AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసెంబ్లీలో హీరోల ఫైట్.. ప్రతి సీన్ క్లైమాక్స్.. తమిళ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్..

అన్నాదురై నుంచి జయలలిత వరకు సినిమా రంగులు అలుముకున్న తమిళ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త తరం పగ్గాలు చేపట్టింది. మొన్నటి వరకు థియేటర్లలో రికార్డులు వేటాడిన విజయ్, ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు శాసనసభ సాక్షిగా తమిళనాడు భవిష్యత్తు కోసం పోటీ పడుతున్నారు. ఒకరికి తాత, తండ్రి అందించిన బలమైన రాజకీయ పునాది ఉంటే, మరొకరికి జనం నీరాజనం పడుతున్న అశేష అభిమాన గణమే ఆయుధం.

అసెంబ్లీలో హీరోల ఫైట్.. ప్రతి సీన్ క్లైమాక్స్.. తమిళ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్..
New Political Era In Tamil Nadu Politics
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: May 05, 2026 | 1:04 PM

Share

తమిళనాడు రాజకీయ యవనికపై ఎప్పుడూ సినిమా రంగులు అలుముకునే ఉంటాయి. అన్నాదురై నుంచి కరుణానిధి వరకు, ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు వెండితెర వెలుగులు కోట గడప దాటి శాసనసభలో గర్జించిన సందర్భాలు అనేకం. అయితే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఒక అరుదైన, అత్యంత ఆసక్తికరమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి పీఠంపై దళపతి విజయ్, మరోవైపు ప్రతిపక్ష నేత హోదాలో ఉదయనిధి స్టాలిన్. ఇద్దరూ యువనేతలే, ఇద్దరూ మొన్నటి వరకు వెండితెరపై కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించిన హీరోలే. ఇప్పుడు వీరిద్దరి మధ్య జరగబోయే పొలిటికల్ ఫైట్ ఎలా ఉండబోతుందనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

​సాధారణంగా తమిళనాడులో రాజకీయాలంటే పంతాలు, పట్టింపులు, వ్యక్తిగత విమర్శలు ఒక రేంజ్‌లో ఉంటాయి. గతంలో జయలలిత, కరుణానిధి మధ్య జరిగిన రాజకీయ యుద్ధాలు భారత రాజకీయ చరిత్రలోనే ఒక అధ్యాయం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొత్త తరం చేతుల్లోకి పగ్గాలు వెళ్లాయి. హీరో విజయ్ తన తమిళగ వెట్రి కళగం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చి నేరుగా అధికార పీఠాన్ని అధిరోహించడం ఒక సంచలనమైతే, అటు డీఎంకే వారసుడిగా ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్షంలో నిలబడటం మరో ట్విస్ట్. ఇద్దరు మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు అసెంబ్లీలో తలపడనుండటంతో ప్రతి సెషన్ ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సినిమాను తలపించడం ఖాయంగా కనిపిస్తోంది.

​ఈ పోరు కేవలం అధికారం కోసమే కాదు, తమిళనాడు భవిష్యత్తును ఎవరు శాసిస్తారనే దానిపై కూడా. ఉదయనిధికి తన తండ్రి స్టాలిన్, తాత కరుణానిధి అందించిన రాజకీయ వారసత్వం కొండంత అండ అయితే, విజయ్‌కు ఉన్నది కేవలం తనపై జనానికి ఉన్న క్రేజ్, తన సిద్ధాంతం. వచ్చే ఎన్నికల్లో యువత ఓట్లు ఎటు మొగ్గు చూపుతాయి? సినిమా గ్లామర్ ఓట్లుగా మారుతుందా లేక వారసత్వ రాజకీయాలే పైచేయి సాధిస్తాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా, రాబోయే రోజుల్లో చెన్నై కోట సాక్షిగా ఇద్దరు స్టార్ హీరోల మధ్య సాగే ఈ రాజకీయ కురుక్షేత్రం భారత రాజకీయాల్లోనే ఒక కొత్త ట్రెండ్‌కు తెరలేపనుంది.

Follow Us