AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Bandh: సెప్టెంబర్‌ 25న భారత్‌ బంద్‌.. ప్రకటించిన నేతలు.. ఎందుకో తెలుసా..?

Bharat Bandh: దేశంలో రకరకాలుగా ఆందోళనలు కొనసాగుతుంటాయి. ఎవరికి వారే తమ తమ పోరాటాలు కొనసాగిస్తుంటారు. ఇక కేంద్రం..

Bharat Bandh: సెప్టెంబర్‌ 25న భారత్‌ బంద్‌.. ప్రకటించిన నేతలు.. ఎందుకో తెలుసా..?
Bharat Bandh
Subhash Goud
|

Updated on: Aug 27, 2021 | 9:26 PM

Share

Bharat Bandh: దేశంలో రకరకాలుగా ఆందోళనలు కొనసాగుతుంటాయి. ఎవరికి వారే తమ తమ పోరాటాలు కొనసాగిస్తుంటారు. ఇక కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా సెప్టెంబర్‌ 25న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది రైతు సంఘాలు. కేంద్ర సర్కార్‌ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న పోరాటాన్ని రైతు సంఘాలు మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు సంయుక్త కిసాన్‌ మోర్చా సెప్టెంబర్‌ 25న భారత్‌ బంద్‌ పిలుపునిచ్చింది. ఢిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆల్‌ ఇండియా కిసాన్‌ మజ్దూర్‌ సభ నేత ఆశీష్‌ మిత్తల్‌ మాట్లాడుతూ.. గతేడాది కూడా కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఇదే తేదీన భారత్‌ బంద్‌ నిర్వహించామని గుర్తు చేశారు. ఈ ఏడాది పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ మరింత విజయవంతం అవుతుందని భావిస్తున్నట్టు అన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా ఉన్న ఈ మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఈ పోరాటంలో భాగంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయిందన్నారు.

ఇక మరోవైపు ఢిల్లీలో రెండు రోజుల పాటు నిర్వహించిన రైతుల అఖిల భారత సదస్సు శుక్రవారంతో ముగిసిందన్నారు. ఈ సదస్సుకు 22 రాష్ట్రాల నుంచి 300 రైతు సంఘాల ప్రతినిధులతో పాటు మహిళా, కార్మిక, గిరిజన, యువజన, విద్యార్థి సంఘాలు ప్రతినిధులు కూడా పాల్గొన్నట్టు ఆయన పేర్కొన్నారు. దేశ రాజధాని నగర సరిహద్దుల్లో గత తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న రైతుల పోరాటంతో పాటు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల విధానాలతో వ్యవసాయ రంగంపై ఏవిధంగా దాడి చేస్తుందో సదస్సులో చర్చించినట్టు తెలిపారు.

చట్టాల ఉపసంహరణతో పాటు చట్టబద్దమైన హామీ ఇవ్వాలి..

ఈ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా ఉన్న ఈ మూడు చట్టాలను ఉపసంహరించుకోవడంతో పాటు అన్ని పంటలకు మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని అన్నారు. విద్యుత్‌ బిల్లు 2021ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పది సార్లు రైతు సంఘాల నేతలతో చర్చలు జరపగా విఫలమయ్యాయి.

ఇవీ కూడా చదవండి:

విదేశాలకు వెళ్లే వారు కోవిడ్‌-19 సర్టిఫికేట్‌తో పాస్‌పోర్టును లింక్‌ చేసుకున్నారా..? అయితే ఇలా చేయండి..!

Corona Vaccination: కీలక ప్రకటన.. ఆ సంస్థ ఉద్యోగులకు వ్యాక్సిన్‌ తప్పని సరి.. లేకపోతే జీతంలో రూ.15వేలు కట్‌!