Supreme Court: ఇలాంటి పరీక్షలు చేసే వాళ్లకు కఠినశిక్షలు తప్పవు.. రేప్ కేసుల దర్యాప్తుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
అత్యాచారం కేసుల విచారణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. రేప్ జరిగిందా ? లేదా ? అని నిర్ధారించడానికి చేసే టూ ఫింగర్ టెస్ట్‌లను సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

అత్యాచార బాధితులకు టూ ఫింగర్ టెస్ట్ అశాస్త్రీయమని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పరీక్షలను శిక్షార్హం చేయాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. టూ ఫింగర్ టెస్ట్ బాధితులను మనోవేదనకు గురిచేస్తుందని అభిప్రాయపడింది. విచారణ సందర్భంగా జస్టిస్ డివై.చంద్రచూడ్ ఇది పురుషాధిపత్యమని వ్యాఖ్యానించారు. గతంలో సైతం టూ ఫింగర్ టెస్ట్‌ల విషయంలో ఉన్నత న్యాయస్థానం ఇదేవిధమైన వ్యాఖ్యలు చేసింది. అత్యాచార బాధితులను నిందితులుగా చూసే విషాదకరమైన అనుభవాలు కోకొల్లలు. సామాజిక అసమానతలే వాటికి మూలాలు. అలాంటి కోవకే చెందింది రేప్ విక్టిమ్స్ టూ ఫింగర్ టెస్ట్.
బాధితులపై రేప్ జరిగిందా లేదా అన్నది తెలుసుకోవడానికి అనేక ప్రాంతాల్లో అత్యంత జుగప్సాకరమైన, స్త్రీల మనోభావాలను కించపరిచే ఈ టూ ఫింగర్ టెస్ట్‌కి పాల్పడుతున్నారు. ఈ విధానంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
మహిళా సంఘాలు దీన్ని తీవ్రంగా దుయ్యబట్టాయి. ఇది స్త్రీల దేహాలపై, వారి మనసులపై కొనసాగుతున్న పురుషాధిపత్య దురహంకారానికి మచ్చుతునక అంటూ మహిళాలోకం మండిపడింది. ఇదే విషయాన్ని మరోసారి భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అసలే అత్యాచార అవమానంతో కుమిలిపోతోన్న మహిళను ఈ పరీక్ష మరింత కుంగదీస్తుందని అభిప్రాయపడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం




