India – Russia Relations: భారత్-రష్యా మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్..! మిత్రభేదం ఎవరు సృష్టించారు?

India - Russia Relations: భారత్-రష్యా మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్..! మిత్రభేదం ఎవరు సృష్టించారు?
India - Russia Relations

India Russia Relations: గతంలో అగ్రరాజ్యం అమెరికాకు దూరంగా.. రష్యాకు దగ్గరగా ఉండేది భారత్. కాలం గడిచే కొద్దీ అది తగ్గుతోంది. అందుకు కారణం అమెరికా భారత్ కు దగ్గరవుతుండటమే.

Janardhan Veluru

|

Apr 15, 2021 | 2:03 PM

భారత్-రష్యాల మధ్య దౌత్య బంధం ఎక్కువే. సోవియట్ యూనియన్ గా ఉన్న రష్యా మనకు అత్యంత ఆత్మీయ దేశం. సమస్య ఏదైనా నేనున్నాను అంటూ ముందుకు వచ్చిన కామ్రేడ్ కంట్రీ. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో అగ్రరాజ్యం అమెరికాకు దూరంగా.. రష్యాకు దగ్గరగా ఉండేది భారత్. కాలం గడిచే కొద్దీ అది తగ్గుతోంది. అందుకు కారణం అమెరికా భారత్ కు దగ్గరవుతుండటమే. భారత్ – రష్యా సంబంధాలు ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా చెక్కు చెదరకుండానే కొనసాగాయి. అనేక పరీక్షలను తట్టుకొని నిలిచాయి. ఒకరిపై మరొకరికి ఉన్న విశ్వాసం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, సమానత్వ ప్రాతిపదికపై నిర్మించిన సిద్ధాంతాలే ఇందుకు కారణం. జాతీయ పురోభివృద్ధి కోసం భారత్ పరస్పర సహకారం కోరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా సంబంధాలను బలోపేతం చేసుకుంది. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లవ్‌రోవ్‌ రెండు రోజుల పాటు మన దేశంలో పర్యటించారు. మరోవైపు పాకిస్తాన్‌లోను రెండు రోజులు ఉన్నారు. ఆయన మాటలు చేతలు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

చిగురించిన బంధం 15వ శతాబ్దంలో రష్యా నుంచి బయలుదేరిన అఫనాసె నికిటిన్ భారత్‌లో అడుగు పెట్టారు. అప్పటి నుంచే రష్యా-భారత్ బంధానికి బీజంపడింది. ఆ తర్వాత 18వ శతాబ్దం నాటికి భారత వ్యాపారులు ఇండియా, రష్యా మధ్య వ్యాపార సంబంధాలను పెంపొందించుకున్నారు. 19వ శతాబ్దంలో భారత్‌కు చెందిన సంస్కృత భాష, వైదిక సాహిత్యం, అశోకుడి చట్టాలు, బౌద్ధ సాహిత్యం రష్యాలోకి ప్రవేశించి మరింతగా విస్తరించాయి. అంతే కాదు అనేక భారతీయ పుస్తకాలు రష్యా భాషల్లోకి అనువాదమయ్యాయి. రవీంద్రనాథ్ ఠాగూర్, లియో టాల్‌స్టాయ్ లాంటి ప్రముఖుల రచనలు ఇరు దేశాల్లోను సాహిత్యాభివృద్ధికి దోహదం చేశాయి. యోగా, భారతీయ సినిమాలు, డ్యాన్సులు, యుద్ధ నైపుణ్యం ఇరు దేశాలను బాగా దగ్గర చేశాయి. భారత్ లో పారిశ్రామికాభివృద్ధికి సోవియట్ యూనియన్ తన వంతు సహకారమందించింది. రష్యా సహకారంతోనే బొకారో, భిలాయ్ లాంటి కర్మాగారాలు వచ్చాయి. అంతే కాదు బాక్రా నంగల్ డ్యామ్‌ను నిర్మించడం వెనుక రష్యా సాయముంది. అంతరిక్ష పరిశోధనలు, శాస్త్ర, సాంకేతిక సహకారంలో ఇరు దేశాలు బాగానే అందిపుచ్చుకున్నాయి.

1947 ఏప్రిల్ 13న భారత్‌కు స్వాతంత్ర్యం రావడానికి ముందే.. ఇండియా, రష్యా మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ చిరస్మరణీయ మైలురాయికి బీజం పడి 74 వసంతాలు పూర్తయ్యాయి. 1947 నుంచి నేటి వరకు ప్రపంచంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రష్యాతో బంధం ఉన్నా మరోవైపు పెద్దన్న దేశం అమెరికాతో చెలిమి బాగుంది. సహజంగానే ఈ పరిణామాలు రష్యాను ఆందోళన కలిగించాయి. ‘ఇండో–పసిఫిక్‌ వ్యూహం’ పేరుతో ఏర్పడిన చతుర్భుజ కూటమి (క్వాడ్‌)లో భారత్, అమెరికాలు భాగస్వాములయ్యేలా ఈ మిత్రత్వం విస్తరించింది. ఇది రష్యాకు మింగుడుపడం లేదనేది నిజం. ఇప్పుడు ఆ దేశం మాటలూ, చేతలు అంత స్నేహంగా లేవు. ‘ఇండో–పసిఫిక్‌’ భావననే రష్యా వ్యతిరేకిస్తూ వస్తోంది. దాని స్థానంలో ‘ఆసియా–పసిఫిక్‌’గా వ్యవహరించాలని కోరుతోంది. ఆ కూటమిలో రష్యానే కాదు… చైనా సహా ఆయా ప్రాంతాల్లోనే అన్ని దేశాలు ఉండాలని కోరుకుంటోంది.

2000-2010లో మధ్య మరిన్ని ఒప్పందాలు జరిగాయి. బ్రహ్మోస్ ప్రాజెక్టు, కుడంకుళం అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం, రక్షణ వ్యవహారాలు, సాంకేతిక అంశాల విషయంలో భారత్, రష్యా ఇచ్చిపుచ్చుకున్నాయి. పరస్పర అభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు వేశాయి. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్, గ్రీన్ కారిడార్ అభివృద్ధిలో భారత్, రష్యా ప్రధాన పాత్ర పోషించాయి. బ్రిక్స్, ఐరాస, జీ-20 కూటముల్లోనూ ఇరు దేశాలు కలిసే ముందుకు సాగాయి. శక్తి రంగం, టెలీ కమ్యూనికేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో సంయుక్త భాగస్వామ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరముంది. ఇదే సమయంలో భారత్ కూడా అభివృద్ధిలో దూసుకెళుతోంది. రష్యా పెట్టుబడిదారులు భారత్ ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్‌అప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

అఫ్ఘానిస్తాన్‌ శాంతిప్రక్రియలో తాలిబన్‌లు పాలు పంచుకోవటం సరైందేనని రష్యా అంటోంది. కానీ భారత్ మద్దతునివ్వడం లేదు. అప్ఘాన్ లోని అన్ని వర్గాలతోపాటు, ఇరుగుపొరుగు దేశాల భాగస్వామ్యం అవసరమంటోంది భారత్. ఇలాంటి సమయంలో లవ్‌రోవ్‌ పర్యటన మొక్కుబడిగానే సాగింది. ప్రధాని నరేంద్ర మోదీని కలవకుండానే లవ్‌రోవ్‌ తన పర్యటన ముగించుకున్నారు. తమ దేశ విదేశాంగ మంత్రిని కనీసం మోదీ కలవక పోవడం పట్ల రష్యా గుర్రుగానే ఉంది. లవ్‌రోవ్‌ వచ్చినా ఆరోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలూ లేవు. తెల్లారి భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో లవ్ రోవ్ భేటీ అయ్యారు. ఇద్దరూ సంయుక్త మీడియా సమావేశంలోను పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత లవ్ రోవ్ నేరుగా పాకిస్తాన్‌ వెళ్లారు. భారత్ కు వచ్చాక పాకిస్తాన్‌ కు వెళ్లడాన్ని తప్పు పడుతోంది భారత విదేశాంగ శాఖ. మొదటినుంచీ భారత్‌ ఈ విషయంలో రష్యాను తప్పుపడుతోంది.

అప్పుడే రష్యాతో తకరారు… 2012 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్ కు వచ్చారు. ముందుగా పాకిస్తాన్‌ పర్యటన ఏర్పాట్లు చేసుకుని భారత్ కు వచ్చారనే వార్తలొచ్చాయి. భారత్ మీడియా ఇదే విషయమై కథనాలిచ్చాయి. అంతే రష్యా ఆలోచనల్లో మార్పు వచ్చింది. అప్పటికప్పుడు మీ దేశం రావటం కుదరదంటూ పాకిస్తాన్‌కు వర్తమానం పంపారు పుతిన్. కేవలం భారత్‌కు మాత్రమే వచ్చారు. ఆ తర్వాత వచ్చినప్పుడు అదే జరిగింది. కానీ ఈసారి మాత్రం లవ్‌రోవ్‌ తాను ఏం చేయదల్చుకున్నారో అదే చేశారు. ఫలితంగా రష్యా విదేశాంగ మంత్రి చేసిన పని ఇప్పుడు హాట్ టాపికైంది. పోయినేడు రెండు దేశాల మధ్య జరగాల్సిన శిఖరాగ్ర సదస్సు రద్దయింది. కరోనానే ఇందుకు కారణమైనా ఇప్పుడు ఇరు దేశాలు చెబుతున్న మాటలను మిగతా వాళ్లు పెద్దగా నమ్మడం లేదు. రెండు దేశాల మధ్య బంధం బలహీనపడుతుందనే వాదన సాగుతోంది.

క్షిపణిలు కొనుగోలు పై రగడ భారత్-రష్యా మధ్య దౌత్య సంబంధాలు గతం కంటే బలహీనపడ్డాయనేది వాస్తవం. 2016నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా జోక్యం చేసుకుందని ఆరోపణలు వచ్చాయి. క్రిమియాను ఆక్రమించిన విషయంలోను భారత్ రష్యా తీరును తప్పుపట్టింది. ఫలితంగా రెండు దేశాల సంబంధాలూ బాగా దెబ్బతిన్నాయి. ప్రపంచంలో ఎవరూ రష్యాకు సన్నిహితం కావద్దనే వైఖరిని అనుసరించింది అమెరికా. తన నాయకత్వంలోని నాటోలో భాగస్వామిగా వున్న టర్కీ పెద్దన్న మాటను బేఖాతరు చేసింది. రష్యా నుంచి అత్యంతాధునిక ఎస్‌–400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసింది. అది అమెరికాకు కోపం తెప్పించింది. వెంటనే టర్కీ పై అమెరికా ఆంక్షలు విధించింది. భారత్ పైన కూడ ఎస్‌–400 క్షిపణి విషయంలోను ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా భారత్ ఆలోచనలో పడింది. అయినా వెనక్కు తగ్గలేదు. 2018 అక్టోబర్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఆ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇప్పటికీ అమెరికా మనల్ని హెచ్చరిస్తూనే ఉంది.

మరోవైపు భారత్‌ తమ మిగ్‌ యుద్ధ విమానాలను కాదని రఫేల్‌ను ఎంచుకోవటం రష్యాకు మింగుడుపడలేదు. మిగ్ కంటే రఫేల్ విమానాలు బాగా పని చేస్తున్నాయని నిపుణులు చెప్పిన మాటతోనే అటు మొగ్గు చూపామంటున్నారు భారత పాలకులు. కానీ అసలు సంగతి వేరే ఉంది. అమెరికాను దగ్గరకు తీసుకోవడమే. అంత మాత్రాన భారత్‌–రష్యా సంబంధాలు పూర్తిగా అడుగంటలేదు. రష్యా రక్షణ సామగ్రిని భారత్‌లోనే ఉత్పత్తి చేసేందుకు చర్చలు జరిపారు ఆదేశ విదేేశాంగ మంత్రి. ఈ ఏడాది ఆఖరులో జరగాల్సిన ఇరు దేశాల అధినేతల శిఖరాగ్ర సమావేశం గురించి చర్చ జరిగింది. తమ దేశం నుంచి కొనుగోలు చేయాల్సిన రక్షణ సామగ్రిపైనా ఇరు దేశాల రక్షణమంత్రులూ ఒక అవగాహనకు వస్తారని లవ్‌రోవ్‌ చెప్పడం వెనుక మతలుబు ఇదేనంటున్నారు.

చైనాతో రష్యా చెలిమి… భారత్ – చైనాల మధ్య దూరం బాగా పెరుగుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచడంతో పాటు భారత భూభాగాలను ఆక్రమించడం వంటి దుందుడుకు చర్యలకు దిగుతోంది చైనా. కొన్ని సార్లు ధీటుగానే చైనా తీరును తిప్పికొట్టింది ఇండియా. అది చైనాకు రుచించడం లేదు. చైనాతో రష్యా అంటకాగటం, పాకిస్తాన్‌కు క్రమేపీ సన్నిహితం కావటం భారత్ కు నచ్చటం లేదు. అదే సమయంలో పాక్‌ పర్యటనలో లవ్‌రోవ్‌ ఆ దేశానికి రక్షణ సామగ్రి విక్రయించటానికి ఒప్పందం చేసుకున్నారు. ఇరుదేశాలు కలిసి సముద్ర, పర్వత ప్రాంత సైనిక విన్యాసాలు జరపటానికి ఒప్పుకోవడం భారత్ కు నచ్చడం లేదు.

2001లో నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్‌ రష్యా పర్యటించాక మరింతగా ఆ రెండు దేశాల మధ్య బంధం బలోపేతం అయంది. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా గణనీయ పాత్ర నిర్వహించారనేది వాస్తవం. 2016లో పుతిన్‌ భారత్ కు వచ్చినప్పుడు ఇరుదేశాలు మరిన్ని ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రపంచ మార్పులకు అనుగుణంగా ఇరు దేశాలు సహకారం అందించుకోవాల్సిన అంశాలపై స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. సంస్కృతీ సంప్రదాయాల్లో అనేక సారూప్యతలున్న రష్యా-భారత్​ల మధ్య ఇప్పుడు దూరం పెరుగుతోంది. ఆ దేశం పాకిస్థాన్​తో జట్టుకట్టడం భారత్​ను ఆందోళన కలిగించే అంశమే. అఫ్గానిస్థాన్‌ శాంతి చర్చల్లో భారత్‌ పాత్ర లేకుండా రష్యా దారులు మూసివేసిందనే వాదన లేకపోలేదు.

రెండు కూటములు అంతర్జాతీయ రాజకీయ యవనికపై రెండు ప్రధాన శిబిరాలున్నాయి. ఒక శిబిరాన్ని చైనా, రష్యాలు నడిపిస్తున్నాయి. మరొకటి అమెరికా ఆధ్వర్యంలో నడుస్తోంది. ఏ శిబిరంవైపూ పూర్తిస్థాయిలో మొగ్గు చూపకుండా భారత్ సమదూరం పాటిస్తోంది. అదే ఇబ్బంది తెచ్చిపెడుతోంది. సంస్కృతీ సంప్రదాయాల్లో ఇండియాతో అనేక సారూప్యతలున్న రష్యా దేశం పాకిస్థాన్‌ కు దగ్గర కావడం ఆశ్చర్యమే. పాక్, రష్యా సైనిక బలగాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేశాయి. మరోవైపు పాక్‌లో ఎల్‌ఎన్‌జీ పైప్‌లైన్‌ను రష్యా నిర్మిస్తోంది. పాక్‌తో కలిసి నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలపై భారత్ ఆందోళన చెందాల్సిన పనిలేదని రష్యా దౌత్యవేత్త రోమన్ బాబాష్కిన్ అన్న మాట. పాకిస్తాన్‌తో స్వతంత్ర ద్వైపాక్షిక విధానాలు, వాణిజ్య బంధాల బలోపేతానికి మేం కట్టుబడి ఉన్నామని రష్యా చెబుతోంది. పాక్ కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో భాగమే. ఒక దేశంతో బలోపేతం చేసుకునే ద్వైపాక్షిక బంధాలను మరో దేశానికి వ్యతిరేక విధానాలుగా భావించకూడదని రష్యా అంటోంది.

ఇది ఇరుదేశాల దౌత్య సంబంధాలను దెబ్బతీస్తోంది. అఫ్గాన్‌లో శాంతిస్థాపనపై మార్చి 18న మాస్కో వేదికగా చర్చలు జరిపింది. రష్యా, చైనా, అమెరికా, పాకిస్థాన్‌ ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో ఈ చర్చలు జరిగాయి. అంతర్గత శాంతిపరిరక్షణపై చర్చించేందుకు ఒక సాధారణ సమావేశం నిర్వహిస్తామని రష్యా ముందే చెప్పింది. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వ ప్రతినిధులు, అఫ్గాన్‌ అత్యున్నత జాతీయ సయోధ్య మండలి, ప్రముఖ రాజకీయవేత్తలు, ఖతార్‌ ప్రతినిధులు, తాలిబన్‌ ఉద్యమకారులతోను రష్యా మాట్లాడింది. భారత్‌ పేరు ప్రస్తావించకపోవడం హాట్ టాపికైంది. భారత్ వ్యూహాత్మక తటస్థత విధానంతో ఉండటం రష్యాకు సుతారం ఇష్టం లేదు.

భారత్‌-అమెరికాల మధ్య సంబంధాలు భేషుగ్గా ఉండటమే ఇందుకు ప్రధమ కారణం. భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ల చతుర్భుజి (క్వాడ్‌)- హిందూ మహా సముద్రం, పసిఫిక్‌ ప్రాంతాల్లో అమెరికా ఇతర పశ్చిమ దేశాల ప్రయోజనాలను కాపాడుతోంది. చైనా ప్రభావానికి, దుందుడుకుతనానికి అడ్డుకట్ట వేస్తోంది. అమెరికాలోని బైడెన్‌ నాయకత్వంపై రష్యాకు అంత ప్రేమ లేదు. ప్రతిఫలంగా చైనాకు దగ్గరైంది రష్యా. ప్రస్తుతం రష్యా, చైనాల సంబంధాలు బాగున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో తలెత్తిన ఘర్షణలు భారత్‌, చైనాల ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీశాయి. సరిహద్దుల్లో ఇరు పక్షాల మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. అఫ్గాన్‌ శాంతి చర్చల జాబితాలో భారత్‌కు చోటు కల్పిస్తే చైనా నుంచి వ్యతిరేకత వస్తుందని అంచనా వేసింది రష్యా. అందుకే దూరం పెట్టిందనేది వాస్తవం.

అఫ్గాన్‌ శాంతి చర్చల్లోనూ, ఒప్పందాల అనంతరం చోటుచేసుకోబోయే అభివృద్ధి కార్యకలాపాల్లోనూ తనమాటే చెల్లుబాటు కావాలని రష్యా అనుకుంటోంది. అందుకే ఇండియాను దూరం పెట్టింది. భారత్‌కు చర్చల్లో చోటు కల్పిస్తే తర్వాత జరిగే అభివృద్ధి పరిణామాల్లోనూ పరోక్షంగా అమెరికాను భాగస్వామిగా చేసినట్లే అవుతుందని భావించింది. పశ్చిమ ఆసియాలో రష్యా అమెరికాల ప్రయోజనాలు పరస్పరం వ్యతిరేక వైఖరితో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్న సమయంలోను పశ్చిమాసియా విషయంలో ఆ దేశానికి మద్దతుగానే ఉంది భారత్. అది ఇరాన్‌తో భారత్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలను కొంత మేర దెబ్బతీశాయి. అఫ్గానిస్థాన్‌ను తమ గుప్పిట్లో పెట్టుకునే ఆలోచన చేస్తోంది రష్యా. అందుకే భారత్ కు చోటు కల్పించడం లేదనే వాదన వస్తోంది.

రష్యా ఏమంటుందంటే.. భారత్, రష్యాల మధ్య సంబంధాలు చాలా విస్తృతమైనవి. వీటిని వ్యూహాత్మక భాగస్వామ్య బంధాలుగా చెప్పుకోవచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక ఈ బంధం మరింత వ్యూహాత్మకంగా మారింది. ఇరుదేశాల మధ్య ప్రత్యేకమైన సంబంధాలున్నాయి. ఇవి చాలా వ్యూహాత్మకమైనవి. ఆర్థిక బంధాలు, ఆవిష్కరణలు, సైనిక పరమైన సాంకేతికత ఇలా అన్నింటిలోనూ ఇవి కనిపిస్తాయి ….రష్యా విదేశాంగ మంత్రి లవ్ రోవ్

”రష్యా అత్యధిక ప్రాధాన్యమిచ్చే నాలుగు మిత్రదేశాల్లో భారత్ ఒకటి. ఈ రెండు దేశాల మధ్య రాజకీయపరమైన సహకారముంది. ఐరాస, బ్రిక్స్ ఇలా ఎక్కడ చూసినా ఇది కనిపిస్తుంది. ఈ రెండు దేశాలు కలిసి అంతర్జాతీయ వేదికలపై చాలా కృషి చేశాయి. షాంఘై కో-ఆపరేషన్ కార్పొరేషన్‌లోనూ కలిసి పనిచేస్తున్నాం. సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మంత్రుల స్థాయితో మొదలుపెట్టి.. దేశాధిపతి, ప్రధాన మంత్రి స్థాయిల్లోనూ రెండు దేశాలు విస్తృత చర్చలు జరుపుతున్నాయి ….రష్యా విదేశాంగ మంత్రి లవ్ రోవ్

అమెరికా ఇండో పసిఫిక్ వ్యూహంపై నా స్నేహితుడు, భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‌తో చర్చించాను. అమెరికా ఇండో పసిఫిక్ వ్యూహం సరైంది కాదు. ఫలితంగా ఈ ప్రాంతంలో ఘర్షణలు మరింత పెరుగుతాయి. ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయి. భారత్‌తో తమ సంబంధాలను పశ్చిమ దేశాలు దిగజార్చాలని చూస్తున్నాయని రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించడం కొసమెరుపు.

ఇరుదేశాల మధ్య గతకాలంనాటి బంధం మళ్లీ రావాలంటే ఇచ్చి పుచ్చుకుని ధోరణి మరింతగా ఉండాలి. అదే సమయంలో భారత్ కు వ్యతిరేకంగా ఉన్న చైనా, పాక్ దేశాలతో చెలిమి విషయంలో రష్యా పునారాలోచించాలని కోరుకుంటుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu