AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొమ్మలు అమ్మేవారిని పట్టుకునేందుకు 1500 కిలో మీటర్ల ఛేజ్! పోలీస్ ఆపరేషన్‌లో షాకింగ్ నిజాలు

బొమ్మల వ్యాపారుల వేషంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాజస్థాన్ పోలీసులు, ఎన్‌సీబీ సంయుక్తంగా పట్టుకున్నారు. 1,500 కి.మీ మేర వెంబడించి రూ.75 లక్షల విలువైన 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు. మహిళలు, పిల్లలతో కలిసి ప్రయాణిస్తూ అక్రమ రవాణా చేసినట్లు వెల్లడైంది.

బొమ్మలు అమ్మేవారిని పట్టుకునేందుకు 1500 కిలో మీటర్ల ఛేజ్! పోలీస్ ఆపరేషన్‌లో షాకింగ్ నిజాలు
Toy Traders' Cover Busted
SN Pasha
|

Updated on: Jul 03, 2026 | 7:12 PM

Share

పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్ముకుంటూ కొంతమంది తిరుగుతుంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి.. కొన్ని రోజుల పాటు తిరిగి బొమ్మలు అమ్మేసి వచ్చిన డబ్బుతో తమ ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబంతో సంతోషంగా ఉంటారని అనుకుంటున్నారా? అయితే కొంతమంది అలా కాకుండా అక్రమ దందాకు తెరలేపుతున్నారు. బొమ్మల వ్యాపారం పేరుతో భారీ స్థాయిలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాజస్థాన్ మాదకద్రవ్యాల నిరోధక టాస్క్ ఫోర్స్ (ANTF), మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (NCB) సంయుక్తంగా ఛేదించాయి. దాదాపు 1,500 కిలోమీటర్ల పాటు నిందితులను వెంబడించిన అధికారులు, చివరకు బారన్ జిల్లాలోని జాతీయ రహదారి-27పై ఉన్న ముండియార్ టోల్ ప్లాజా వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.75 లక్షల విలువైన 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో బారన్ జిల్లాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో కాలు లాల్ మోగియా (48), రేణు (25), నరేష్ (32), లోకేష్ (23) ఉన్నారు. వీరు మహిళలు, పిల్లలతో కలిసి బొమ్మల వ్యాపారుల్లా ప్రయాణిస్తూ, అనుమానం రాకుండా మాదకద్రవ్యాలను తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ANTF ఇన్‌స్పెక్టర్ జనరల్ వికాస్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌లోని NCB చీఫ్ అభిషేక్ నారాయణ్ సింగ్‌తో సమన్వయం చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించారు. కోటా నుంచి జైపూర్, భరత్‌పూర్ ప్రాంతాలకు భారీ మొత్తంలో గంజాయి సరఫరా అవుతోందన్న నిఘా సమాచారంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా అధికారులు ఒడిశాకు చేరుకోగా, నిందితులు అప్పటికే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న బృందం, స్మగ్లర్లు ఝాన్సీకి వెళ్లే రైలులో ప్రయాణిస్తున్నట్లు గుర్తించి అదే రైలులో వారిని రహస్యంగా అనుసరించింది. ఝాన్సీలో దిగిన అనంతరం నిందితులు ఒక పికప్ వాహనాన్ని అద్దెకు తీసుకుని రాజస్థాన్‌లోని బారన్ వైపు బయలుదేరారు.

ఈ సమాచారంతో ముండియార్ టోల్ ప్లాజా వద్ద అధికారులు దిగ్బంధం ఏర్పాటు చేసి వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో 50 ప్యాకెట్లలో దాచిన సుమారు 150 కిలోల గంజాయి బయటపడింది. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల మార్కెట్ విలువ దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో నిందితులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బొమ్మలు అమ్ముతూ సంపాదించిన డబ్బుతో కిలో గంజాయిని సుమారు రూ.2,000కు కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. అనంతరం రాజస్థాన్‌కు తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా విభజించి అధిక ధరలకు విక్రయించేవారని వెల్లడైంది. ఒకవేళ తనిఖీల్లో పట్టుబడితే తాము బొమ్మల వ్యాపారులమని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసేవారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని, ఇలాంటి నెట్‌వర్క్‌లపై మరింత కఠినంగా నిఘా కొనసాగిస్తామని ANTF, NCB అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us