Tamil Nadu Custodial Death: ఆలయ గార్డు కస్టడీ డెత్ కేసులో కీలక మలుపు! రంగంలోకి సీఎం స్టాలిన్..
మృతుడు అజిత్ కుమార్ మాదపురం కాళీఅమ్మన్ ఆలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సమయంలో.. ఆభరణాల దొంగతనం కేసులో ప్రశ్నించినందుకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో అజిత్ మృతి చెందాడు. దీంతో విచారణ పేరుతో అజిత్‌ను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని, అందుకే అతను మరణించాడని అజిత్ కుటుంబం ఆరోపిస్తోంది..

చెన్నై, జూలై 1: తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఆలయ గార్డు అజిత్ కుమార్ (28) అనే యువకుడు కస్టడీ డెత్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రంగంలోకి దిగారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి బదిలీ చేస్తున్నట్లు సీఎం స్టాలిన్ మంగళవారం ప్రకటించారు. మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా దర్యాప్తు జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయతే ప్రస్తుతం జరుగుతున్న CB-CID దర్యాప్తు కొనసాగించవచ్చని మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ అన్నారు. ఈ కేసులో CBI విచారణ మరింత స్పష్టతను ఇస్తుందని ఆయన విశ్వసించారు. పారదర్శకత, సమగ్ర దర్యాప్తును నిర్ధారించడానికి కేసును CBIకి బదిలీ చేయాలని ఆదేసించినట్లు స్టాలిన్ మీడియాకు తెలిపారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థకు పూర్తిగా సహకరిస్తుందని ఆయన అన్నారు.
సీఎం స్టాలిన్ స్వయంగా అజిత్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి సోదరుడు నవీన్ కుమార్‌కు స్వయంగా ఫోన్ చేసి ఆలయ గార్డు కస్టడీ డెత్ పట్ల స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఏర్పాటు చేయడంతో సహా అవసరమైన అన్ని సహాయాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. క్షమించండి అమ్మా అని స్టాలిన్ అజిత్ తల్లి మాలతికి తన సంతాపాన్ని తెలియజేశారు. కాగా మృతుడు అజిత్ కుమార్ మాదపురం కాళీఅమ్మన్ ఆలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సమయంలో.. ఆభరణాల దొంగతనం కేసులో ప్రశ్నించినందుకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో అజిత్ మృతి చెందాడు. దీంతో విచారణ పేరుతో అజిత్‌ను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని, అందుకే అతను మరణించాడని అజిత్ కుటుంబం ఆరోపిస్తోంది.
అజిత్ మరణం నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం శివగంగ ఎస్పీ ఆశిష్ రావత్‌ను తప్పనిసరి నిరీక్షణలో ఉంచింది. అంతేకాకుండా రామనాథపురం ఎస్పీ జి. చండీష్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ కేసు దర్యాప్తు కోసం సిబి-సిఐడికి అప్పగించారు. మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో జరిగిన విచారణ సందర్భంగా, న్యాయవాది హెన్రీ టిఫాగ్నే అజిత్ కుమార్‌ను ప్లాస్టిక్ పైపులు, ఇనుప రాడ్‌లతో కొట్టారని సూచించే వీడియో, ఫోటోగ్రాఫిక్ ఆధారాలను సమర్పించారు. అసలు ఆభరణాల దొంగతనం ఫిర్యాదుపై పోలీసులు చర్య తీసుకోవడంలో విఫలమైనందుకు కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో ఐదుగురు పోలీసు సిబ్బందిని అరెస్టు చేశారు. జూన్ 28న ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించింది. పోస్ట్‌మార్టం ఫలితాల ఆధారంగా కేసును క్రిమినల్ కేసుగా మార్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








