మన ఇంటి ముందు గుంతకు అసలు బాధ్యుడు ఎవరు..? రస్తా ఏదైనా.. జవాబుదారీ ఎవరిది?
రోడ్డుపై గుంత కనిపిస్తే ప్రభుత్వానిదే బాధ్యత అనుకోవడం సహజం. కానీ ప్రతి రహదారి ఒకే శాఖ పరిధిలో ఉండదు. జాతీయ రహదారులకు NHAI, రాష్ట్ర రహదారులకు రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు-భవనాల శాఖ, పట్టణ అంతర్గత రోడ్లకు మున్సిపాలిటీలు, గ్రామీణ రహదారులకు సంబంధిత స్థానిక సంస్థలు బాధ్యత వహిస్తాయి. జాతీయ రహదారులపై గుంతలు లేదా ఇతర సమస్యలను NHAI 1033 హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

రాత్రి వేళ ద్విచక్రవాహనం గుంతలో పడి అదుపుతప్పినప్పుడు ప్రయాణికుడు ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ముందుకు సాగిపోవడం సహజం.. కానీ, అసలు ఆ రోడ్డుపై ఉన్న గుంత ఏ ప్రభుత్వానికి చెందింది? దాన్ని బాగుచేయాల్సిన బాధ్యత ఎవరిది? అన్న ప్రశ్నకు చాలామంది వద్ద స్పష్టమైన సమాధానం ఉండదు. మన దేశంలో రహదారులు, వాటి నిర్వహణ బాధ్యతలు విభిన్న ప్రభుత్వ శాఖల పరిధిలోకి వస్తాయి. ఈ వ్యత్యాసం తెలియకపోవడం వల్ల గుంతల వల్ల జరుగుతున్న ప్రమాదాలు, ప్రాణనష్టాలు ఏటికేటా పెరుగుతూనే ఉన్నాయి.
ఏ రోడ్డు.. ఎవరి పరిధిలోకి వస్తుంది?
భారతదేశంలో రహదారులు వివిధ స్థాయిలుగా విభజించారు:
జాతీయ రహదారులు (National Highways): రాష్ట్రాలు, ప్రధాన నగరాలను కలిపే ఈ రోడ్లను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పర్యవేక్షిస్తుంది. వీటిపై “NH” అనే బోర్డులు ఉంటాయి.
రాష్ట్ర రహదారులు (State Highways): రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను కలిపే ఈ రహదారులు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (PWD) పరిధిలోకి వస్తాయి. వీటిని “SH”తో సూచిస్తారు.
జిల్లా – గ్రామీణ రోడ్లు: ఇవి సంబంధిత PWD లేదా గ్రామ పంచాయతీల పరిధిలో ఉంటాయి.
నగర/పట్టణ అంతర్గత రోడ్లు: మన ఇళ్లు, దుకాణాలు, పాఠశాలల ముందుండే సాధారణ వీధులు ఆయా మున్సిపల్ కార్పొరేషన్ లేదా పురపాలక సంఘాల బాధ్యత.
గుంతల వల్ల పెరుగుతున్న మరణాలు (గణాంకాలు):
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌లో వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం:
మరణాల పెంపు: దేశంలో రోడ్డు గుంతల వల్ల సంభవించే మరణాలు 2020లో 1,555 ఉండగా, 2024 నాటికి ఏకంగా 2,385కి చేరాయి. అంటే కేవలం ఐదేళ్లలో 53 శాతం మేర మరణాలు పెరిగాయి.
భారీ ప్రాణనష్టం: గడిచిన ఐదేళ్లలో గుంతల కారణంగా 9,400 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్: మొత్తం దేశవ్యాప్త మరణాలలో సగానికి పైగా (5,100 కంటే ఎక్కువ మరణాలు) ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే నమోదయ్యాయి.
ఫిర్యాదు ఎక్కడ, ఎలా చేయాలి?
వర్షాకాలంలో చిన్నగా ప్రారంభమయ్యే గుంతలు నెలల తరబడి నిర్లక్ష్యానికి గురై పెద్దవిగా మారతాయి. అయితే, గుంతను చూసిన పౌరులు దాన్ని ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. ఇలా.. ఆయా శాఖలకు పంపిన ఫిర్యాదులు ముందుకు సాగవు.
జాతీయ రహదారుల పై సమస్యలకు: NHAI వారి టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1033 కు ఫోన్ చేసి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
నగరాలు, పురపాలక రోడ్లకు: సంబంధిత మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ వారి యాప్‌లు, హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలి.
ఆయా ఊర్లల్లో.. ఇళ్ల ముందర గుంతలుంటే ఆయా ఊరి పంచాయతీ సెక్రటరీలకు, లేదా అధికారులకు ఫిర్యాదు చేయాలి..
రోడ్డుపై ఉండే గుంత ఏ శాఖ పరిధిలోనిదో ఆ గుంతకు తెలియకపోవచ్చు, కానీ దాని వల్ల ప్రమాదాల బారిన పడుతున్న పౌరులు మాత్రం తప్పక తెలుసుకోవాలి. సమస్య తీవ్రమైనప్పుడు అధికారులను సరిగ్గా నిలదీయాలన్నా, సరైన శాఖకు ఫిర్యాదు చేయాలన్నా ఆ రోడ్డు యాజమాన్యం ఎవరిదో తెలుసుకోవడమే మొదటి అడుగు..
