Vaccination: అందుకే వ్యాక్సిన్ కొరత..సంచలన వ్యాఖ్యలు చేసిన సీరమ్ ఇనిస్టిట్యూట్
Vaccination: కరోనాకు టీకా తిరుగులేని ఆయుధం అని ఇప్పటికే చాలా దేశాల్లో తేలింది. అయితే, కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు అందరికీ అందుబాటులో లేదు. దీంతో కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో వివాదం రాజుకుంటోంది.
Vaccination: కరోనాకు టీకా తిరుగులేని ఆయుధం అని ఇప్పటికే చాలా దేశాల్లో తేలింది. అయితే, కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు అందరికీ అందుబాటులో లేదు. దీంతో కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో వివాదం రాజుకుంటోంది. దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడిన నేపధ్యంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తప్పు మీదంటే, మీదనే వాదనలు నడుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపధ్యంలో వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత పెరిగింది. కానీ రెండే రెండు కంపెనీల వ్యాక్సిన్లు దేశంలో అందుబాటులో ఉండటం, ఉత్పత్తి సామర్ధ్యం డిమాండ్ కంటే చాలా రెట్లు తక్కువుండటంతో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. ఈ నేపధ్యంలో రాష్ట్రాలకు కావల్సినంత వ్యాక్సిన్ సరఫరా కావడం లేదు.
కేంద్ర ప్రభుత్వం ముందు చూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి అని చాలా రాష్ట్రాలు కేంద్రంపై నిందలు వేస్తున్నాయి. ఇప్పుడు వీరికి జతగా సీరమ్ ఇనిస్టిట్యూట్ చేరింది. కోవీషీల్డ్ టీకా అందిస్తోన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ప్రజలకు వ్యాక్సిన్ అందించే విషయంలో ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరించడం వల్లనే వ్యాక్సిన్ల కొరత ఏర్పడిందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ ఆరోపించారు. హీల్ హెల్త్ సంస్థ నిర్వహించిన ఓ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ముందుగా..3 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించిందని..దాంతో అందుకు తగ్గట్టే ప్రభుత్వానికి 6 కోట్ల డోసుల వ్యాక్సిన్ సరఫరా చేశామన్నారు. తరువాత వ్యాక్సిన్ కంపెనీను సంప్రదించకుండానే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించిందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఈడీ సురేశ్ జాదవ్ తెలిపారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి పరిమితమే అని తెలిసి కూడా 45 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల..ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్‌కు, వ్యాక్సిన్ తీసుకున్నవారికి మధ్య పొంతన లేకుండా పోయిందని వివరించారు. ఫలితంగా వ్యాక్సిన్ కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న వ్యాక్సిన్ల కొరత గుణపాఠం లాంటిదన్నారు సురేశ్ జాదవ్. ఉత్పత్తి సామర్ధ్యం, నిల్వల ఆధారంగా వ్యాక్సినేషన్ చేయడమనేది సరైన పద్ధతన్నారు. దీనికోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని నియమాలు రూపొందించిందన్నారు. ఈ నియమాల్ని పాటించాలని సూచించారు.