Covid-19 Vaccine: అందుబాటులో మూడు కరోనా వ్యాక్సిన్లు.. వాటి సామర్థ్యం, దుష్ప్రభావాల గురించి తెలుసా..?

Covishield vs Sputnik V vs Covaxin:  దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ల కొరత

Covid-19 Vaccine: అందుబాటులో మూడు కరోనా వ్యాక్సిన్లు.. వాటి సామర్థ్యం, దుష్ప్రభావాల గురించి తెలుసా..?
Covishield Vs Sputnik V Vs Covaxin
Follow us

|

Updated on: May 22, 2021 | 4:51 AM

Covishield vs Sputnik V vs Covaxin:  దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ల కొరత కూడా వేధిస్తోంది. కొన్ని రోజుల నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ.. వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దేశంలో రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని తొలి డోసును హైదరాబాద్‌లో వేశారు. ఇప్పుడు మన దగ్గర మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. నిన్నటివరకూ కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ మాత్రమే ఉండగా.. ఇప్పుడు స్పూత్నిక్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే.. ఈ మూడు వ్యాక్సిన్లల్లో ఏదీ సమర్థవంతమైనది.. మానవ శరీరంపై ఏ వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావం చూపుతుంది.. వీటిని తీసుకోవడం మంచిదేనా.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.. ఏదీ ఉత్తమం అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ఇప్పుడు అలాంటి వివరాలు తెలుసుకుందాం..

కోవాక్సిన్.. భారత ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ దీనిని తయారు చేసింది. దేశంలో తయారైన రెండు వ్యాక్సిన్లలో కోవాక్సిన్ ఒకటి. కరోనావైరస్‌పై ఈ వ్యాక్సిన్ 81శాతం వరకు ప్రభావం చూపుతుందని సర్వేల్లో వెల్లడైంది. ఇనాక్టివ్ వేరియస్ రకానికి చెందిన ఈ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న 4 నుంచి 8 వారాల్లో రెండో వ్యాక్సిన్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600లకు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1200లకు ఒక్కొక్క డోసును అమ్ముతున్నారు. ఎఫెక్ట్స్.. ఈ కోవాక్సిన్ తీసుకున్న వారిలో ఇంజెక్షన్ చేసిన ప్రాంతంలో దద్దుర్లు, ఎర్రగా మారడం, వాపు, నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. దీనికితోడు కొందరిలో జ్వరం, బాగా చెమటలు పోయడం, వణుకు, తల నొప్పి, ఒళ్లు నొప్పులు, కళ్లు తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపించినట్లు సర్వేలో వెల్లడైంది.

కోవిషీల్డ్.. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కలిసి తయారుచేసిన కోవిషీల్డ్ టీకాను.. భారత్‌లోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్ంోది. ఇది కూడా స్పుత్నిక్ వ్యాక్సిన్‌లాగా.. వైరల్ వెక్టార్ రకానికి చెందిన రెండు డోసుల వ్యాక్సిన్. తొలి డోస్ తీసుకున్న 12 వారాల తర్వాత రెండో వ్యాక్సిన్ తీసుకోవాలి. దీన్ని 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతతలో నిల్వ ఉంచొచ్చు. ఇది కరోనాపై 70.4శాతం వరకు ప్రభావం చూపుతుంది. అయితే మొదటి డోసుకు రెండో డోసుకు మధ్య వ్యవధి పెంచితే… 90శాతం వరకు ప్రభావం చూపుతుందని సర్వేలో వెల్లడైంది. దీనిని కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600లకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం 62 పైగా దేశాల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ను ఉపయోగిస్తున్నారు. ఎఫెక్ట్స్.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇంజెక్షన్ చేసిన ప్రాంతంలో కొద్దిగా ఎరుపు, తీవ్ర జ్వరం, నీరసం, చేతులు పట్టేయడం, ఒళ్లు నొప్పులు వంటి సైడ్ ఎఫెక్టులు ఎక్కువగా కనిపించాయి. కొన్ని తీవ్రమైన కేసుల్లో రక్తం గడ్డకట్టినట్లు తెలింది. అయితే.. ఇలాంటి కేసులు చాలా అరుదుగా వెలుగులోకి వచ్చాయి.

స్పుత్నిక్ వీ.. రష్యాలో తయారు చేసిన ఈ వ్యాక్సిన్ కరోనావైరస్‌పై 91.6శాతం ప్రభావం చూపుతోందని క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. రెండు డోసుల ఈ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న 21 రోజుల నుంచి 3 నెలలలోపు రెండో డోసు తీసుకోవాలి. వైరల్ వెక్టార్ రకానికి చెందిన ఈ వ్యాక్సిన్‌ను ద్రవరూపంలో ఉంటే -18.55 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో, డ్రైగా ఉంటే 2 నుంచి 8 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. దీని ధరను భారత ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా దీని ఒక్కో డోసును సుమారు 10 డాలర్లకు అమ్ముతున్నారు. అయితే అపోలో ఆసుపత్రిలో అన్ని చార్జీలతో కలిపి దీని ధర 1250గా ఉంది. వేయి రూపాయలు ఉంటుందని సమచారం. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

స్పుత్నిక్ వల్ల ఎలాంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్టులూ ఇప్పటి వరకూ బయటపడలేదని పేర్కొంటున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారి శరీరంలో యాంటీబాడీలు చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అయితే ఈ ఇంజెక్షన్ చేయించుుకన్న ప్రాంతంలో దద్దుర్లు, నొప్పి, జ్వరం వంటి సాధారణ లక్షణాలే కనిపించాయని సర్వేలో వెల్లడైంది. కొన్ని చోట్ల హైపర్ టెన్షన్, హేమరేజి స్ట్రోక్, ఫ్లూ వంటి లక్షణాలు కనిపించాయి.

Coronavirus

Coronavirus

అయితే.. అన్ని వ్యాక్సిన్లు కూడా మంచివే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏది అందుబాటులో ఉంటే… అది తీసుకోవడం ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు. ఏది తీసుకున్నా కానీ జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిందేనని సూచిస్తున్నారు. తొందరగా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల యాంటీబాడీల వృద్ధి వేగంగా జరుగుతుందని పేర్కొంటున్నారు.

Also Read:

Vaccination: వ్యాక్సిన్ మొదటి డోసు తరువాత కూడా పాజిటివ్ వస్తుందా? వస్తే రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారు?