AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆస్పత్రులకు హెచ్చరిక..!

రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక, సంచలన తీర్పును వెలువరించింది. ప్రమాద సమయాల్లో అత్యవసర వైద్య సేవలు (ట్రామా కేర్) అందించడం ఇకపై పౌరుల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆస్పత్రులకు హెచ్చరిక..!
Supreme Court
Balaraju Goud
|

Updated on: May 29, 2026 | 7:29 AM

Share

రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక, సంచలన తీర్పును వెలువరించింది. ప్రమాద సమయాల్లో అత్యవసర వైద్య సేవలు (ట్రామా కేర్) అందించడం ఇకపై పౌరుల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ట్రామా చికిత్సను ఒక హక్కుగా గుర్తించాలంటూ ‘సేవ్‌లైఫ్ ఫౌండేషన్’ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి కొన్ని నిమిషాలు అత్యంత విలువైనవి. వైద్యం ఆలస్యమైతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అత్యవసర సమయాల్లో ఎంత త్వరగా స్పందిస్తే అంత మంది ప్రాణాలను కాపాడవచ్చు. వేగవంతమైన స్పందనే ఇక్కడ అసలైన ఔషధం. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు తక్షణ వైద్యం అందించడం రాజ్యాంగం కల్పించిన ‘జీవించే హక్కు’ (ఆర్టికల్ 21) లో అంతర్భాగమేనని ధర్మాసనం స్పష్టం చేసింది.

ప్రమాద బాధితులను కాపాడే క్రమంలో చుట్టుపక్కల వారు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు గట్టిగా స్పందించింది. ప్రమాద బాధితులకు తక్షణమే చికిత్స అందించడం ఆస్పత్రుల ప్రాథమిక బాధ్యత. ఫీజులు లేదా ఇతర సాంకేతిక కారణాలతో చికిత్సలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. మానవత్వంతో సహాయం చేసే వారికి చట్టపరమైన భయాలు ఉండకూడదు. బాధితులను ఆస్పత్రికి తరలించిన గుడ్ సమారిటన్స్ (సహాయకులు) ను పోలీసులు విచారణల పేరుతో వేధించకూడదని, వారిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు వేగంగా, ఏకీకృత పద్ధతిలో సహాయం అందించేందుకు సుప్రీంకోర్టు ఒక కీలక కాలపరిమితిని విధించింది. దేశమంతటా ఒకే రకమైన ‘112’ అత్యవసర హెల్ప్‌లైన్ వ్యవస్థను మూడు నెలల్లోగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రానికి, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేస్తూ గడువు విధించింది. ఈ తీర్పు దేశంలో రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడంలో మరియు బాధితులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఒక మైలురాయిగా నిలవనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us