ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకూ రక్షణ లేదా ? వరసగా నమోదైన కేసులు
ఎటుపోతోందీ దేశం. ఇన్నాళ్లూ ఆడపిల్లలకే రక్షణలేదని భావించాం, ఇప్పుడు మగపిల్లలకు కూడా రక్షణ కరువైంది. చిన్న పిల్లలను చూస్తే కొందరు చిత్తకార్తె కుక్కల్లా ఎగబడతున్నారు. ఒకేరోజు మూడు ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.సంచలనం సృష్టించిన బాలలపై లైంగిక వేధింపుల ఆరోపణల్లో RSS లాంటి సంస్థ కూడా ఉండడం అందర్నీ విస్మయ పరుస్తోంది.

కేరళ, అనంతు అజీ అనే టెకీ ప్రాణాలు తీసుకున్నాడు…కారణం లైంగిక వేధింపులు. ఖమ్మం జిల్లాలో ఓ బాలుడు స్కూల్‌కు వెళ్లాలంటేనే భయంతో వణికిపోయాడు…కారణం లైంగిక వేధింపులు.. హైదరాబాద్ జువైనల్‌హోమ్‌లో ఐదుగురు బాలురు… తమను రక్షించాలని తల్లిదండ్రులతోనే వేడుకున్నారు…కారణం లైంగిక వేధింపులు
వణికిపోతున్నారు, రాలిపోతున్నారు. తమపై జరిగిన లైంగికదాడిని తలచుకుని తలుచుకుని కుంగిపోతున్నారు. మానసిక ఒత్తిడితో, పెద్దలకు చెప్పుకోలేక, తమలో తామే నలిగిపోతున్నారు కొందరు పిల్లలు. సైదాబాద్ అబ్జర్వేషన్ హోంలో మైనర్ బాలుడిపై స్టాఫ్ గార్డ్ రహమాన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. హోంలో మరో ఐదుగురిపై కూడా లైంగిక దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. బాధిత బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం స్టాఫ్ గార్డ్ రెహమాన్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. దసరా పండుగకు ఇంటికి వెళ్లిన బాధిత బాలుడు, జువైనల్ హోమ్‌కు వెళ్లనంటూ మారాం చేశాడు. దీంతో తల్లి గట్టిగా అడగడంతో బాలుడు జరిగిన విషయం చెప్పడంతో రహమాన్ అఘాయిత్యం బయటపడింది.
ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో జరిగింది. అమ్మపాలెం గ్రామంలోని మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్‌లోని ఓ టీచర్ పిల్లలను లైంగికంగా వేధించేవాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన బాలుడు, స్కూల్ కు వెళ్లనంటూ కన్నీరు పెట్టుకున్నాడు. కారణం తెలుసుకుని బాలుడి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. జువాలజీ టీచర్ ప్రభాకర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతోబాధిత బాలుడి పేరంట్స్ కొణిజర్లలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీచర్ ప్రభాకర్‌పై పోక్సో కేసు నమోదుచేశారు. ఉన్నతాధికారులకు ప్రభాకర్ ఆకృత్యాలపై ఫిర్యాదు అందడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. విషయం అందరికీ తెలియడంతో ప్రభాకర్ పరుగులమందు తాగి ఆతహత్యాయత్నం చేశాడు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు.
కేరళలో లైంగిక వేధింపులు తాళలేక టెకీ స్టూడెంట్ అనంతు అజీ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. అయితే అనంతు అజీ చనిపోతూ, ఓ జాతియవాద సంస్థపై సంచలన ఆరోపణలు చేశాడు. తనను ఆ సంస్థలోని కొందరు సభ్యులు లైంగికంగా వేధించారని, ఇది తనను మానసికంగా చాలా దెబ్బతీసిందంటూ అనంతు అజీ చనిపోయేముందు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అజీ సోషల్ మీడియా పోస్టు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంమైంది.
ఇలా దేశంలో పలు చోట్ల మగపిల్లలపైనా లైంగిక వేధింపులు జరగడం ఆందోళనపరుస్తోంది. కొందరు పైకి చెప్పుకోలేక, మానసిక ఆవేదనతో తమలో తామే నలిగిపోతుంటే, మరికొందరు ఆ ట్రామా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. పిల్లలను వేధించే కామాంధులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని కోరుతున్నారు.




