President Election 2022: ‘ఆత్మ ప్రభోదానుసారం’ అనే పదం ఒకప్పుడు దేశ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పింది..? తాజాగా KCR అదే మాట అనడం వెనుక రీజన్..?

కేసీఆర్‌ నోటి వెంట ఆత్మప్రభోదానుసారం అన్న పదం విన్న వెంటనే పాలిటిక్స్‌పై పట్టున్న వారికి 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలు అసంకల్పితంగానే గుర్తుకొస్తాయి.. అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ నోటి వెంట ఆత్మప్రభోదానుసారం అన్న పదం వచ్చింది. దాని వెనుక కథ ఏంటో తెలుసుకుందాం పదండి

President Election 2022: 'ఆత్మ ప్రభోదానుసారం' అనే పదం ఒకప్పుడు దేశ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పింది..? తాజాగా KCR అదే మాట అనడం వెనుక రీజన్..?
Cm Kcr
Balu

| Edited By: Ram Naramaneni

Jul 03, 2022 | 3:33 PM

2022 Indian presidential election: రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM Kcr) కోరారు. ఓటు వేసేటప్పుడు రాష్ట్రపతి అభ్యర్థులను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ నోటి వెంట ఆత్మప్రభోదానుసారం అన్న పదం విన్న వెంటనే పాలిటిక్స్‌పై పట్టున్న వారికి 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలు అసంకల్పితంగానే గుర్తుకొస్తాయి.. అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ(Indira Gandhi) నోటి వెంట ఆత్మప్రభోదానుసారం అన్న పదం వచ్చింది. అప్పుడది ఫలించింది కూడా! అసలు ఇందిరాగాంధీ ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలి!

1967 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే తగిలింది. ఇందిరాగాంధీ నేతృత్వంలోని ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు 283 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఏడు రాష్ట్రాలలో దారుణంగా దెబ్బతిందా పార్టీ! నెహ్రూ అనుసరించిన సోషలిజాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఓటమి ఎదురయ్యిందన్న భావనకు వచ్చింది. జనాదరణను తిరిగి సంపాదించుకోవడం కోసం బ్యాంకుల జాతీయకరణ, జనరల్‌ ఇన్సూరెన్స్‌ జాతీయకరణ వంటి పది అంశాలతో ఓ కార్యక్రమాన్ని ప్రకటించింది. కాకపోతే ఇందిరా అంటే పడని సిండికేట్‌ నాయకులు అది అమలు కాకుండా చూశారు. సిండికేట్ నాయకులందరికి రైటిస్టు భావాలుండేవి. ఏ మాత్రం మొహమాటం లేకుండా రైటిస్టు విధానాలకు జై కొడుతుండేవారు. ఇది ఇందిరాగాంధీకి రుచించేది కాదు. వారికి పోటీగా ఆమె లెఫ్ట్‌ వైపుకు మళ్లారు. యంగ టర్కులతో వారిపై దాడి చేయించారు. ఆ టైమ్‌లో మొరార్జీ దేశాయ్‌పై ఎలాంటి అభియోగాలు లేవు కానీ ఆయన కుమారుడు కాంతి దేశాయ్‌ మీద మాత్రం బోలెడన్ని ఆరోపణలు ఉండేవి. ఆయనకు పారిశ్రామికవేత్తలతో వ్యాపార సంబంధాలు ఉండేవి. ఇవన్నీ మొరార్జీకి తెలియవని కావు. కాకపోతే కొడుకు మీద ప్రేమతో చూసీ చూడనట్టు ఉండేవారు. పైగా నా కొడుకు ఆణిముత్యమంటూ చెప్పుకునేవారు. 1969లో కాంతి దేశాయ్‌ని ఇరుకున పెట్టే కొన్ని డ్యాకుమెంట్లను ఇందిరాగాంధీ తెప్పించుకున్నారు. వాటిని యంగ్‌టర్క్‌లకు అందించారు. ఆ డ్యాకుమెంట్లతో వారు మొరార్జీని ఇబ్బంది పెట్టేవారు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారు, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరిన వారు సైతం మొరార్జీపై విమర్శలు గుప్పించేవారు. మంత్రులు దినేశ్‌సింగ్‌, రఘునాథరెడ్డిలు అందించిన సమాచారం ఆధారంగా లోక్‌సభలో విపక్షాలు మొరార్జీపై సెన్సూర్‌ మోషన్ పెట్టాయి. అది వీగిపోయినప్పటికీ మొరార్జీ ప్రతిష్ట దెబ్బతిన్నది. కమ్యూనిస్టులు ఇందిరావైపు నిలిస్తే, రాజగోపాలాచారి స్వతంత్ర పార్టీ సిండికేట్‌ పక్షాన నిలిచింది. జనసంఘ్‌ కూడా ఇన్‌డైరెక్ట్‌గా సిండికేట్‌ను బలపరిచేది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అనుకోకుండా రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. 1969, మే 3న రాష్ట్రపతి జాకీర్‌ హుస్సేన్‌ చనిపోయారు. ఉప రాష్ట్రపతిగా ఉన్న వి.వి.గిరి తాత్కాలిక రాష్ట్రపతి అయ్యారు.

Vv Giri

Vv Giri

ఎన్నికల్లో రాష్ట్రపతి అభ్యర్థిగా జగ్జీవన్‌రామ్‌ను నిలబెట్టాలన్నది ఇందిరాగాంధీ ఆలోచన. మహాత్మాగాంధీ శతజయంతిని జరుపుకుంటున్న సంవత్సరంలో దళితుడిని రాష్ట్రపతి చేస్తున్నామంటే ప్రతిపక్షాలు కూడా అభ్యంతర చెప్పవన్నది ఆమె భావన! కానీ కామరాజు కాదన్నారు. ఇతర సిండికేటు నాయకులు కూడా సంజీవరెడ్డిని నిలబెడదామన్నారు. అప్పటికీ లోక్‌సభ స్పీకర్‌గా సంజీవరెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు కాబట్టి ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇస్తాయని వాదించారు. దీన్ని తేల్చాల్సింది కాంగ్రెస్‌ పార్లమెంటరీ బోర్డు. ఈ బోర్డులో ఉన్న 8 మంది సభ్యులలో సిండికేటుకు నాలుగు ఓట్లున్నాయి. ఇందిరాగాంధీ దగ్గర మూడే ఉన్నాయి. సిండికేటువైపు మొగ్గు చూపుతున్న యశ్వంత్‌రావు బల్వంత్‌రావు చవాన్‌ మనసు మార్చుకుని ఇందిరకు వైపుకు వచ్చినా నాలుగు-నాలుగుతో సమానం అవుతుందే తప్ప ఇందిరాగాంధీ మాట నెగ్గే ఛాన్స్‌ లేదు. 1969 జులై 11 నుంచి 13 వరకు బెంగళూరు లాల్‌బాగ్‌లో ఏఐసీసీ సమావేశం జరిగింది. అందులో కాంగ్రెస్‌ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా సంజీవరెడ్డి పేరును ప్రకటించారు. ఇందిరాగాంధీ ఆమోదించారు కూడా! దాంతో పాటు కొన్ని సూచనలు చేశారు. అయిదారు బ్యాంకులను జాతీయం చేయాలని, గ్రామీణ ప్రాంతాలలో సర్వీస్‌ కో ఆపరేటివ్స్‌ తెరవాలని, భూమిలేని పేదల స్థితి బాగు చేయాలని .. ఇలాంటి సూచనలు ఇందిరాగాంధీ చేశారు.

ఒకవేళ తాను బ్యాంకులను జాతీయం చేయాలని సంకల్పించిన మొరార్జీ అడ్డుపడతారని భావించారు ఇందిర. అందుకే ముందు ఆయనను తొలగించాలనుకున్నారు. భారత ప్రజలకు ఆశయాలకు, ఆకాంక్షలకు మీరు నమ్మిన సిద్ధాంతాలు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు ఆర్ధికమంత్రిగా కొనసాగడం భావ్యంగా లేదని సుతిమెత్తగా చెప్పారు. చెప్పడంతో పాటు ఉప ప్రధానమంత్రి పదవి మాత్రం అలాగే ఉంచేసి ఆర్ధికశాఖను ఆయన నుంచి తను తీసుకున్నారు. ఇది అవమానంగా భావించిన ఆయన రాజీనామా చేశారు. ఆమె కోరుకున్నది కూడా అదే! జులై 21న ఆర్డినెన్స్‌ల ద్వారా 14 బ్యాంకులను జాతీయం చేశారు. రాజభరణాలను రద్దు చేశారు. కేబినెట్‌కు సూచన ప్రాయంగా ఈ విషయం చెప్పారే కానీ ప్లానింగ్‌ కమిషన్‌కు అది కూడా చెప్పలేదు. ఈ రెండు చర్యలు ఆమెకు ఎనలేని ఖ్యాతిని తెచ్చాయి. ఆమె పేదల పక్షపాతిగా పేరు పొందారు. ఇందిరాగాంధీ పలుకుబడి పెరిగే సరికి కొందరు ఎంపీలు ఆమెకు అనుకూలంగా మారారు. వెంటనే వి.వి.గిరిని స్వతంత్ర అభ్యర్థిగా నిలబడమన్నారు. వి.వి.గిరి తెలుగువారే అయినప్పటికీ ఒరిస్సాలో పుట్టి పెరిగారు. నెహ్రూ మంత్రివర్గంలో ఉన్నారు.మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశారు. ఆయనంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. ఆయన నామినేషన్‌ వేయగానే డీఎంకే, ముస్లింలీగ్‌, అకాలీదళ్‌ మద్దతు ప్రకటించాయి. స్వతంత్రపార్టీ, జన్‌సంఘ్‌ పార్టీలు సీ.డీ.దేశ్‌ముఖ్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టాయి. ఈ దేశ్‌ముఖ్‌ ఎవరంటే ఆంధ్రమహిళా సభను స్థాపించిన దుర్గాబాయ్‌ భర్త. ఇదిలా ఉంటే వి.వి.గిరిని తాను నిలబెట్టానని ఇందిరాగాంధీ ఎక్కడా చెప్పలేదు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తిగా ఆమె సంజీవరెడ్డికే సపోర్ట్‌ ఇస్తున్నట్టు అనుకోవాలి. అయితే వి.వి.గిరి నామినేషన్‌ వేయగానే ఇందిర అనుచరుల్లో కొందరు గిరి దగ్గరకు వెళ్లి మద్దతు ప్రకటించారు. యంగ్‌ టర్క్‌ అర్జున్‌ అరోడాతో పాటు మరికొందరు బాహాటంగానే గిరికి మద్దతు పలికారు. ఇదంతా తెరవెనుక నుంచి ఇందిరాగాంధీ చేయిస్తున్నారని సిండికేటు అభిప్రాయపడింది. సంజీవరెడ్డి నామినేషన్‌పై సంతకం అయితే పెట్టారు కానీ సంజీవరెడ్డికి ఓటు వేయమని తాను ఎవరికీ విజ్ఞప్తి చేయనని చెప్పేశారు. ఇదే సమయంలో సంజీవరెడ్డికి మద్దతు సమకూర్చడం కోసం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నిజలింగప్ప జన్‌సంఘ్‌, స్వతంత్ర పార్టీల సభ్యులను ప్రత్యక్షంగా కలుసుకుని సపోర్ట్‌ కోరారు. దీన్ని ఇందిరాగాంధీ అవకాశంగా తీసుకున్నారు. మన ప్రభుత్వపు సోషలిస్టు విధానాలను వ్యతిరేకిస్తున్న పార్టీల దగ్గరకు, అదీ మతతత్వ పార్టీల దగ్గరకు పార్టీ అధ్యక్షుడు వెళ్లడం పెద్ద తప్పని, ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళతాయని జగజీవన్‌రామ్‌, ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌లతో ఓ లేఖ రాయించారు ఇందిర. నిజానికి విపక్షాల మద్దతు కూడగట్టడం కోసం వారిని ప్రత్యక్షంగా కలుస్తానని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో నిజలింగప్ప చెప్పారు . ఆ సమావేశంలో ఉన్న ఇందిర అప్పుడేమీ అనలేదు. ఇందిర ఎత్తుగడలకు సిండికేటు జడిసింది. సంజీవరెడ్డికి కాంగ్రెస్ సభ్యులే ఓటేసే పరిస్థితి లేదనే అనుమానం వారికి వచ్చేసింది. సంజీవరెడ్డికి ఓటు వేయనివారిపై చర్య తీసుకుంటామని హెచ్చరించింది. దీనికి కౌంటర్‌గా ఇందిర అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటేయమంటూ సభ్యులకు పిలుపు ఇచ్చారు. అప్పట్నుంచే అంతరాత్మ ప్రబోధం అన్న పదం పాపులరయ్యింది.

Indira Gandhi

Indira Gandhi

కేవలం 14,450 ఓట్ల తేడాతో వి.వి.గిరి చేతిలో సంజీవరెడ్డి ఓడిపోయారు. దేశ్‌ముఖ్‌కు మొదటి ప్రాధాన్యత ఓటేసిన విపక్ష ఎంపీలలో కొందరు రెండో ప్రాధాన్యత ఓటును వివి గిరికి వేశారు. మరో కారణమేమిటంటే అప్పటి వరకు సిండికేటుతో ఉన్న యశ్వంత్‌రావు బల్వంత్‌రావు చవాన్‌ సడన్‌గా ఇందిర వైపుకు వచ్చేయడం. మొత్తం మీద రాష్ట్రపతి ఎన్నిక ఫలితంతో సిండికేటు బిత్తరపోయింది. తర్వాతి కాలంలో కాంగ్రెస్‌పార్టీ చీలిపోవడానికి ఇది కారణమయ్యింది..

Neelam Sanjeeva Reddy

Neelam Sanjeeva Reddy

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu