Supreme Court: ఉచిత కానుకల పంపిణీపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..
ఓటర్లకు నగదు, ఉచిత కానుకలు పంచకుండా రాజకీయ పార్టీలను కట్టడి చేయాలని కోరుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉచితాలకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. పన్ను చెల్లింపుదారుల ధనాన్ని ఇలా కానుకలుగా పంచడం సబబుకాదని న్యాయస్థానానికి తెలిపారు. ఎన్నికలకు..

ఢిల్లీ, అక్టోబర్ 06: ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఓటర్లపై అన్ని రాజకీయ పార్టీలు వరాల జల్లులు కురిపిస్తూ ఉండటం సర్వసాధారణంగా మారిపోయింది. నగదు పంచే పార్టీలు కొన్ని అయితే, రకరకాల ఉచిత కానుకలు పంచే పార్టీలు మరికొన్ని. అలా పంచడం న్యాయసమ్మతమేనా? ఓట్ల కోసం ఇచ్చే లంచాలుగా వాటిని పరిగణించాలా?
ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగనున్న వేళ సుప్రీంకోర్టులో ఒక కీలక పిటిషన్ దాఖలైంది. ఓటర్లకు నగదు, ఉచిత కానుకలు పంచకుండా రాజకీయ పార్టీలను కట్టడి చేయాలని కోరుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉచితాలకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. పన్ను చెల్లింపుదారుల ధనాన్ని ఇలా కానుకలుగా పంచడం సబబుకాదని న్యాయస్థానానికి తెలిపారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు, కానుకల పంపిణీ మొదలువుతుందనే విషయాన్ని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
ఎన్నికల సమయంలో ఇచ్చే ఓటర్లకు రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ JB పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కోరుతూ సుప్రీంకోర్టు – కేంద్రం, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులను ప్రతివాదులుగా చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. కాని, ముఖ్యమంత్రులను తొలగించి ఆ రాష్ట్రాల పేర్లు చేర్చాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఈ తరహా పిటిషన్‌లో గతంలో కూడా సుప్రీంకోర్టులో దాఖలైంది. బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌కు బదిలీ చేసింది. గతంలో ఉన్న పిటిషన్‌ను ప్రస్తుతం దాఖలైన పిటిషన్‌ను రెండింటిని కలిపి విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




