Delhi: ఎంసిడీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. ఆప్ సత్తా చాటేనా.. బీజేపీ ముందడుగు వేసేనా..
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలకు నగారా మోగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహించనుండగా.. డిసెంబర్ 7 న ఓట్ల లెక్కింపు..

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలకు నగారా మోగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహించనుండగా.. డిసెంబర్ 7 న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఢిల్లీలోని 250 మున్సిపల్ వార్డులకు డిసెంబర్ 4న జరగనున్న పోలింగ్ లో 1.46 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వాస్తవానికి 2022 ప్రథమార్థంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. గతంలో మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ఎంసీడీలో విలీనం చేయాలనే కేంద్రం నిర్ణయం తర్వాత ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. గత 15 ఏళ్లుగా స్థానిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏకీకృత సంస్థగా ఉన్నప్పుడు 2007 ఎన్నికల్లో విజయం సాధించింది. 2012లో విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 2017లో జరిగిన ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధించింది.
2017లో 272 వార్డులకు ఎన్నికలు జరగగా.. తూర్పు, ఉత్తరం, దక్షిణం అనే మూడు కార్పొరేషన్లలో బీజేపీ 181 సీట్లు గెలుచుకోగా, ఆప్ 49, కాంగ్రెస్ 31 స్థానాల్లో విజయం సాధించింది. కాగా ఈ సారి డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మునిసిపల్ వార్డుల సంఖ్యను 250 కి తగ్గించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే మహిళలకు రిజర్వ్ చేసిన వార్డులను నోటిఫై చేసింది.
మరోవైపు.. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారం చేపట్టిన ఆప్.. గుజరాత్ లోనూ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందే ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలో పలుమార్లు పర్యటించారు. ఆప్‌ను గెలిపించాలంటూ భారీ ఆఫర్లు సైతం ప్రకటించారు. కాగా, తాజాగా ఆప్.. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆప్ జాతీయ కార్యదర్శి ఇసుదన్ గాధ్విని గుజరాత్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..



