AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Shawarma: చికెన్‌ షవర్మ తిని 14 ఏళ్ల బాలిక మృతి.. మరో 13 మందికి తీవ్ర అస్వస్థత

రోడ్డు పక్కన ఘుమఘుమలాడే స్ట్రీట్‌ ఫుడ్‌ సువాలసనలు ముక్కు పుటాలను తాకగానే అటుగా తెలియకుండానే అడుగులు పడిపోతాయి. కానీ తర్వాత ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. తాజాగా 14 ఏళ్ల బాలిక చికెన్‌ షవర్మ తిని తీవ్ర అశ్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ విషాద ఘటన తమిళనాడులో..

Chicken Shawarma: చికెన్‌ షవర్మ తిని 14 ఏళ్ల బాలిక మృతి.. మరో 13 మందికి తీవ్ర అస్వస్థత
Chicken Shawarma
Srilakshmi C
|

Updated on: Sep 19, 2023 | 11:26 AM

Share

చెన్నై, సెప్టెంబర్‌ 19: రోడ్డు పక్కన ఘుమఘుమలాడే స్ట్రీట్‌ ఫుడ్‌ సువాలసనలు ముక్కు పుటాలను తాకగానే అటుగా తెలియకుండానే అడుగులు పడిపోతాయి. కానీ తర్వాత ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. తాజాగా 14 ఏళ్ల బాలిక చికెన్‌ షవర్మ తిని తీవ్ర అశ్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ విషాద ఘటన తమిళనాడులో సోమవారం (సెప్టెంబర్‌ 18) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

తమిళనాడులోని నమక్కళ్‌కు చెందిన ఓ వ్యక్తి చికెన్‌ షవర్మ తీసుకురావడానికి సమీపంలోని ఓ రెస్టారెంట్‌కు ఆదివారం (సెప్టెంబర్‌ 17) వెళ్లాడు. అక్కడ చికెన్‌ షవర్మతోపాటు మరికొన్ని నాన్‌ వెజ్‌ ఐటెమ్స్‌ ఆర్డర్‌ చేసిన వాటికి కూడా బిల్లు చెల్లించి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతను, అతని భార్య, అతని 14 ఏళ్ల కుమార్తె వాటిని ఆరగించారు. అనంతరం అదే రోజు రాత్రి బాలిక తీవ్ర కడుపు నొప్పితో బాధపడింది. కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతున్న బాలికను తల్లిదండ్రులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఫుడ్‌ పాయిజన్‌ అయినట్లు తెలిపారు. చికిత్స అనంతరం బాలికను ఇంటికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. కానీ ఆ మరుసటి రోజే బాలిక విగతజీవిగా మారింది.

దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. సదరు రెస్టారెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి, వెంటనే దానిని మూసివేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. కాగా కొన్ని రోజుల క్రితం అదే రెస్టారెంట్‌లో నాన్‌ వెజ్‌ ఆహారం తిని దాదాపు 13 మంది మెడికల్ విద్యార్ధులు అశ్వస్థతకు గురవ్వగా వారందరూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. తాజాగా మరో మారు అదే రెస్టారెంట్‌ ఫుడ్‌ తిని బాలిక మరణించడంతో అధికారులు రెస్టారెంట్‌ నిర్వాకంపై దృష్టి సారించారు. దీంతో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్‌పై దాడులు నిర్వహించారు. అక్కడ ఆహార శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. రెస్టారెంట్‌ను నిర్వహిస్తోన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెస్టారెంట్‌లో కుళ్లిన చికెన్‌తో షవర్మా, తందూరి, గ్రిల్డ్‌ చికెన్‌ వంటి వంటకాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వీటి వల్లనే ఫుడ్ పాయిజన్‌ అయినట్లు విచారణలో తేలింది. సదరు చికెన్‌ను ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, ఎన్నాళ్లుగా నిల్వ చేశారు అనే విషయాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల కాలంలో స్ట్రీట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ జనాలు విపరీతంగా అట్రాక్ట్ అవుతున్నారు. లాభాల కోసం వ్యాపారులు నాణ్యత నిబంధనలు పక్కన బెట్టి ఆహారాన్ని జనాలకు పంపిణీ చేస్తున్నారు. దీంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్, డయేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తమిళనాడులో చోటు చేసుకున్న తాజా సంఘటన ఇటువంటి వారికి కనువిప్పులాంటిది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.