One Nation-One Election: దేశంలో ఒకేసారి ఎన్నికలు.. ‘జమిలి’కి 5 ప్రతిబంధకాలు.. లాభమెంటీ.. నష్టమెంత..?

| Edited By: Shaik Madar Saheb

Sep 01, 2023 | 3:54 PM

One Nation-One Election: దేశంలో ఒకేసారి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు మొదలైంది. ఇప్పటికే పార్లమెంటరీ స్థాయీ సంఘం, లా కమిషన్ ఈ అంశంపై అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. రాజ్యంగపరంగా, న్యాయపరంగా ఉన్న చిక్కులు, ప్రతిబంధకాలను ఆ నివేదికల్లో పొందుపరుస్తూ.. వాటిని అధిగమించడానికి ఏం చేయాలో కూడా సిఫార్సు చేశాయి.

One Nation-One Election: దేశంలో ఒకేసారి ఎన్నికలు.. ‘జమిలి’కి 5 ప్రతిబంధకాలు.. లాభమెంటీ.. నష్టమెంత..?
One Nation, One Election
Follow us on

One Nation-One Election: దేశంలో ఒకేసారి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు మొదలైంది. ఇప్పటికే పార్లమెంటరీ స్థాయీ సంఘం, లా కమిషన్ ఈ అంశంపై అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. రాజ్యంగపరంగా, న్యాయపరంగా ఉన్న చిక్కులు, ప్రతిబంధకాలను ఆ నివేదికల్లో పొందుపరుస్తూ.. వాటిని అధిగమించడానికి ఏం చేయాలో కూడా సిఫార్సు చేశాయి. వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం చేయనుంది. అలాగే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లులను తయారు చేయనున్నట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఒకేసారి ఎన్నికల నిర్వహణలో ఉన్న చిక్కులేంటి? లా కమిషన్ పేర్కొన్న అంశాలేంటి?

జమిలికి 5 ప్రతిబంధకాలు

లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను జమిలి ఎన్నికలుగా వ్యవహరిస్తున్నాం. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో ఏకంగా 5 కీలక అధికరణాలను సవరించడంతో పాటు ఇంకా చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని లా కమిషన్ విస్తృత అధ్యయనం అనంతరం తేల్చి చెప్పింది. ఈ అంశంపై రాజ్యసభలో ఎంపీ కిరోడీలాల్ మీనా 2023 జులై 27న అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ సమాధానమిస్తూ.. ఆ ఐదు ప్రతిబంధకాల గురించి వివరించారు. జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, ఆ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం సహా ఎన్నికల నిర్వహణతో ముడిపడ్డ అనేక ఇతర విభాగాలతో కలిసి సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. ఆయనిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో లా కమిషన్ సిఫార్సుల ప్రకారం జమిలి ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులు ఇవే…

  1. రాజ్యాంగంలోని 5 కీలకమైన అధికరణాలను సవరించాల్సి ఉంటుంది. పార్లమెంట్ పదవీకాలాన్ని నిర్వచించే ఆర్టికల్ 83, పార్లమెంటును రద్దు చేసే అధికారాన్ని రాష్ట్రపతికి కల్పించిన ఆర్టికల్ 85, రాష్ట్రాల అసెంబ్లీ పదవీకాలాన్ని నిర్వచించే ఆర్టికల్ 172, రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు చేసే అధికారాన్ని కల్గిన ఆర్టికల్ 174తో పాటు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్ 356లో కీలక సవరణలు చేపట్టాలి.
  2. రాజ్యాంగ సవరణల నుంచి మొదలుపెట్టి ఎన్నికల నిర్వహణలో అనేకాంశాల వరకు దేశంలోని వివిధ రాజకీయ పార్టీల సమ్మతి కూడా అవసరమే. వివిధ రాజకీయ పార్టీలను సంప్రదించి ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. సమాఖ్య స్ఫూర్తితో నిర్మితమైన ప్రజాస్వామ్య దేశంలో జమిలి ఎన్నికలకు రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోవడంతోపాటు ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుంది.
  5. ఒకేసారి లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల నిర్వహణకు తగినన్ని ‘ఈవీఎం – వీవీప్యాట్’ యంత్రాలను కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
  6. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు తగినంత అదనపు ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బందిని కూడా సమకూర్చుకోవాలి.

జమిలి ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దక్షిణాఫ్రికా సహా మరికొన్ని దేశాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి కొన్ని సిఫార్సులు చేసిందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ వెల్లడించారు. అయితే ఈ ఐదు ప్రతిబంధకాలను అధిగమించినప్పటికీ వెంటనే జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. తొలి ప్రయత్నంలో 2023 చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలతోపాటు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుపుకునే మహారాష్ట్ర, లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చు. ఇంకా వీలుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసి జమిలికి సిద్ధం కావొచ్చు. కానీ కొద్ది నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరుపుకుని కొత్త ప్రభుత్వాలు కొలువైన కర్ణాటక వంటి రాష్ట్రాలు మరోసారి ఎన్నికలు ఎదుర్కొనేందుకు ససేమిరా ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. అలాంటి రాష్ట్రాలని తొలి దశలో మినహాయించి.. వాటి పదవీకాలం పూర్తైన తర్వాత వెంటనే ఎన్నికలు జరపకుండా.. 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు కలుపుకుపోయే అవకాశం ఉంటుందని రాజ్యాంగ నిపుణులు సూచిస్తున్నారు. అంటే జమిలి ఎన్నికలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నా సరే.. మొదటి ప్రయత్నంలో ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల పదవీకాలం పూర్తయ్యాక రాష్ట్రపతి పాలన విధించాల్సిన అనివార్యత ఏర్పడుతుంది.

ఎందుకు జమిలి ఎన్నికలు?

ఎన్నికల నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అన్న విషయం అందరికీ తెలిసిందే. లోక్‌సభకు ఒకసారి, దేశంలోని ఒక్కో రాష్ట్రానికి ఒక్కోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పదే పదే జరిగే ఎన్నికలతో నిర్వహణ ఖర్చు తడిసి మోపెడవుతోంది. అంటే అంత మొత్తంలో ప్రజాధనం వృధా అవుతోంది. మరోవైపు దీంతో ఏదో ఒక సమయంలో దేశంలో ఏదో ఒక చోట ఎన్నికల కోడ్ కూడా అమలవుతూనే ఉంది. ఆ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి. పదే పదే ఎన్నికలు అనేసరికి ప్రజల్లోనూ ఆసక్తి తగ్గిపోతోంది. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. ఇక రాజకీయ పార్టీలకు సైతం ఎన్నికలు అంటే విపరీతమైన ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. లెక్కల్లో చూపే ఖర్చు ఒకెత్తయితే.. లెక్కల్లో చూపకుండా ఓటర్లను ప్రభావితం చేయడం కోసం చేసే ఖర్చు వేల కోట్లలోనే ఉంటుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చుపై ఓ సంస్థ అధ్యయనం ప్రకారం.. ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ఖర్చు, వివిధ రాజకీయ పార్టీలు పెట్టిన ఖర్చు మొత్తం రూ. 60,000 కోట్లు పైనే అని తేల్చింది. ఆ తర్వాత జరిగిన ప్రతి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఖర్చు అదనమే. ఒకవేళ 2019లో లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి, అటు అన్ని రాజకీయ పార్టీలకు కలిపి అటూ ఇటుగా అంతే ఖర్చయ్యేది. అలాగే పాలనా వ్యవస్థకు ఎన్నికల కోడ్ పదే పదే అడ్డుతగిలే పరిస్థితి ఉండదు. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని, ఎన్నికల నిర్వహణ కోసం పెట్టే ఖర్చు పెద్ద మొత్తంలో ఆదా అవుతుందని, తద్వారా ప్రజాధనాన్ని ఆదా చేయడంతో పాటు పదే పదే ఎన్నికల నియమావళి అమలు చేయడం కారణంగా తలెత్తే పాలనాపరమైన ఇబ్బందులను కూడా పరిమితం చేయవచ్చని కేంద్ర ప్రభుత్వంతో పాటు జమిలి ఎన్నికల ఆలోచనను సమర్థించేవారు చెబుతున్నారు.

జమిలి కసరత్తు జరిగిందిలా..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి 1967 వరకు జరిగిన ఎన్నికల వరకు లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. 1968, 1969లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడంతో ఈ వరుస క్రమానికి బ్రేక్ పడింది. అలాగే 1970లో లోక్‌సభ కూడా రద్దవడంతో మొత్తం తారుమారైంది. అయితే 1983లో నాటి కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ జమిలి ఎన్నికల నిర్వహణకు ప్రతిపాదించింది. అయితే నాటి ప్రభుత్వం ఈ ఆలోచనను స్వాగతించలేదని ఎలక్షన్ కమిషన్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. 1999లో లా కమిషన్ జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తెచ్చింది. కానీ దానిపై పెద్దగా చర్చ కూడా జరగలేదు. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రస్తావన చాలా సార్లు తీసుకొచ్చింది. 2019లో జమిలి ఎన్నికలపై అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించగా.. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ సహా అనేక ప్రతిపక్షాలు సమావేశానికి దూరంగా ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, తెలుగుదేశం, నాటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు తమ ప్రతినిధులను పంపించాయి. 2022లో నాటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఓ సందర్భంలో మాట్లాడుతూ తాము ఒకేసారి లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదే ఏడాది లా కమిషన్ జమిలి ఎన్నికలపై ప్రజాభిప్రాయాన్ని కోరింది. లా కమిషన్‌తో అధ్యయనం అనంతరం నివేదికను కేంద్రానికి సమర్పించింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని కూడా జమిలిపై కసరత్తు చేయమని కోరింది. ఆ రెండు నివేదికల ఆధారంగా ఇప్పుడు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.

ఎవరు.. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

జమిలి ఎన్నికల ప్రతిపాదనను కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. జమిలి ఎన్నికల ద్వారా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూస్తోందని విపక్షాలు చెబుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), రాష్ట్రీయ జనతా దళ్, జనతాదళ్ (యునైటెడ్), సమాజ్‌వాదీ పార్టీ సహా విపక్ష కూటమిలోని పలు ఇతర పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఓటమి తర్వాత బీజేపీ భయపడుతోందని, అందుకే జమిలి ఎన్నికల ప్రతిపాదన తీసుకొస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ అన్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. “దేశం ఇప్పటికే ఒకటిగా ఉంది. వన్ నేషన్ అనాల్సిన అవసరం ఏముంది?. మేము డిమాండ్ చేసేది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు. పారదర్శక ఎన్నికలు” అన్నారు. అంతేకాదు.. ఇండియా కూటిమి నుంచి దృష్టి మళ్లించడం కోసమే ఈ ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చిందని అన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యులు రామ్‌గోపాల్ యాదవ్ స్పందిస్తూ.. “ఈ అంశంపై ఇదివరకే ఒకసారి చర్చ జరిగింది. విస్తృతస్థాయిలో దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. కేవలం బీజేపీ నిర్ణయం తీసుకుని, స్పెషల్ సెషన్‌లో బిల్లు తీసుకొస్తాం అంటే.. అది రబ్బర్ స్టాంప్ నిర్ణయమే అవుతుంది. ఇది చాలా తప్పు” అని వ్యాఖ్యానించారు. ఇలా ఆదిలోనే హంసపాదు అన్న చందంగా విపక్ష కూటమిలో చాలా పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణను ఆచరణలో ఎలా సాధ్యం చేస్తుందన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడ్డ కమిటీ అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయం సాధించగలరా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..