RBI Gold is Back: భారత్‌కు చేరిన లక్ష కిలోల బంగారం.. ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చిన రిజర్వ్ బ్యాంక్

పసిడి పరుగులు తీస్తూ భారత్‌కు చేరుకుంది. ఒకటి కాదు రెండు కాదు. అక్షరాలా లక్ష కిలోల బంగారం.. భారత గడ్డపై దిగింది. ఏక్‌దమ్మున వంద టన్నుల బంగారాన్ని లండన్ నుంచి ఇండియాకు తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారత్‌లో మళ్లీ స్వర్ణ యుగం మొదలైంది. ఇప్పుడు స్వర్ణ భారత్‌....24 కేరట్స్‌ బంగారంలా మెరిసిపోతోంది. కొత్త బంగారు లోకంగా మారిన భారత్‌.. సరికొత్త స్వర్ణ చరిత్రకు శ్రీకారం చుట్టింది.

RBI Gold is Back: భారత్‌కు చేరిన లక్ష కిలోల బంగారం.. ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చిన రిజర్వ్ బ్యాంక్
Rbi Gold Vault
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 01, 2024 | 7:57 AM

పసిడి పరుగులు తీస్తూ భారత్‌కు చేరుకుంది. ఒకటి కాదు రెండు కాదు. అక్షరాలా లక్ష కిలోల బంగారం.. భారత గడ్డపై దిగింది. ఏక్‌దమ్మున వంద టన్నుల బంగారాన్ని లండన్ నుంచి ఇండియాకు తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారత్‌లో మళ్లీ స్వర్ణ యుగం మొదలైంది. ఇప్పుడు స్వర్ణ భారత్‌….24 కేరట్స్‌ బంగారంలా మెరిసిపోతోంది. కొత్త బంగారు లోకంగా మారిన భారత్‌…సరికొత్త స్వర్ణ చరిత్రకు శ్రీకారం చుట్టింది.

అది 1990. అప్పటి జనతాదళ్‌ సర్కార్ అసమర్థ పాలనతో దేశం దివాలా అంచులకు చేరుకుంది. ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ నిల్వలు అడుగంటాయి. దిగుమతులు చేసుకుంటే చెల్లించడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. చేసేదిలేక అప్పటి కేంద్ర ప్రభుత్వం.. ఏకంగా విదేశాల్లోని మన రాయబార కార్యాలయాలను తాకట్టు పెట్టే దుస్థితికి చేరుకుంది. అప్పటికీ పరిస్థితి మెరుగు పడకపోవడంతో 47 టన్నుల బంగారాన్ని ఢిల్లీలోని ఆర్బీఐ వాల్టుల నుంచి ఇంగ్లండ్‌కు నౌకల ద్వారా తరలించి అక్కడ తాకట్టు పెట్టారు. ఆర్థిక గండం నుంచి గట్టెక్కారు.

అపర చాణక్యుడు పీవీ నరసింహారావు

ఆ తర్వాత భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టిన అపర చాణక్యుడు పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ కలిసి మ్యాజిక్‌ చేశారు. ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించారు. ఇంగ్లండ్‌లో తాకట్టు పెట్టిన బంగారాన్ని కూడా విడిపించారు. అయితే దాన్ని దేశానికి తీసుకుని రాకుండా యూకేలోనే ఉంచేశారు. దానికి కారణాలు లేకపోలేదు. బ్రిటన్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో ప్రపంచంలోని చాలా దేశాలు తమ బంగారం నిల్వలు దాచుకుంటాయి. అవి సురక్షితంగా ఉండడమే కాకుండా, ఆయా దేశాలకు స్టోరేజీ ఖర్చులు, ఇబ్బందులు తప్పుతాయి. ప్రపంచంలో పసిడి నిల్వలు స్టోరేజీ చేసే బ్యాంకుల్లో ఇంగ్లండ్‌ బ్యాంక్‌ది రెండో స్థానం.

భారీగా బంగారాన్ని కొనుగోలు చేసిన భారత్‌

ఆ తర్వాత మరిన్ని టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన భారత్‌.. ఆ పసిడిని కూడా బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లోనే స్టోరేజ్‌ చేసింది. ఇప్పుడు బ్రిటన్ బ్యాంకు నేల మాళిగల్లో మొత్తం 513 టన్నుల మనం బంగారం మూలుగుతోంది. ఇప్పుడు దానిలో 100 టన్నుల బంగారం.. అంటే లక్ష కిలోల గోల్డ్‌ని ప్రత్యేక విమానాల ద్వారా ఇండియాకు తీసుకొచ్చి, భారత రిజర్వ్ బ్యాంక వాల్టుల్లో భద్రపరిచారు. 1991 తర్వాత ఇంత బంగారాన్ని తరలించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

యూకే బ్యాంక్‌లోనే భద్రంగా భారత బంగారం

ఇక 2017 నుంచి ఆర్బీఐ భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. 2009లో 200 టన్నుల బంగారాన్ని IMF నుంచి కొనుగోలు చేసింది. అప్పటినుంచి ఆర్బీఐ తన పసిడి పరుగులు ఆపలేదు. బంగారాన్ని ప్రతి ఏటా కొంటూనే ఉంది. మన దేశపు మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో బంగారం వాటా దాదాపు 8 శాతం ఉంటుంది. ఈ ఏడాది మార్చికి ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం నిల్వలు అక్షరాలా 822 టన్నులు. వీటిలో 413 టన్నుల బంగారం ఇంకా యూకే బ్యాంక్‌లోనే భద్రంగా ఉంది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో 27 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది.

భారీగా బంగారం కొంటున్న చైనా, రష్యా

మరోవైపు చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ కూడా తెగ బంగారం కొంటోంది. అటు రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌ కూడా అదే బంగారపు బాటలో పయనిస్తోంది. ఇలా చాలా దేశాలు తమ పుత్తడి నిల్వలను పెంచుకుంటున్నాయి. అమెరికన్‌ డాలర్‌ మీద ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికే చాలా దేశాలు ఇలా చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ఇన్‌ఫ్లేషన్‌కు అడ్డుకట్ట వేయడానికి కూడా పసిడి నిల్వలు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు.

ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే..!

ప్రపంచంలో అత్యధికంగా అమెరికా దగ్గర 8,133.46 టన్నుల బంగారం మూలుగుతోంది. రెండో స్థానంలో ఉన్న జర్మనీలో 3,352.65 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న ఇటలీ దగ్గర 2,451.84 టన్నుల బంగారం ఉంది. ఇక ఫ్రాన్స్‌ దగ్గర 2,436.88 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఐదో స్థానంలో ఉన్న రష్యాలో 2,332.74 బంగారం నిల్వలు ఉన్నాయి. చైనా దగ్గర 2,262.45 టన్నుల బంగారం ఉంది. స్విట్జర్లాండ్‌లో 1040 టన్నుల పుత్తడి ఉంది. జపాన్‌ బ్యాంక్‌లో 845.97 టన్నుల బంగారం మూలుగుతోంది. ఇక పుత్తడి నిల్వల్లో ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉన్న మన భారత్‌లో 822.09 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. నెదర్లాండ్స్‌లో 612.45, టర్కీలో 570.30, తైవాన్‌లో 423.63, పోర్చుగల్‌లో 382.63, పోలెండ్‌లో 359.89, ఉజ్బెకిస్తాన్‌లో 357.69, సౌదీ అరేబియాలో 323.07, కజకిస్తాన్‌లో 310.62, ఇంగ్లండ్‌లో 310.29, లెబనాన్‌లో 286.83, స్పెయిన్‌లో 281.58 టన్నుల బంగారం నిల్వల ఉన్నాయి.

భారత్‌కు స్వర్ణ యుగం ప్రారంభమైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది కొనసాగాలంటే.. దేశంలో శాంతి సుస్థిరతలు ఉండాలని, కేంద్రంలో బలమైన నాయకత్వం ఉండాలని వాళ్లు సూచిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..