Social Media: ఇండియాలో హిందువులపై సోషల్ మీడియాలో దాడులు పెరిగాయా..? తాజా నివేదిక చెబుతున్న విషయాలు ఏంటి..?
పరిశోధకులు జనవరి 2019 నుంచి జూన్ 2022 వరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోని డేటాను విశ్లేషించారు. హిందువులకు వ్యతిరేకంగా మీమ్స్, పోస్టుల వ్యాప్తి పెరిగిందని వారు గుర్తించారు.
భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ప్రపంచ దేశాలు భారత్ గొప్పతనాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఉపయోగించే మాట ఇది. మానవత్వానికి ప్రాముఖ్యత ఇస్తూ.. మతాలు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా మనషుల్ని అక్కున చేర్చుకునే జాతి మనది. కానీ సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. పరిస్థితి మారిపోయింది. ఈ మధ్య కాలంలో విద్వేషాలు రెచ్చగోట్టే పోస్టులు పెరిగాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో హిందువులను అవమానించే పోస్టులు పెరిగాయని ఓ నివేదిక తెలిపింది. 4చాన్, టెలిగ్రామ్, గాబ్‌తో సహా మిగిలిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హిందువుల పట్ల అవమానకరమైన పోస్ట్‌లు గణనీయంగా పెరిగాయని కొత్త నివేదిక పేర్కొంది. ‘Anti-Hindu Disinformation: A Case Study of Hinduphobia on Social Media’ ( ‘యాంటీ-హిందూ తప్పుడు సమాచారం: సోషల్ మీడియాలో హిందూఫోబియా కేస్ స్టడీ’) అనే పేరుతో జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అమెరికాలోని రట్జర్స్ విశ్వవిద్యాలయం(Rutgers University) (NCRI)లోని పలువురు ఈ అధ్యయనం జరిపిన నిపుణులు ఈ డేటా తాజాగా విడుదల చేశారు. హిందువులను మతోన్మాదులుగా, జాలి.. దయ లేకుండా వ్యవహరించే వారిగా, నమ్మకద్రోహులుగా చిత్రీకరించే పోస్ట్‌లు ఈ మధ్య కాలంలో పెరిగాయని ఈ అధ్యయనం చెబుతుంది. 2018 ప్రారంభంలో ఇరాన్ ప్రెసిడెంట్ డాక్టర్ హసన్ రౌహానీ భారత పర్యటన సందర్భంగా #KashmirDeniesIndia, హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేయడం వంటివి ఇందులో భాగం అని ఆ నివేదిక చెప్తుంది.
అయితే ఇలాంటి పోస్టులపై చాలామంది ప్రజలు గొంతెత్తారని, తిరగబడ్డారని ఈ రిపోర్ట్ తెలిపింది. అయితే ఇలాంటి పోస్టుల వల్ల హిందుఫోబియా అనే విషయంపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగి.. ప్రజలను తప్పుగా ఆలోచింపజేసేలా కొందరు ప్రయత్నించారని పేర్కొంది. NCRI 1 మిలియన్ కంటే ఎక్కువ ట్వీట్‌లను పరిశీలించించి ఈ డేటాను విడుదల చేసింది.