అయోధ్యలో ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న BJP, SP కార్యకర్తలు.. పోలీస్ స్టేషన్ పైనా దాడి..
ఉత్తర్ప్రదేశ్ లోని అయోధ్య(Ayodhya) లో ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రచారం వాడీవేడీగా కొనసాగుతున్న తరుణంలో.. ఎస్పీ, బీజేపీ మధ్య తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది....
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఉత్తర్ప్రదేశ్ లోని అయోధ్య(Ayodhya) లో ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం వాడీవేడీగా కొనసాగుతున్న తరుణంలో.. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. గోసాయీగంజ్(Gosaigunj) అసెంబ్లీ నియోజకవర్గంలోని కబీర్పుర్లో ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసు స్టేషన్ ఎదుటే ఈ ఘటన జరగడం గమనార్హం. గోసాయీగంజ్ నియోజకవర్గాన్ని బీజేపీ, ఎస్పీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ఎస్పీ నుంచి అభయ్ సింగ్, బీజేపీ నుంచి ఆర్తీ తివారీ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలు ప్రచారం చేస్తుండగా.. కార్లు ఎదురుపడ్డాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. గొడవ జరిగిన కాసేపటికే అక్కడ తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఘటనపై ఎస్పీ నాయకులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. తమపై దాడి చేసిన బీజేపీ శ్రేణులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్పైనా రాళ్లు విసిరారు. దీంతో బలగాలను ఉపయోగించి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.
ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఎస్ఎస్పీ శైలేశ్ పాండే తెలిపారు. నాలుగు వాహనాలు ధ్వంసమైనట్లు గుర్తించామని వెల్లడించారు. తమపై దాడి జరిగిందని రెండు పార్టీల కార్యకర్తలూ ఆరోపణలు చేశారన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో శాంతియుత పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. ఘటనపై ఇరు పక్షాల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, దాని ఆధారంగా దర్యాప్తు చేపడతామని తెలిపారు.
403 స్థానాలు కలిగిన యూపీ అసెంబ్లీకి ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగియగా.. మూడో విడత ఎన్నికల పోలింగ్ రేపు(ఫిబ్రవరి 20న ) జరగనుంది. ఏడు విడతల పోలింగ్ అనంతరం మార్చి 10 న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్ఐఎమ్ కూడా గట్టి పోటీ ఇస్తోంది.
Also Read
Viral Video: మొసళ్లకు కూడా చక్కిలిగింతలు.. సోషల్ మీడియాలో మొసలి నవ్వుతున్న వీడియో వైరల్
Boyapati Srinu : అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. యంగ్ హీరోతో బోయపాటి పాన్ ఇండియా మూవీ ప్లాన్..