87 లక్షలతో ఇల్లు కొన్నారు, 20 అడుగుల సొరంగం తవ్వారు, వెండి నగలకోసం, ఆ దొంగల స్టయిలే వేరు !
రాజస్థాన్ లోని జైపూర్ లో ఘరానా దొంగలు ఎవరూ వేయని పకడ్బందీ ప్లాన్ వేశారు. సినీ స్టయిల్లో కోట్ల విలువ చేసే వెండి నగలు దోచుకున్నారు. ఇందుకోసం వారు ఎంచుకున్న..
రాజస్థాన్ లోని జైపూర్ లో ఘరానా దొంగలు ఎవరూ వేయని పకడ్బందీ ప్లాన్ వేశారు. సినీ స్టయిల్లో కోట్ల విలువ చేసే వెండి నగలు దోచుకున్నారు. ఇందుకోసం వారు ఎంచుకున్న మార్గం ఆశ్చర్యం కలిగించక మానదు. వివరాల్లోకి వెళ్తే.. సునీత్ సోనీ అనే డాక్టర్ ఇంటి పక్కనే వీరు గత జనవరిలో 87 లక్షలతో ఓ ఇంటిని కొన్నారు. మెల్లగా ఆ డాక్టర్ ఇంటికి..ముఖ్యంగా బేస్ మెంట్ కి దారి తీసేట్టుగా 20 అడుగుల పొడవునా ఓ సొరంగం తవ్వారు. 15 అడుగుల లోతున ఈ టనెల్ ద్వారా బేస్ మెంట్ కింద దాచిన వెండి నగల పెట్టె వద్దకు చేరుకునేలా అన్ని ప్రయత్నాలూ చేసి..చివరకి ఈ పెట్టెలోని సిల్వర్ నగలనన్నిటినీ దోచుకున్నారు. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ ని నడిపే డాక్టర్ సోనికి ఎందుకో అనుమానం వచ్చి ..బేస్ మెంట్ వద్దకు పోయి చూస్తే సొరంగం కనిపించింది. తన కళ్ళను తానె నమ్మలేక ఆయన వెండి నగల బాక్స్ కోసం చూస్తే బాక్స్ ఖాళీగా కనిపించిందట.
ఆ వెంటనే ఆయన పోలీసులకు ఈ ఘరానా చోరీ గురించి సమాచారం అందజేశాడు. పోలీసులు కూడా వఛ్చి ఈ చోరీ జరిగిన ప్రాంతం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు బేస్ మెంట్ లో నగల పెట్టె ఉండడమేమిటి ? ఎక్కడా లేనట్టు అక్కడ ఈయన దాన్ని దాచడమేమిటి ? అని ఎన్నో అనుమానాలు కలిగాయి వారికి.. చివరకు దర్యాప్తు చేస్తే సోనీకి దగ్గరి స్నేహితుడే ఈ దొంగతనానికి సూత్రధారి అని తెలిసింది. అతడిని అరెస్టు చేశారు. ఈ నేరాల్లో మరో నలుగురి పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారు. కాగా ప్రధాన నిందితుడు బులియన్ ట్రేడర్ అని తెలిసింది. ఈ బేస్ మెంట్ లో మరో రెండు బాక్సులు ఉన్నా అవి ఖాళీగా ఉండడం విశేషం. వీటిని అక్కడ ఎందుకు దాచారంటే డాక్టర్ సోనీ కారణం చెప్పకుండా నీళ్లు నమిలాడట.. మొత్తానికి జైపూర్ లో ఈ వింత దొంగతనం సంచలనం సృష్టించింది.