రక్తం పెరగడానికి, శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. వండేటప్పుడు ఆ ఒక్క తప్పు మాత్రం చేయొద్దు..
నల్ల కూర అంటే గోట్ బ్లడ్ కర్రీ.. రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఐరన్, ప్రోటీన్లు, విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఈ సంప్రదాయ వంటకం రక్తహీనతను తగ్గించడంలో, శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అయితే నల్లను తప్పనిసరిగా తాజాగా తీసుకుని, శుభ్రంగా కడిగి, పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వండేటప్పుడు తాజాదనంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

తెలుగు వంటకాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నాన్-వెజ్ వంటకాలలో.. ఎప్పుడు చికెన్, మటన్ వంటివే కాకుండా, కొత్త రుచులను ఆస్వాదించాలనుకునే వారికి “నల్ల కూర”.. అంటే గోట్ బ్లడ్ కర్రీ ఒక అద్భుతమైన ఎంపిక.. అలాగే దీనిలోని పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.. మటన్ నల్ల (మేక రక్తం) లో ఐరన్, ప్రోటీన్లు, విటమిన్ బి12, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను నివారించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, కండరాల నిర్మాణంలో సహాయపడుతుంది. అయితే, దీనిని తినే ముందు శుభ్రంగా కడిగి, బాగా వేయించి (ఫ్రై) తినడం ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
వాస్తవానికి ఆదివారం అనే కాకుండా.. చాలా సందర్భాల్లో ఇంట్లో నాన్-వెజ్ వంటకాలు ఉండాల్సిందే. ఈ సారి, సరికొత్త రుచిని, అలాగే ఆరోగ్య ప్రయోజనాలను అందించే మేక నల్ల కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
నల్ల (మేక రక్తం) – సుమారు 500 గ్రాములు
ఉల్లిపాయలు – 2 పెద్దవి (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి – 3-4 (నిలువుగా చీల్చాలి), ఎండుమిర్చి – 2-3 (తుంచి పెట్టుకోవాలి), అల్లం – 1 చిన్న ముక్క, వెల్లుల్లి – 4-5 రెబ్బలు, ఉప్పు – రుచికి సరిపడా, కారంపొడి – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – 1 టేబుల్ స్పూన్, ఇంట్లో తయారుచేసిన గరం మసాలా – 1 టేబుల్ స్పూన్, కరివేపాకు – 1 రెమ్మ, కొత్తిమీర – కొద్దిగా (గార్నిష్ కోసం, నూనె – తగినంత
తయారీ విధానం:
శుభ్రపరచడం: ముందుగా, నమ్మకమైన షాప్ నుండి తెచ్చుకున్న నల్ల (మేక రక్తాన్ని) ను శుభ్రంగా కడగాలి. ముందు, వెనక బాగా నీట్ గా కడిగి, ఒక గిన్నెలోకి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉండేలా చూసుకోవాలి.
అల్లం-వెల్లుల్లి పేస్ట్: మిక్సీలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క వేసి, కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి.
వేయించుట: ఇప్పుడు పొయ్యిపై ఒక కడాయి పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.
మసాలా దినుసులు: అందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత, ఇందాక మిక్సీ పట్టుకున్న అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను వేసి, పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి.
కారం, గరం మసాలా: ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఇంట్లో తయారుచేసిన గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసి, అడుగంటకుండా జాగ్రత్తగా చిన్న చిన్నగా కలుపుకోవాలి.
నల్ల ముక్కలను కలుపుట: ఇప్పుడు, ముక్కలుగా చేసి పెట్టుకున్న నల్లని ఈ మసాలా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. నల్ల నుండి సహజంగా నీరు వస్తాయి. ఆ నీరంతా పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి. ఈ ప్రక్రియలో నల్ల ముక్కలు మసాలాతో కలిసి చక్కగా ఉడుకుతాయి.
నీరంతా ఇంకిపోయి, నల్ల కూర పొడిగా మారిన తర్వాత, ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా కలపాలి. చివరిగా, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి దించేసుకోవాలి.
ఇంతటితో రుచికరమైన గోట్ బ్లడ్ కర్రీ, అంటే నల్ల కూర సిద్ధం. ఈ నల్ల కూరను వేడి వేడి అన్నం, రొట్టెలు, చపాతీలతో తింటే దాని రుచి అద్భుతంగా ఉంటుంది. కొత్త రుచులను కోరుకునే వారికి, సంప్రదాయ వంటకాలను ఇష్టపడే వారికి ఈ వంటకం ఒక చక్కని ఎంపిక.. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈసారి ఈ నల్ల కూరను ప్రయత్నించి చూడండి.
అయితే.. నల్లా ఫ్రేష్‌గా ఉంటేనే బాగుంటుంది.. నిల్వ ఉన్న పదార్థాలను అస్సలు తినవద్దు.. తెచ్చుకోవద్దు.. అలాంటివి తినడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
