Delhi: ఢిల్లీలో ఘోరం.. కుప్పకూలిన నాలుగు అంతస్థుల బిల్డింగ్.. శిథిలాల కింద..
ఢిల్లీలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఉదయం 7గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి.. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ భవనంలో 10మంది గల కుటుంబం నివసిస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఇప్పటికే కొంతమందిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది.. మిగితావారి కోసం గాలిస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ సీలంపూర్‌లోని జనతా కాలనీలో ఇవాళ ఉదయం భవనం కుప్పకూలింది. ఉదయం 7గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. వెంటనే స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 14 నెలల బాలుడితో పాటు నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలను బయటకు తీశారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ భవనంలో 10మంది గల ఫ్యామిలీ నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ఉదయం 7 గంటలకు భవనం కూలిపోయినట్లు మాకు కాల్ వచ్చింది. వెంటనే వెళ్లి సహాయక చర్యలు చేపట్టాం’’ అని పోలీస్ అధికారి తెలిపారు.
ఈ ప్రమదానికి సంబంధించి స్థానికులు కీలక విషయాలు వెల్లడించారు. ‘‘ఉదయం 7 గంటల సమయంలో నేను నా ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద శబ్దం వినిపించింది. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో దుమ్ము వ్యాపించింది. నేను కిందకు దిగి చూసేసరికి, మా పక్కన ఇల్లు కుప్పకూలిపోయింది. ఆ బిల్డింగ్‌లో 10మంది ఉంటారు. ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారో తెలియదు’’ అని అస్మా అనే స్థానికురాలు తెలిపింది.
#WATCH | Delhi: Locals help in clearing the debris after a ground-plus-three building collapses in Delhi’s Seelampur. 3-4 people have been taken to the hospital. More people are feared trapped. https://t.co/VqWVlSBbu1 pic.twitter.com/UWcZrsrWOb
— ANI (@ANI) July 12, 2025
ఏప్రిల్‌లోనూ ఢిల్లీలో ఇటువంటి ఘటనే జరిగింది. ముస్తఫాబాద్‌లో నాలుగు అంతస్తుల భవనం కూలిపోవడంతో నలుగురు మరణించారు. ఆ ఘటన జరిగి మూడు నెలల కాకముందు మరో దుర్ఘటన జరగడం స్థానికులను కలిచివేసింది. అయితే అధికారులు అనుమతులు లేని భవనాలతో పాటు శిథిలావస్థకు చేరుకున్న భవనాలను నేలమట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




