Indian Railways: ప్రధాని మోడీ కల అదే.. దేశంలోని ప్రతి మూలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు.
2023-24 కేంద్ర బడ్జెట్‌లో నరేంద్ర మోడీ ప్రభుత్వం.. ఇండియన్ రైల్వేకు భారీగా కేటాయింపులు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.2.41 లక్షల కోట్లను కేటాయించింది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. బుధవారం 2023-24 సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ 1గంటా 26నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా వేతన జీవులకు ఊరటనివ్వడంతోపాటు.. పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా 2023-24 కేంద్ర బడ్జెట్‌లో నరేంద్ర మోడీ ప్రభుత్వం.. ఇండియన్ రైల్వేకు భారీగా కేటాయింపులు చేసింది. భారతీయ రైల్వేను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు రైల్వేశాఖకు 9 రెట్లు అధికంగా నిధులను కేటాయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.2.41 లక్షల కోట్లను కేటాయించింది. 2013-14 సంవత్సరంతో పోలిస్తే ఈ రైల్వే బడ్జెట్ దాదాపు 9 రెట్లు ఎక్కువ.. బడ్జెట్లో అతిపెద్ద కేటాయింపు కూడా ఇదే కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, కేంద్రం ఇప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పలు ప్రాంతాల మధ్య ప్రారంభించింది. ఇవే కాకుండా మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇంకా ట్రాక్‌లను కూడా అత్యాధునికంగా మార్చాలని చూస్తోంది. అంతేకాకుండా అత్యాధునిక సౌకర్యాలు, హైడ్రోజన్ రైళ్లు, 220కిమీ వేగంతో దూసుకెళ్లేలా ట్రాక్‌ల నిర్మాణం, స్టేషన్ల ఆధునికీకరణ లాంటివి చేపట్టేందుకే రైల్వే రంగానికి అత్యధిక కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వేకు చేసిన కేటాయింపులపై స్పందించారు. ఈ బడ్జెట్‌ను రైల్వే ఎలా ఉపయోగించుకోనుంది, తదితర విషయాల గురించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రైల్వే అభివృద్ధి.. ప్రజా రవాణా మెరుగుపర్చేందుకే ఈ కేటాయింపులు జరిగినట్లు తెలిపారు. 1,275 స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేస్తున్నామని, వందే భారత్ రైళ్ల ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
రైల్వేలకు రూ .2.41 లక్షల కోట్లు కేటాయించారని.. ఇది కీలక మార్పు.. ప్రయాణీకుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని తెలిపారు. ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద, 1,275 స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేస్తున్నామన్నారు. వందేభారత్ రైళ్లను మరిన్ని ప్రారంభిస్తామని తెలిపారు. వందేభారత్ రైళ్లు ఇప్పుడు హర్యానాలోని సోనిపట్, మహారాష్ట్రలోని లాతూర్‌లో కూడా తయారవుతాయని ఆయన తెలిపారు.
“ఇప్పుడు ఐసిఎఫ్ చెన్నైతో పాటు, హర్యానాలోని సోనిపట్, మహారాష్ట్రలోని లాతూర్‌లలో వందే భారత్ రైళ్లు తయారవుతాయి. ప్రతి మూలను వందేభారత్ రైళ్లతో అనుసంధానించాలనే ప్రధాని మోడీ కలను ఇది నెరవేరుస్తుంది” అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో హైడ్రోజన్‌తో నడిచే ప్యాసింజర్ రైళ్లు అందుబాటులోకి వస్తాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
“డిసెంబర్ 2023 నాటికి హైడ్రోజన్ రైలు వస్తుంది.. భారతదేశంలో తయారు అవుతుంది. మొదట, ఇది కల్కా-సిమ్లా వంటి హెరిటేజ్ సర్క్యూట్‌లలో నడుస్తుంది. తరువాత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాం.. ”అని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..