Viral Video: వీకెండ్‌కు రిసార్ట్‌కెళ్లిన ముగ్గురు యువతులు..! స్విమ్మింగ్‌పూల్‌లో గంతులెస్తూ చివరకు.. భయానక వీడియో
ముగ్గురు స్నేహితులు సరదాగా ఆదివారం పూట రిసార్ట్ కెళ్లారు. అక్కడ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టేందుకు దిగారు. కాసేపు గంతులు వేస్తూ నీళ్లలో ఆడుకున్నారు కూడా.. కానీ అంతలోనే మృత్యువు కబళించింది..
మంగళూరు, నవంబర్ 19: సెలవులు సరదాగా గడిపేందుకు రిసార్ట్‌కు వెళ్లిన ముగ్గురు యువతులు స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ఒకేసారి మృత్యువాత పడ్డారు. మృతులను నిషిత MD (21), పార్వతి S (20), మరియు కీర్తన N (21) గా గుర్తించారు. ఈ విషాద ఘటన మైసూసులోని మంగళూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
మైసూరుకు చెందిన ముగ్గురు యువతులు ఆదివారం ఉదయం ఉల్లాల్ బీచ్ సమీపంలోని ‘వాజ్కో’ బీచ్ రిసార్ట్‌కు విహారయాత్రకు వెళ్లారు. వీరు ముగ్గురు ఈత కొట్టేందుకు రిసార్ట్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో దిగారు. అందరూ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులే. అయితే వీరికి స్విమ్మింగ్ రాకపోయినప్పటికీ కాసేపు లోపలికి దిగి గంతులు వేస్తూ సరదాగా గడిపారు. అయితే స్విమ్మింగ్‌పూల్ 6 అడుగులకు మించిలోతు ఉంది. ఈ విషయం తెలియక ముగ్గురు యువతులు స్విమ్మింగ్ పూల్‌లో మరికొంత లోతుకు వెళ్లారు. తొలుత నిషిత అనే యువతి లోతుకు వెళ్లడంతో ఆమెను కాపాడేందుకు పార్వతి ముందుకు వెళ్లింది. అయితే ఆమె కూడా నీళ్లలో మునిగిపోతుండటంతో కీర్తన వారిని రక్షించేందుకు యత్నించింది. చివరకు ముగ్గురూ నీట మునిగి నిమిషాల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎవరికీ ఈత రాకపోవడమే ఈ దారుణానికి దారి తీసింది.
స్విమ్మింగ్ పూల్ ఆరు అడుగుల కంటే లోతుగా ఉండడం, భద్రతా లోపాల వల్ల మునిగిపోయినట్లు అనుమానాలున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న ఉళ్లాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువతులు నీట మునిగిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. నీటిలో మునిగిపోతూ.. కాపాడాలంటూ యువతులు చేసిన ఆర్తనాదాలు సీసీటీవీలో చూడొచ్చు. అయితే స్విమ్మింగ్‌పూల్ సమీపంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఘటనాస్థలిని సందర్శించిన మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు నిర్ధారించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రిసార్ట్‌లో భద్రతా లోపాలను ఎత్తి చూపారు. స్విమ్మింగ్ పూల్‌లు ఉన్న రిసార్ట్స్‌లో తప్పనిసరిగా లైఫ్-సేవింగ్ ఎక్విప్‌మెంట్, లైఫ్‌గార్డ్‌లు, పూల్ లోతు వివరాలను తెలిపే సూచికలు వంటి భద్రతా చర్యలు ఉండాలి. ఇవి లొకేషన్‌లో లేవని అగర్వాల్ చెప్పారు. ఆ సమయంలో ఏడుగురు ఉద్యోగులు విధుల్లో ఉన్నా.. ప్రమాద సమయంలో సిబ్బంది ఉన్నప్పటికీ పట్టించుకోలేదా? కాపాడటంతో విఫలమయ్యారా? అనేది తెలియాల్సి ఉందని అన్నారు.
The #Mangaluru Police have arrested the Owner (Manohar) and manager (Bharath) of the Vasco resort of Ullal in Mangaluru for negligence of their duty.Yesterday 3 girls drowned in the #swimmingpool of the resort. Police have registered FIR u/s 106 of BNS… pic.twitter.com/eB1ZlWhc7u
— Yasir Mushtaq (@path2shah) November 18, 2024
అనంతరం నిర్లక్ష్యంగా నడుపుతున్నందున రిసార్ట్‌కు సీల్ వేశారు. రిసార్ట్ ట్రేడ్ లైసెన్స్, టూరిజం సంబంధిత అనుమతులను తాత్కాలికంగా నిలిపివేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఉల్లాల్ పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.