కోతులపైకి గొడ్డలి విసిరిన తండ్రి.. మెడ తెగి రెండేళ్ల కుమారుడు మృతి!
ఓ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న రెండేళ్ల పిల్లాడి వద్దకు కోతుల గుంపు వచ్చింది. తమనించిన తండ్రి.. వాటి వల్ల కుమారుడికి హాని కలుగుతుందని భావించి, వాటిని తరిమేందుకు కోతులపైకి పక్కనే ఉన్న గొడ్డలిని విసిరాడు. అయితే అనుకోకుండా ఆ గొడ్డలి రెండేళ్ల కుమారుడికి తగిలి బాలుడి మెడ తెగిపోయింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మంగళవానం (జూన్ 3) ఉదయం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

లక్నో, జూన్ 4: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ ఇంటి ఆవరణలో రెండేళ్ల ఆరవ్ ఆడుకుంటున్నాడు. కోతుల గుంపు ఆ ఇంటి ఆవరణలోకి వచ్చింది. బాలుడి తండ్రి లఖన్ సింగ్ చూసి.. కొడుకుపై దాడి చేస్తాయేమోనని భావించాడు. దీంతో భయపడిన బాలుడి లఖన్ వాటిని తరిమేందుకు వెంటనే ఇంటిపై భాగంలోకి వెళ్లి కోతులను తరిమేందుకు గొడ్డలి విసిరాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ గొడ్డలి బాలుడు ఆరవ్‌కు తగిలింది. గొడ్డలి విసురుగా తగలడంతో బాలుడి మెడ తెగింది. తీవ్ర గాయాలు కావడంతో బాలుడి మెడ నుంచి రక్తం ఇంటి గోడలపై చిమ్మింది. బాలుడి కేకలు విన్న కుటుంబ సభ్యులు పరుగు పరుగున వచ్చి.. బాలుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే అదే రోజు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బాలుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు.
లఖన్ సింగ్ బావమరిది జితేంద్ర సింగ్ ఇది ప్రమాదం కాదని, హత్య అని ఆరోపించారు. లఖన్ తన భార్య అనితతో నిత్యం గొడవ పడేవాడని, సోమవారం రాత్రి కూడా అనితను గదిలో బంధించి లఖాన్ కొట్టినట్లు తెలిపాడు. వారి వాదన సద్దుమణిగింది. కానీ మంగళవారం ఉదయం అది మళ్ళీ రాజుకుంది. భార్యాభర్తలు గొడవ పడుతుండగా, ఆరవ్ తన తాత రామచంద్ర ఒడిలో ఉన్నాడు. ఆ గొడవలో లఖాన్ ఆరవ్‌ను లాక్కొని, గొడ్డలితో చంపాడని పోలీసులకు తెలిపాడు. భార్యను భయపెట్టడానికి గొడ్డలిని పైకెత్తి బాలుడి మెడ వైపు తిప్పి ఉంటాడని, అయితే అది అనుకోకుండా బాలుడి మెడలో దిగి ఉంటుందని ఆరోపించాడు. లఖన్ గతంలో కూడా ఇలాగే కొడుకును చంపుతానని బెదిరించినట్లు బావమరిది జితేంద్ర సింగ్ తెలిపాడు.
ఇక లఖన్ బంధువు మరొకరు వేరే స్టోరీ చెప్పడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. జిల్లా పంచాయతీ సభ్యుడు జగత్ సింగ్ సైని మాట్లాడుతూ.. లఖన్ ఇంట్లో ఇటీవల టెంట్ వేశారని, ఇందుకోసం ఇంటి పైకప్పుపై ఇనుప రాడ్లను ఉంచారని తెలిపాడు. మంగళవారం ఉదయం వచ్చిన కోతుల గుంపు వాటిని పడవేయడంతో, అవి పిల్లవాడి తలకు తగిలి మృతి చెందినట్లు చెప్పాడు. మూడు వెర్షన్లు విన్న పోలీసులు ప్రాథమికంగా ప్రమాదవశాత్తు జరిగిన కేసుగా భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




