరం ఉంది. తృణమూల్ కాంగ్రెస్‌కు బెంగాల్‌లో అటు కాంగ్రెస్‌తో, ఇటు కమ్యూనిస్టులతో వైరం ఉంది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ – ఆమ్ ఆద్మీ పార్టీలు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఇలాంటప్పుడు ఐక్యత ఎంతమేరకు సాధ్యపడుతుందనే అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. అయితే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా వీరందరికీ ఉమ్మడి శత్రువుగా భారతీయ జనతా పార్టీ కనిపిస్తున్నప్పుడు.. ఈ రాజకీయ వైరాలు పక్కనపెట్టి వేదికపై పార్టీలు చేతులు కలిపాయి. ఇక క్షేత్రస్థాయిలోనూ సర్దుబాటు చేసుకోవడంపై దృష్టి పెట్టాయి. అహం వీడి అవసరమైతే మెట్టు దిగేందుకు సైతం వెనుకాడడం లేదు. ‘ఢిల్లీ ఆర్డినెన్స్’ అంశంపై ఆప్‌కి మద్దతు ప్రకటించడంతో పాటు తమ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగానికి సంబంధించిన క్లిప్‌ను కూడా కాంగ్రెస్ పోస్ట్ చేయడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
దుందుడుకు స్వభావానికి మారుపేరుగా చెప్పుకునే మమతా బెనర్జీ సైతం మారినట్టు కనిపిస్తున్నారు. అంతేకాదు ప్రతిపక్ష కూటమిలో చాలా చురుగ్గానూ వ్యవహరిస్తున్నారు. ఇండియా అన్న అర్థం వచ్చేలా కూటమికి పేరును ఆమెనే సూచించారని ప్రతిపక్ష కూటమి నేతలు చెబుతున్నారు. బీజేపీ జైత్రయాత్రకు బ్రేకులు వేస్తూ వరుసగా మూడోసారి గెలిచి సవాల్ విసిరిన మమతా బెనర్జీ నుంచి తాము చాలా స్ఫూర్తి పొందుతున్నామంటూ ఆ క్యాంప్ నేతలు బహిరంగంగానే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాలి గాయం కారణంగా బెంగళూరు సమావేశానికి తొలుత హాజరు కాలేనని చెప్పిన ఆమె, సోనియా గాంధీ ఫోన్ చేయడంతో మనసు మార్చుకుని హాజరైన విషయం తెలిసిందే. సమావేశంలో సోనియా గాంధీ పక్కనే కూర్చున్న ఆమె, తరచుగా ఆమెతో సన్నిహితంగా మాట్లాడ్డం కూడా చూపరులను ఆకట్టుకుంది. కొద్ది నెలల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని మమత తీవ్రంగా విమర్శించారు. “రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతిసారీ బీజేపీ రేటింగ్ పెంచుతారు” అంటూ వ్యాఖ్యానించిన మమత ఇప్పుడు ఆ కుటుంబంతో అంత సన్నిహితంగా ఉన్నారంటేనే ఎంత మార్పు వచ్చిందో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష కూటమిలోని నేతలు ఎన్నికల వరకు ఇదే తరహా ఐక్యతను ప్రదర్శిస్తూ.. పట్టువిడుపు ధోరణితో ముందుకు సాగితే బీజేపీకి హాట్రిక్ ఆశలకు చెక్ పెట్టే అవకాశం లేకపోలేదు.
ఇంకా చెప్పాలంటే రాష్ట్రాల్లో రాజకీయ వైరం ఉన్నచోట రాజీ ఫార్ములా కోసం ఇప్పటి నుంచే ప్రతిపక్ష కూటమి కసరత్తు చేస్తోంది. కేరళ, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై లోపాయకారి ఒప్పందాలు జరుగుతున్నాయి. పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆప్ – కాంగ్రెస్ ఇప్పటికే అనధికారిక అవగాహనకు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో చెరి సగం సీట్లలో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్‌కు 10-12 సీట్లు, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)కి 3 లేదా 4 సీట్లు, చంద్రశేఖర్ ఆజాద్‌కి ఒక సీటు ఇస్తూ 60 – 65 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ పెద్దగా అభ్యంతరం చెప్పకుండా అంగీకరిస్తుందని కూడా కూటమిలో ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇలా మొత్తంగా కూటమిలో బలహీనతలుగా కనిపిస్తున్న సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను కూడా అన్వేషించడం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు అసలైన సవాలుగా మారుతోంది. పాట్నా (ఉత్తర భారతదేశం), బెంగళూరు (దక్షిణ భారతదేశం)లో సమావేశాలు నిర్వహించిన ఇండియా కూటమి తదుపరి ముంబై (పశ్చిమ భారతదేశం)లో భేటీ కానుంది. మరో రెండు సమావేశాలను తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో నిర్వహించి, చివరి సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తద్వారా దేశమంతటా కూటమిపై చర్చ జరిగాలని, బీజేపీకి సవాల్ విసరాలని కూటమి నేతలు భావిస్తున్నారు. మెరుగైన ఎన్నికల మేనిఫెస్టో, మెరుగైన ఎన్నికల నిర్వహణ కూడా తోడైతే ఇండియా కూటమిని ఢీకొట్టడం ఎన్డీఏకు చాలా కష్టంగా మారుతుంది. బీజేపీ దగ్గరున్న ఎన్నికల నిర్వహణ, ప్రచారం, నాయకత్వం, దార్శనికత వంటి బలాలు మాత్రమే కూటమిని ఎదుర్కోడానికి సరిపోవు.
ఈ కూటమిని అవినీతి, కుటుంబ రాజకీయ పార్టీల సమ్మేళనంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణిస్తున్నప్పటికీ.. దేశంలో ఈ రెండు అంశాలు పార్టీల గెలుపును ప్రభావితం చేయలేవు అని ఇప్పటికే నిరూపితమైంది. ఎంత కాదన్నా.. ప్రతిపక్షాల పాట్నా సమావేశం విజయవంతం కావడంతోనే ఇన్నేళ్లుగా తెర మరుగైన ఎన్డీఏను బీజేపీ మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ఎన్డీఏ ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూటమికి కొత్త నిర్వచనాన్ని ఇస్తూ N అంటే న్యూ ఇండియా, D అంటే డెవలప్‌మెంట్, A అంటే ఆకాంక్షలు (ప్రజల ఆకాంక్షలు) అని చెప్పుకొచ్చారు. ఇండియా కూటమి పేరు, నిర్వచనంతో పోల్చితే ఇదేమంత ఆకట్టుకునేలా లేదు. ఎన్సీపీ చీలిక వంటి కూటమి ఐక్యతను దెబ్బతీసే రాజకీయ వ్యూహాలతో పాటు పదేళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం కనిపిస్తోంది. సామాన్యుడి సమస్యను పరిష్కరించకుండా సాధించిన ఘనకార్యాల గురించి ఎంత చెప్పుకున్నా ఉపయోగం ఉండదు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, వలసలు, రైతులకు మరింత లాభదాయక పరిస్థితులు, పారిశ్రామిక పురోగతి వంటి ఇంకా ఎన్నో అంశాలపై బీజేపీ లోతుగా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. అయోధ్య రామ మందిరం, జాతీయ రహదారులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఉమ్మడి పౌర స్మృతి వంటి భావోద్వేగ అంశాలు ఆ పార్టీని పూర్తిగా ఆదుకోలేవని కూడా నాయకత్వం గ్రహించాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం