బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం వెనుక అసలు స్కెచ్ ఇదేనా..
తమిళనాట వెండితెర రికార్డులు బద్దలు కొట్టిన స్టార్ హీరోలు.. ఇప్పుడు రాజకీయ రణక్షేత్రంలో సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు.. నిన్నటిదాకా ఉప్పు-నిప్పులా కొట్టుకున్న అజిత్, విజయ్ ఇప్పుడు స్నేహితులుగా మారడం వెనుక ఉన్న అసలు పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఏమిటి?బిగ్ బాస్ వేదికగా విజయ్ సేతుపతి వేసిన ఆ బాణాలు ఎవరికి తగిలాయి? తమిళ పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్న సంచలన పరిణామాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ వెండితెర చుట్టూనే తిరుగుతుంటాయి. ఒకప్పుడు ఎంజీఆర్, కరుణానిధిల శకం నుంచి జయలలిత వరకు.. ఆ తర్వాత తెర వెనుక చక్రం తిప్పిన రజనీకాంత్ రాజకీయాల నుంచి, నేడు ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న దళపతి విజయ్ వరకు.. కోలీవుడ్ గ్లామర్ లేని తమిళ పాలిటిక్స్‌ను ఊహించడం అసాధ్యం. అయితే ఎన్నికల అనంతరం సీఎం విజయ్ వేస్తున్న ఒక్కో అడుగు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా తల అజిత్‌తో చిగురించిన అనూహ్య స్నేహం, లండన్ వేదికగా జరిగిన పరిణామాలు, నటి త్రిష ప్రస్తావన.. ఇవన్నీ కలిసి తమిళనాట సరికొత్త రాజకీయ యుద్ధానికి తెరలేపాయి.
బాక్సాఫీస్ శత్రువులు.. ఇప్పుడు ప్రాణస్నేహితులు..
గత రెండు దశాబ్దాలుగా కోలీవుడ్‌ను ఏలింది తల అజిత్, దళపతి విజయ్ మాత్రమే. వీరిద్దరి మధ్య పరోక్షంగా నడిచే స్టార్ వార్ అంతా ఇంతా కాదు. వీరి సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పరస్పరం తలలు పగలగొట్టుకునేవారు, కర్రలు, ఆయుధాలతో రక్తపాతం సృష్టించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిణామాలు శరవేగంగా మారాయి. అజిత్ తల్లి మోహిని మృతి చెందిన సమయంలో సీఎం హోదాలో విజయ్ నేరుగా ఆయన ఇంటికి వెళ్లి ఓదార్చడం, ఆయన వెంట నటి త్రిష కూడా ఉండటం అప్పట్లోనే హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా లండన్‌లో జరిగిన మెచిలిన్ లీ మెన్స్ క్లబ్ కార్ రేస్ ప్రారంభోత్సవంలో విజయ్ జెండా ఊపి పోటీలను ప్రారంభించగా, అక్కడ అజిత్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఒకప్పటి బద్ధ శత్రువుల కలయికను చూసి కోలీవుడ్ ముక్కున వేలేసుకుంది. ఇదే వేదికపై మరోసారి నటి త్రిష కూడా కనిపించడం చర్చనీయాంశమైంది.
స్నేహం వెనుక పొలిటికల్ గెయిన్ గేమ్?
విజయ్-అజిత్ స్నేహం కేవలం వ్యక్తిగతమైనదేనా అంటే.. కాదనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీని వెనుక పక్కా రాజకీయ వ్యూహం దాగి ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మ్యాజిక్ ఫిగర్ విషయంలో చోటుచేసుకున్న హైడ్రామాలో రజనీకాంత్ అన్నా డీఎంకే, డీఎంకే కూటమి సర్కార్ ఏర్పాటుకు రాయబారం నడిపారన్న ప్రచారం జరిగింది. దీంతో రజనీ-విజయ్ అభిమానుల మధ్య పెద్ద వార్ నడిచింది. ఫలితంగా రజనీకాంత్ సానుభూతిపరులు ప్రస్తుత ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నారు. ఈ రాజకీయ లోటును భర్తీ చేసేందుకు అజిత్ బలం విజయ్‌కు అత్యవసరం. ఉప్పు-నిప్పులా ఉండే అజిత్, విజయ్ అభిమానులు చేతులు కలిపితే.. రాష్ట్రవ్యాప్తంగా టీవీకే పార్టీకి తిరుగులేని యువజన బలం సమకూరుతుంది. రాబోయే ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించేందుకే విజయ్ ఈ దోస్తీ పాచిక విసిరినట్లు స్పష్టమవుతోంది.
లండన్ టూర్‌పై విపక్షాల దాడి.. త్రిష అంశంపై నిలదీత..
సీఎం విజయ్ లండన్ టూర్‌పై డీఎంకే, ఏఐఏడీఎంకే కూటమి విరుచుకుపడుతోంది. తమిళనాడులో ప్రజా సమస్యలు పేరుకుపోతుంటే, సీఎం మాత్రం ఎంజాయ్ చేయడానికి లండన్ వెళ్లారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లండన్ పర్యటన అధికారికమైనదైతే, అక్కడ నటి త్రిష ఎందుకు ఉన్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఒకవేళ ఇది ప్రభుత్వ పర్యటనైతే రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు, విదేశీ నిధులు తీసుకొచ్చారో చెప్పాలని, వ్యక్తిగత పర్యటన అయితే ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాధనాన్ని వాడారా అని నిలదీశాయి.
విజయ్ సేతుపతి వర్సెస్ విజయ్
లండన్ వివాదం ఇలా ఉండగానే, మరోవైపు దళపతి వర్సెస్ మక్కల్ సెల్వన్ రచ్చ రాజుకుంది. ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ హోస్ట్‌గా ఉన్న విజయ్ సేతుపతి.. షోలో ఓ కంటెస్టెంట్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ సీఎం విజయ్‌ను తాకాయి. ‘‘కెప్టెన్సీ లేదా లీడర్‌షిప్ అంటే ఆలోచించకుండా నోటికొచ్చిన హామీలు గుప్పించడం కాదు.. అసలైన సమస్య వచ్చినప్పుడు బాధ్యత తీసుకోకుండా జారిపోయి, తప్పును ప్రత్యర్థిపై నెట్టేయడం నాయకత్వం అనిపించుకోదు’’ అంటూ సేతుపతి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సీఎం విజయ్ ఇచ్చిన ఎన్నికల హామీలను ఉద్దేశించి చేసినవేనని టీవీకే శ్రేణులు భగ్గుమన్నాయి. గతంలో డీఎంకే నుంచి లబ్ధి పొందినందుకే విజయ్ సేతుపతి ఆ పార్టీకి తొత్తుగా మారి ఇలాంటి విమర్శలు చేస్తున్నారని వారు ఎదురుదాడికి దిగారు. విపక్షాలు మాత్రం సేతుపతి మాట్లాడిన దాంట్లో తప్పేముంది.. అన్నీ అక్షరసత్యాలే కదా అంటూ విజయ్ ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.
వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ హీరోల ముఖాముఖి పోరు.. ఇప్పుడు తమిళనాడు రాజకీయ రణక్షేత్రంలో అధికార, విపక్షాల మధ్య సరికొత్త యుద్ధానికి కారణమవుతోంది. రానున్న రోజుల్లో ఈ సినీ-రాజకీయ రగడ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..
