‘ఆ కేసు కోసం పై అధికారులు వేధించారు.. మానసికంగా హింసించారు’ పోలీస్ DSP తీవ్ర ఆరోపణలు
తమిళనాడులోని కాంచీపురంలో రిటైర్డ్ మహిళా ఇన్‌స్పెక్టర్ కస్తూరి పార్థసారథి హత్య కేసులో అరెస్టయిన MDMK పార్టీ మాజీ కార్యకర్త, ఎలక్ట్రీషియన్‌ను కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘంకి డిఎస్పీ ఎం సుందరేశన్ నివేదిక సమర్పించారు. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే అక్కడి సీనియర్ అధికారులు తనను వేధించారని, బదిలీ చేశారని, అవమానించారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) ఎం సుందరేశన్ వరుస ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది..

మైలదుత్తురై, జూలై 18: 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సుందరేశన్.. ప్రస్తుతం మైలదుత్తురై జిల్లా ప్రొహిబిషన్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో మైలదుత్తురై జిల్లా ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు 23 అక్రమ ప్రభుత్వ యాజమాన్యంలోని బార్‌లను మూసివేయించారు. 1,200 మందికి పైగా కేసు పెట్టారు. ఈ చర్యల మూలంగా 700 మందికి జైలు శిక్ష పడింది. సుందరేశన్ నిష్పక్షపాత చర్యలకు ప్రజల్లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. నిజాయితీగల పోలీస్‌గా ఆయన పేరు మారుమ్రోగిపోయింది.
అయితే ఆయన తాజాగా విలేకరుల సమావేశం నిర్వహించి మైలదుత్తురై పోలీసులపై వరుస ఆరోపణలు చేశారు. తన వాహనాన్ని జప్తు చేశారని, ఉన్నతాధికారులు తనను మానసికంగా హింసిస్తున్నారని, వాహనం లేకపోవడంతో ఇంటి నుంచి కార్యాలయానికి నడిచి వెళ్లాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC) పరిధిలో ఉన్న ఓ కేసును దర్యాప్తు చేసినప్పటి నుంచి సీనియర్ అధికారులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. కాంచీపురంలో జరిగిన ఒక కేసుపై SHRCతో కలిసి పనిచేస్తున్న సమయంలో దోషులతో ఉన్నతాధికారులు కుమ్మక్కైనట్లు గ్రహించానన్నారు. దీనిపై తన నివేదికను SHRC ఛైర్మన్‌కు సమర్పించగా.. వారు వెంటనే తనను బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ ఆరోపణలు తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసిన సుందరేశన్, రిటైర్డ్ కాంచీపురం పోలీస్ ఇన్‌స్పెక్టర్ హత్య , బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యలో ఎన్‌కౌంటర్ దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. ఈ దర్యాప్తులో పోలీసుల వైపు నుంచి తప్పులు బయటకు వచ్చాయి. దీంతో ఆయనను మైలదుత్తురై జిల్లాకు బదిలీ చేశారు.
వాహనం లేకపోవడంతో ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్తున్నాను.. సుందరేశన్
మైలదుత్తురై జిల్లాలోని ప్రొహిబిషన్ పోలీస్ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న సుందరేశన్, అనుమతి లేకుండా పనిచేస్తున్న TASMARSను సీల్ చేయడం, బూట్లెగ్ లిక్కర్ అక్రమ రవాణా, ఆ ప్రాంతాల్లో మద్యం అక్రమ రవాణా వంటి నేరపూరిత సంఘటనలలో పాల్గొన్న వారిపై నిష్పాక్షికంగా చర్యలు తీసుకుంటున్నారు. విధుల నిర్వహణలో ఎంతో అంకితభావంతో పనిచేసే పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుందరేశన్.. తన వాహనాన్ని జిల్లా పోలీసు శాఖ జప్తు చేసిందని తెలిపారు. దీనిపై ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి మెయ్య నాథన్ భద్రత కోసం తన వాహనాన్ని మార్పిడి చేసుకున్నానని, దెబ్బతిన్న వాహనాన్ని ఇచ్చానన్నారు. ఆ వాహనం నడపడానికి అనుకూలంగా లేదని, తనకు అది అవసరం లేనందున దానిని తిరిగి ఇచ్చానని ఆయన పేర్కొన్నారు.
మానసికంగా హింసించారు
రిటైర్డ్ కాంచీపురం ఇన్‌స్పెక్టర్ కస్తూరి హత్య కేసులో తన దర్యాప్తు నివేదికను మార్చేందుకు అదనపు ADGP (లా అండ్ ఆర్డర్) డేవిడ్సన్ ఆశీర్వత్, IG (ఇంటెలిజెన్స్) సెంథిల్‌వేల్ ఒత్తిడి చేసినట్లు తెలిపారు. తనను హింసించేందుకు మైలదుత్తురై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్టాలిన్ తన వాహనాన్ని తీసుకెళ్లినట్లు కూడా అన్నారు. పైగా తనకు నాలుగు నెలలుగా జీతం కూడా చెల్లించలేదని, తమ మాట వినకుంటే పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉన్నతాధికారులు తనను బెదిరించినట్లు కూడా ఆయన అన్నారు. తాజాగా పోలీసు సూపరింటెండెంట్ సుందరేశన్ తన కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సుందరేశన్ ఆరోపణ సంచలనంగా మారాయి.
ఆరోపణలను ఖండించిన మైలదుతురై పోలీసులు
మరోవైపు డీఎస్పీ సుందరేశన్ ఆరోపణలను మైలదుత్తురై పోలీసులు ఖండించారు మ. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు. సుందరశన్ ప్రస్తుతం మైలదుత్తురైలోని ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారని, ఏప్రిల్ 7న అతనికి ఆఫీసు పని కోసం TN 51 G 0817 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన బొలెరో వాహనాన్ని కేటాయించినట్లు వెల్లడించారు. అయితే జూలై 11న మరో ముఖ్యమైన పని కోసం ఆయన ఉపయోగిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బదులుగా TN 51 G 0616 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన బొలెరో వాహనాన్ని ప్రత్యామ్నాయ వాహనంగా అందించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు అయన గతంలో ఉపయోగించిన TN 51 G 0817 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన వాహనాన్ని తిరిగి అందించామని పేర్కొన్నారు. నిజాయితీ కలిగిన సుందరేశన్ చర్యలు మింగుడు పడని డీఎంకే ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోందని స్టాలిన్ సర్కార్‌కి బీజేపీ చురకలంటించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








