AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఒక్క రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఆఫర్ చూసి ఎగబడ్డ జనం.. చివరకు సీన్ రివర్స్..

ఒక్క రూపాయికి షూస్.. ఈ చిన్న ప్రకటన కేరళలోని కోజికోడ్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. తెల్లవారుజామున 2 గంటల నుండే వేల సంఖ్యలో యువత రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. తొక్కిసలాట, పోలీసుల లాఠీచార్జ్, చివరకు యజమాని అరెస్ట్.. ఒక్క రూపాయి ఆఫర్ ఎంతటి గందరగోళానికి దారితీసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు

Video: ఒక్క రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఆఫర్ చూసి ఎగబడ్డ జనం.. చివరకు సీన్ రివర్స్..
Rs 1 Shoe Offer In Kozhikode Leads To Chaos
Krishna S
|

Updated on: Mar 08, 2026 | 7:49 PM

Share

కేరళలోని కోజికోడ్ నగరంలో ఒక చిన్న ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. ఒక రూపాయికే ప్రీమియం బూట్లు ఇస్తామన్న ప్రకటన చూసి వేల సంఖ్యలో యువత రోడ్లపైకి రావడంతో ఆదివారం కోజికోడ్ రణరంగాన్ని తలపించింది. పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట పరిస్థితి రావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. కోజికోడ్‌లోని మనంచిర ప్రాంతంలో ఉన్న ట్రెండ్స్ ఫ్యాక్టరీ అనే షూ దుకాణం యజమాని సోషల్ మీడియాలో ఒక వింత ఆఫర్‌ను ప్రకటించారు. ఆదివారం ఉదయం షాపు ప్రారంభోత్సవం సందర్భంగా ఎవరైతే ఒక రూపాయి నోటు పట్టుకొని వస్తారో వారిలో మొదటి 100 మందికి బ్రాండెడ్ షూస్ కేవలం ఒక్క రూపాయికే ఇస్తామని ప్రచారం చేశారు.

తెల్లవారుజాము నుండే క్యూ కట్టిన జనరల్ జెడ్

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. కేవలం కోజికోడ్ నుండే కాకుండా వయనాడ్, మంగళూరు, త్రిస్సూర్ వంటి పొరుగు జిల్లాల నుండి కూడా జనం తరలివచ్చారు.‘‘నేను తెల్లవారుజామున 2:30 గంటలకే ఇక్కడికి చేరుకున్నాను. అప్పటికే రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి’’ అని వయనాడ్ నుండి వచ్చిన ఒక చిన్న పిల్లవాడు మీడియాకు తెలిపాడు. ఉదయం 7 గంటల సమయానికి సుమారు 20 వేల మంది యువత ఆ ప్రాంతంలో గుమిగూడారు.

స్తంభించిన ట్రాఫిక్.. పోలీసుల లాఠీచార్జ్

ప్రధాన రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. దుకాణం తెరిచే సమయానికి అందరూ ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లడానికి ప్రయత్నించడంతో ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట మొదలైంది.పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని గమనించిన పోలీసులు జనాన్ని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినా జనం పట్టించుకోకపోవడంతో, పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో పలువురు యువతకు గాయాలయ్యాయి.

యజమాని అరెస్ట్ – షాపు మూసివేత

ప్రజా భద్రతకు ముప్పు కలిగించినందుకు, ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. దుకాణ యజమానితో సహా ఎనిమిది మంది సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తగిన భద్రత, అనుమతులు లేకుండా దుకాణాన్ని మళ్ళీ తెరవకూడదని పోలీసులు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.

Follow Us