కరోనా వేళ దేశం రెండు యుద్ధాలు చేయాల్సి వస్తోంది. ఓ వైపు దేశంలో కరోనాపై పోరు సాగుతుంటే.. మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి నిత్యం బార్డర్‌లో పాక్ సైన్యంతో పాటుగా.. ఉగ్రవాదులతో మన సైన్యం యుద్ధం చేస్తోంది. ఆదివారం జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొలుత భారత సైన్యం ఐదుగురు జవాన్లను కోల్పోయింది. ముష్కరుల దాడిలో ఓ కల్నల్‌తో పాటుగా మరో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ క్రమంలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు హంద్వారా ప్రాంతంలో సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు.. ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా టాప్ కమాండర్ హైదర్ హతమయ్యాడు. ఈ విషయాన్ని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ స్పష్టం చేశారు.
కాగా.. గత ఏప్రిల్ మాసంలో భద్రతా బలగాలు.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని మొత్తం 28కి పైగా మట్టుబెట్టింది. నిత్యం పాక్ కూడా కాల్పుల విరమణకు ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. ఉగ్రవాదులను ఎగదోస్తోంది.